టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (PC: BCCI X)
టెస్టు సిరీస్ ఆడేందుకు టీమిండియా ఇప్పటికే శ్రీలంకకు చేరుకుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27 సీజన్‌లో భాగంగా ఇరుజట్ల మధ్య రెండు మ్యాచ్‌లు జరుగనుండగా.. ఇందుకు గాలె, కొలంబో వేదికలు. అయితే, తొలి టెస్టు కంటే ముందు భారత్ శ్రీలంక ఎలెవన్‌తో శుక్రవారం నుంచి మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో తలపడనుంది.
టీమిండియా అసంతృప్తి
కొలంబోలోని నోండెస్ప్రిప్ట్స్ క్రికెట్ క్లబ్ (NCC)లో ఈ ప్రాక్టీస్ మ్యాచ్ జరుగనుంది. కాగా శ్రీలంకలో పిచ్‌లు స్పిన్నర్లకు అనుకూలిస్తాయన్న అభిప్రాయాల నేపథ్యంలో.. ప్రాక్టీస్ మ్యాచ్ కోసం NCC తయారు చేసిన వికెట్ మాత్రం భారత శిబిరానికి అస్సలు నచ్చలేదని సమాచారం. పిచ్ మీద పచ్చిక ఉండటం ఏమిటని భారత బృందం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
ఈ విషయం గురించి NCC అధికారి ఫ్రాంకీ రెవ్‌స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. ‘‘వికెట్ మీద పచ్చిక ఎక్కువగా ఉందని భారత క్రికెట్ జట్టు చెప్పింది. నిజానికి ఇది మూడు రోజుల మ్యాచ్ కాబట్టే మేమిలా గ్రాస్ వదిలేశాము. పచ్చిక లేకుండా వికెట్ ఇవ్వడం సరికాదు. ఇదొక మంచి వికెట్.
బ్యాటింగ్‌కు అనుకూలం
ఏదో ఒక జట్టుకు అనుకూలంగా ఉండేలా మేము ఇది తయారు చేయలేదు. ఆయా జట్ల సత్తాను బట్టే వాళ్లు ముందుకు వెళ్లగలరు. నిజానికి శ్రీలంక క్రికెట్ అభ్యర్థన మేరకే మేము ఇలాంటి పిచ్ తయారు చేశాము. NCC వికెట్లు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటాయి.
ఇక్కడ భారీ స్కోర్లు నమోదవుతాయని మేము భావిస్తున్నాము. గాలె మ్యాచ్ కంటే ముందు భారత బ్యాటర్లకు ఇక్కడ మంచి ప్రాక్టీస్ లభిస్తుందని చెప్పగలను. మా వికెట్ రెండు లేదా మూడో రోజు నుంచి స్పిన్నర్లకు అనుకూలిస్తుందని చెప్పగలము.
ఇరుజట్లకూ కీలకం
అయితే, ఇక్కడ టాస్ గెలిచిన వాళ్లు ముందుగా బ్యాటింగ్ చేస్తేనే మంచిది. మేము ఎల్లప్పుడూ మంచి వికెట్లనే రూపొందిస్తాము. పక్షపాతం ఉండదు’’ అని పేర్కొన్నారు. కాగా డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో ఉండాలంటే టీమిండియా కచ్చితంగా శ్రీలంకను 2-0తో వైట్‌వాష్ చేయాల్సిందే.
మరోవైపు.. శ్రీలంక సైతం సొంతగడ్డపై సత్తా చాటి తామూ పోటీలో నిలవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరుజట్లకు ఈ సిరీస్ కీలకం కాగా.. పిచ్ రూపకల్పన కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా భారత్- శ్రీలంక మధ్య ఆగష్టు 15 నుంచి తొలి టెస్టు.. ఆగష్టు 23 నుంచి రెండో టెస్టు మొదలుకానుంది.
చదవండి: ఈ టీమిండియా క్రికెటర్లు ప్రభుత్వ ఉద్యోగులు.. ఎవరికి ఏ జాబ్?


