తీవ్ర అసంతృప్తిలో గిల్‌, గంభీర్‌.. వాళ్లపై బీసీసీఐ వేటు! | BCCI Set to Sack Head Physio Over Team India Injury Crisis | Sakshi
Sakshi News home page

BCCI: గాయాల బెడద.. వాళ్లపై వేటుకు రంగం సిద్ధం!

Aug 3 2026 11:55 AM | Updated on Aug 3 2026 12:14 PM

Team India set to address injury crisis Amid Frequent Setbacks

PC: BCCI X

ఇటీవలి కాలంలో టీమిండియాకు గాయాల బెడద ఎక్కువైంది. కీలక ఆటగాళ్లంతా జట్టుకు అవసరమైన సమయంలో అందుబాటులో లేకుండా పోతున్నారు. జట్టు విజయావకాశాలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది.

పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా ఐపీఎల్‌-2026 తర్వాత ఇంగ్లండ్‌ పర్యటనకు ఎంపికయ్యాడు, అయితే, గాయం వల్ల టూర్‌ మొత్తానికి అతడు దూరమయ్యాడు. పాండ్యా మాదిరే అరుదైన నైపుణ్యాలున్న నితీశ్‌ కుమార్‌ రెడ్డి కూడా గాయపడ్డాడు.

యువ పేసర్‌ హర్షిత్‌ రాణాతో పాటు స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌, ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా, యువ పేస్‌ బౌలర్‌ ప్రిన్స్‌ యాదవ్‌ ఇటీవలే ఈ గాయాల జాబితాలో చేరారు. ఈ నేపథ్యంలో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

ఫిజియోథెరపీ టీమ్‌లో సమూలంగా మార్పులు చేపట్టేందుకు బోర్డు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇంజూరీ మేనేజ్‌మెంట్‌, ఫిట్‌నెస్‌ క్లియరెన్స్‌ల విషయంలో స్పష్టత లేదని.. ఇందుకు హెడ్‌ ఫిజియోథెరపిస్ట్‌ నిర్లక్ష్యమే కారణమని యాజమాన్యం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.

హర్షిత్‌ రాణా, వరుణ్‌ చక్రవర్తి, నితీశ్‌ కుమార్‌ రెడ్డి వంటి ఆటగాళ్లు క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌తో తిరిగి వచ్చిన తర్వాత.. ఆ వెంటనే మళ్లీ గాయాల బారిన పడటాన్ని ఇందుకు నిదర్శనంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హెడ్‌ ఫిజియోథెరపిస్ట్‌ కమలేశ్‌ జైన్‌, టీమ్‌ డాక్టర్‌ రిజ్వాన్‌ ఖాన్‌లపై వేటు వేసేందుకు బీసీసీఐ సిద్ధమైనట్లు సమాచారం.

ఈ విషయం గురించి బీసీసీఐ సన్నిహిత వర్గాలు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘కమలేశ్‌ జైన్‌ విషయంలో మేనేజ్‌మెంట్‌ అసంతృప్తితో ఉంది. ఆటగాళ్లు తరచూ గాయాలబారిన పడటం వల్ల కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌, హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ తమ తుదిజట్టు కూర్పులో ఇబ్బంది పడుతున్నారు.

పదిహేను మంది సభ్యులు ఉన్నప్పటికీ సరైన కాంబినేషన్‌ని సెట్‌ చేయలేక తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గాయాల విషయంలో సిబ్బంది పూర్తి అవగాహన, స్పష్టతతో ఉండాలి. ఆటగాళ్లను తిరిగి మైదానంలోకి పంపేందుకు తొందరపడకూడదు.

వారు పూర్తి ఫిట్‌నెస్‌ సాధించిన తర్వాతే సర్టిఫికెట్‌ జారీచేయాలి. హడావుడిగా రంగంలోకి దించడం వల్ల పరిస్థితి మళ్లీ మొదటికే వస్తుంది. నితీశ్‌ రెడ్డి, హర్షిత్‌ రాణా విషయంలో ఇదే జరిగింది. ఇలాంటి తొందరపాటు చర్యలు కీలక సమయంలో జట్టు విజయావకాశాలను దెబ్బతీస్తాయి. అందుకు సదరు బృందం కచ్చితంగా జవాబుదారీగా ఉండాల్సిందే. వారి నుంచి సరైన వివరణ లభించకపోతే వేటు తప్పకపోవచ్చు’’ అని పేర్కొన్నాయి.

కాగా ఆటగాళ్లు తరచూ గాయపడటం పట్ల టెస్టు, వన్డే జట్ల కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ బహిరంగంగానే అసంతృప్తి వెళ్లగక్కిన సంగతి తెలిసిందే. ఒకటి, రెండు మ్యాచ్‌ల తర్వాత ఆటగాళ్లు గాయపడితే.. వన్డే వరల్డ్‌కప్‌-2027 వంటి మేజర్‌ టోర్నీలో తమకు ఇబ్బందులు తప్పవన్నాడు. ఫిట్‌నెస్‌ సమస్యలు మెరుగుపరచుకుంటేనే అనుకున్న ఫలితాలు రాబట్టగలమని పేర్కొన్నాడు. 

ఈ నేపథ్యంలోనే అతడు బీసీసీఐ వైద్య బృందాన్ని కాదని.. చికిత్స కోసం బయటి డాక్టర్లను సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. కాగా గిల్‌ తరచూ మెడనొప్పి, కండరాల నొప్పితో బాధపడుతున్న సంగతి తెలిసిందే.

చదవండి: బుమ్రా అవుట్‌.. రీప్లేస్‌మెంట్‌ ప్రకటించిన బీసీసీఐ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement