Photo Credit: BCCI Twitter
టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భవిష్యత్తులో వైట్‌బాల్ ఫార్మాట్‌లో తనదైన ముద్ర వేయగల సామర్థ్యం వైభవ్ కలిగి ఉన్నాడని ఊతప్ప అభిప్రాయపడ్డాడు. గతంలో పృథ్వీ షా తక్కువ వయసులోనే జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ, ఆ తర్వాత వేరే విషయాలపై దృష్టి పెట్టడంతో కెరీర్ దారి తప్పిందని, వైభవ్ అలా దారి తప్పకూడదని పరోక్షంగా హెచ్చరించాడు.
ఒక మీడియా చానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఊతప్ప మాట్లాడాడు. ‘వైట్‌బాల్ క్రికెట్‌లో దిగ్గజం సచిన్ టెండూల్కర్ కంటే వైభవ్ ఎక్కువ ప్రభావం చూపగలడు. ఎందుకంటే సచిన్ లాగే చిన్న వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌లో ఎంట్రీ ఇచ్చాడు. సచిన్ ఎంతటి పేరు ప్రతిష్టలు సాధించాడన్నది అందరికీ తెలిసింది. మరి వైభవ్ దానిని ఎలా నిలబెట్టుకుంటాడనేది ఆసక్తిగా మారింది.
అంధఃపాతాళానికి పృథ్వీ షా..
‘భారత క్రికెట్‌లో చిన్న వయసులో ఎంట్రీ ఇచ్చిన వాళ్లలో పైకి వచ్చినవాళ్లను అరుదుగా చూశాం. ఉదాహరణకు వినోద్ కాంబ్లీ, పృథ్వీ షాలను తమ కెరీర్‌ను 17-18 ఏళ్ల వయసులోనే ప్రారంభించారు. ఈ ఇద్దరు భారత క్రికెట్‌లో ఎంతో ముద్ర వేస్తారని అంతా భావించారు. కాంబ్లీ సంగతి పక్కనబెడితే, పృథ్వీ షా కెరీర్ ట్రాక్ తప్పడానికి ప్రధాన కారణం అతడి వయస్సే. చిన్న వయసులోనే స్టార్‌డమ్ చూసిన పృథ్వీ షాకు కెరీర్ కంటే మిగతా విషయాలపై ఫోకస్ పెరిగింది.
గర్ల్‌ఫ్రెండ్స్ మోజుతో పాటు ఎండార్స్‌మెంట్ రూపంలో యాడ్ చేయడంతో సంపాదనపై ఆసక్తి పెరిగింది. దీంతో ఎంతో భవిష్యత్తు ఉన్న పృథ్వీ షా కెరీర్ అంధఃపాతాళానికి పడిపోయింది. కాబట్టి వైభవ్ సూర్యవంశీకి అతడి వయస్సే పెద్ద సవాల్ కానుంది. ప్రస్తుతం 15 ఏళ్ల వయసున్న వైభవ్ రానున్న ఐదేళ్ల పాటు ఎలాంటి మచ్చ లేకుండా ఆటపై దృష్టి పెడతాడా అన్నది చూడాలి. వీలైనంత వరకు వయసు రీత్యా గర్ల్‌ఫ్రెండ్స్‌పై మోజు, ఎడాపెడా ఎండార్స్‌మెంట్లకు సంతకాలు చేయడం వంటి వాటికి దూరంగా ఉండాలి.
సరైన దారిలోనే..
ఇప్పటికైతే వైభవ్ తనకు ఎలాంటి ఎండార్స్‌మెంట్ ఆఫర్ వచ్చినా ఆలోచించి అడుగు వేస్తున్నాడు. అంతేకాదు కేవలం ఆటపైనే దృష్టి పెట్టడం నాకు చాలా బాగా నచ్చింది. ఇది ఇలాగే కంటిన్యూ చేస్తే వైట్‌బాల్‌లో సచిన్‌ను మించిన అద్భుతం అవుతాడు. అలా కాదని వ్యవహరిస్తే మాత్రం మరో పృథ్వీషాగా మిగిలిపోవడం ఖాయం. ఇప్పటికిప్పుడు సచిన్‌తో పోల్చడం సరైన చర్య కాకపోయినప్పటికీ, వైభవ్‌లో దాగున్న అపారమైన సామర్థ్యం అతడిని ప్రత్యేకంగా నిలుపుతుంది’ అని చెప్పుకొచ్చాడు.
Read: సామ్ బిల్లింగ్స్ సిక్సర్ల వర్షం.. దూసుకెళ్తున్న ట్రెంట్ రాకెట్స్


