అతడి సెలక్షన్‌ దారుణం.. ఇప్పటికైనా సంతోషమే! | IND vs SL Agarkar Gambhir Slammed For Picking Auqib Nabi As Replacement | Sakshi
Sakshi News home page

అతడి సెలక్షన్‌ దారుణం.. ఇప్పటికైనా సంతోషమే!

Aug 7 2026 11:00 AM | Updated on Aug 7 2026 11:06 AM

IND vs SL Agarkar Gambhir Slammed For Picking Auqib Nabi As Replacement

ఆకిబ్‌ నబీ (Photo Credit: BCCI X)

టీమిండియా యాజమాన్యం తీరుపై భారత మాజీ క్రికెటర్‌ వసీం జాఫర్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. జమ్మూ కశ్మీర్‌ పేసర్‌ ఆకిబ్‌ నబీ విషయంలో సెలక్టర్ల తీరు సరిగా లేదని విమర్శించాడు. కాగా రంజీ ట్రోఫీ టోర్నీలో గత రెండేళ్లుగా ఆకిబ్‌ అదరగొడుతున్న సంగతి తెలిసిందే.

గత రెండు సీజన్లలో ఏకంగా వందకు పైగా వికెట్లు తీసిన ఆకిబ్‌ నబీ.. జమ్మూ కశ్మీర్‌ తొలిసారి రంజీ టైటిల్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో అఫ్గానిస్తాన్‌తో స్వదేశంలో ఇటీవల జరిగిన ఏకైక టెస్టు సందర్భంగా అతడు టీమిండియా తరఫున అరంగేట్రం చేస్తాడని అంతా భావించారు.

అపుడు మొండిచేయి
కానీ టీమిండియా సెలక్టర్లు మాత్రం నబీకి మొండిచేయి చూపారు. సీనియర్ల గైర్హాజరీలో గుర్నూర్‌ బ్రార్‌, హర్ష్‌ దూబేలను తొలిసారి జాతీయ జట్టుకు ఎంపిక చేశారు. అయితే, వీళ్లిద్దరికి ఈ మ్యాచ్‌లో ఆడే అవకాశం రాకపోయినా.. ఆ తర్వాత ఇద్దరూ వైట్‌బాల్‌ క్రికెట్‌లో అరంగేట్రం చేశారు.

ఇదిలా ఉంటే.. శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులోనూ ఆకిబ్‌ నబీకి తొలుత స్థానం దక్కలేదు. అయితే, ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా మోకాలి గాయం నుంచి కోలుకోకపోవడంతో ఎట్టకేలకు నబీకి సెలక్టర్లు పిలుపునిచ్చారు. బుమ్రాకు ప్రత్యామ్నాయంగా నబీని ఎంపిక చేశారు.

అతడి సెలక్షన్‌ దారుణం.. 
ఈ నేపథ్యంలో భారత మాజీ బ్యాటర్‌ వసీం జాఫర్‌ నబీ విషయంలో సెలక్టర్ల తీరును తప్పుబట్టాడు. ‘‘నిజంగా ఇదొక గొప్ప విషయం. నాకు చాలా సంతోషంగా ఉంది. దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా ఆడిన తర్వాత ఎట్టకేలకు ఆకిబ్‌ నబీకి జాతీయ జట్టులో చోటు దక్కింది.

ఇప్పటికైనా సంతోషమే!
అయితే, అతడు రీప్లేస్‌మెంట్‌లా కాకుండా ముందుగానే జట్టులోకి రావాల్సింది. అయినా ఎప్పటికీ ఎంపిక చేయకపోవడం కంటే.. ఆలస్యంగానైనా పిలుపునివ్వడం మంచిదే. ఏదేమైనా శ్రీలంకకు ఎంపిక చేసిన జట్టులో ప్రధాన ఆటగాడిగా ఉండేందుకు అతడు అర్హుడు. కానీ ఆలస్యమైనా అతడికి మంచే జరిగింది’’ అని వసీం జాఫర్‌ పేర్కొన్నాడు.

కాగా నబీ ఇటీవల శ్రీలంక-ఎ జట్టుతో అనధికారిక టెస్టు సిరీస్‌లో భారత్‌-ఎ తరఫున ఆరు వికెట్లతో రాణించాడు. ఇదిలా ఉంటే.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2025-27లో భాగంగా రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడేందుకు టీమిండియా శ్రీలంకకు వెళ్లింది. ఇరుజట్ల మధ్య ఆగష్టు 15 నుంచి తొలి టెస్టు.. ఆగష్టు 23 నుంచి రెండో టెస్టు మొదలుకానుంది. ఇందుకు గాలె, కొలంబో వేదికలు.

శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు భారత జట్టు
శుబ్‌మన్ గిల్ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, కేఎల్ రాహుల్ (వైస్‌ కెప్టెన్‌), రిషబ్ పంత్ (వికెట్‌ కీపర్‌), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్‌ కీపర్‌), మహ్మద్‌ సిరాజ్, ప్రసిద్‌ కృష్ణ, కుల్దీప్ యాదవ్, సారాంశ్ జైన్, ఆకిబ్‌ నబీ, మానవ్ సుతార్, గుర్నూర్ బ్రార్‌.

చదవండి: వాళ్లిద్దరికి కంగ్రాట్స్‌.. ప్రతీ ప్రశ్నకు సమాధానమిస్తాం: గంభీర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement