నబీ, గంభీర్ (PC: BCCI X)
టీమిండియా కీలక సిరీస్‌కు సిద్ధమైంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) 2025-27 సీజన్‌లో భాగంగా శ్రీలంకతో రెండు మ్యాచ్‌లు ఆడనుంది. అయితే, అంతకంటే ముందు శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు శ్రీలంక ఎలెవన్‌తో భారత్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది.
కాగా డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో ఉండాలంటే టీమిండియా ఆతిథ్య శ్రీలంకను 2-0 తేడాతో వైట్‌వాష్ చేయాల్సిందే. ఇక ఈ సిరీస్ కంటే ముందు డబ్ల్యూటీసీలో భాగంగా సౌతాఫ్రికాతో స్వదేశంలో రెండు టెస్టులు ఆడిన గిల్ సేన.. ప్రొటిస్ జట్టు చేతిలో దాదాపు పాతికేళ్ల తర్వాత 2-0తో క్లీన్‌స్వీప్ అయిన సంగతి తెలిసిందే.
దీంతో హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఇక ఇటీవల గంభీర్ మార్గదర్శనంలో టీమిండియా వరుస టీ20 సిరీస్‌లలో వైట్‌వాష్‌లు ఎదుర్కొంది. ఐర్లాండ్ చేతిలో 2-0, ఇంగ్లండ్ చేతిలో 4-0తో క్లీన్‌స్వీప్ అయింది. ఈ పరిణామాల నేపథ్యంలో గంభీర్‌కు శ్రీలంక టెస్టు సిరీస్ అగ్నిపరీక్షగా నిలిచింది.
ఈ నేపథ్యంలో శ్రీలంక గడ్డపై ప్రాక్టీస్ మ్యాచ్‌కు ముందు రోజు గంభీర్ జట్టు సభ్యులను ఉద్దేశించి స్ఫూర్తిదాయక వ్యాఖ్యలు చేశాడు. ఆటగాళ్లంతా పూర్తి స్థాయి సామర్థ్యంలో సత్తా చాటేందుకు సిద్ధంగా ఉండాలని, తమ బాధ్యత ఏమిటో అందరూ గుర్తించాలని వారికి సూచించాడు.
‘మన ఎదురుగా ఎలాంటి లక్ష్యం ఉందో, ఎందుకు ఆడుతున్నామో అందరికీ తెలుసు. అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వగల సత్తా మనకు ఉంది. ఆగస్టు 15 ఉదయం ముందుగా బ్యాటింగ్ చేసినా, ముందుగా బౌలింగ్ చేసినా మనం దేనికైనా సిద్ధంగా ఉండాలి. మనపైకి సంధించే ప్రతీ ప్రశ్నకు మన వద్ద సమాధానం ఉండాలి.
ఇక కొత్తగా జట్టులోకి వచ్చి న సారాంశ్ జైన్, ఆకిబ్ నబీలకు నా అభినందనలు. ఈ స్థాయి వరకు వచ్చేందుకు ఎంతో శ్రమించిన మీరు మీ కుటుంబ సభ్యులు, దేశం గర్వించేలా ఆడాలి’ అని గంభీర్ వ్యాఖ్యానించాడు.
కాగా 33 ఏళ్ల స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ సారాంశ్ జైన్, జమ్మూ కశ్మీర్ పేసర్ ఆకిబ్ నబీ శ్రీలంకతో టెస్టుల సందర్భంగా తొలిసారి టీమిండియాలో చోటు దక్కించుకున్నారు. వాషింగ్టన్ సుందర్ స్థానంలో సారాంశ్, జస్‌ప్రీత్ బుమ్రాకు ప్రత్యామ్నాయంగా నబీ జట్టులోకి వచ్చారు.


