వన్డే ప్రపంచకప్-2027కు ఆతిథ్యమిచ్చేందుకు సౌతాఫ్రికా, నమీబియా, జింబాబ్వే వంటి ఆఫ్రికా దేశాలు సిద్దమవుతున్నాయి. వచ్చే ఏడాది ఆక్టోబర్‌లో ప్రారంభమయ్యే ఈ మెగా టోర్నీ కోసం ఇప్పటికే వేదికలను సైతం ఐసీసీ ఖారారు చేసింది. మొత్తం మూడు దేశాల్లోని 12 నగరాల్లో ఈ ఈవెంట్ జరగనుంది.
అయితే ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌కు ఇంకా 14 నెలల సమయం ఉన్నప్పటికి ఇప్పటి నుంచే భారత జట్టు ఎంపికపై అంచనాలు మొదలయ్యాయి. 2011 తర్వాత ఇప్పటివరకు వన్డే ప్రపంచకప్ గెలవని టీమిండియా.. వచ్చే ఏడాది జరిగే మెగా టోర్నీని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
ఈ మెగా టోర్నీ కోసం పటిష్టమైన జట్టును ఆఫ్రికాకు పంపాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ నేపథ్యంలో వరల్డ్‌కప్ కోసం భారత జట్టును దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అంచనా వేశారు. కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌తో పాటు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ వంటి స్టార్ బ్యాటర్లకు గవాస్కర్ టాప్-5లో చోటిచ్చారు. అదేవిధంగా వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్‌ను ఆయన ఎంపిక చేశారు.
ఆల్‌రౌండర్ల కోటాలో హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డికి, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా గవాస్కర్ ఛాన్స్ ఇచ్చారు. అయితే రవీంద్ర జడేజా భారత వన్డే ప్రపంచకప్ లేనిట్లు తెలుస్తోంది. అఫ్గానిస్తాన్, ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లకు జడేజాను సెలక్టర్లు ఎంపిక చేయలేదు.
అయినప్పటికి జడేజా లాంటి సీనియర్ ఆల్‌రౌండర్‌ను వరల్డ్‌కప్‌కు ఎంపిక చేయాలని సెలక్టర్లు సన్నీ సూచించారు. ఇక బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్‌లకు గవాస్కర్ అవకాశమిచ్చారు.
కాగా హర్షిత్ రాణాను భారత జట్టుకు ఎంపిక చేయడంపై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. గంభీర్ సపోర్ట్‌తోనే అతడికి జట్టులో చోటు దక్కుతుందని చాలా మంది మాజీ క్రికెటర్లు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో గవాస్కర్ వంటి లెజెండరీ క్రికెటర్ హర్షిత్‌ను వరల్డ్‌కప్‌కు ఎంపిక చేయమని సూచించడం గమనార్హం.
గవాస్కర్ ఎంపిక చేసిన భారత జట్టు ఇదే
శుబ్‌మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా , జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్


