నాడు సన్మానాలు, సత్కారాలు.. తర్వాత తొక్కిపడేశారు! | After Making History At Paris Olympics, Arshad Nadeem Struggles At CWG 2026 Amid Questions Over Pakistan Support | Sakshi
Sakshi News home page

నాడు సన్మానాలు, సత్కారాలు.. తర్వాత తొక్కిపడేశారు!

Aug 3 2026 9:39 AM | Updated on Aug 3 2026 10:25 AM

Was Pakistan Athletics Disown Arshad Nadeem Ahead Of CWG 2026

PC: X

ఒలింపిక్స్‌లో పాకిస్తాన్‌కు మొట్టమొదటి వ్యక్తిగత స్వర్ణ పతకం అందించిన అథ్లెట్‌ అర్షద్‌ నదీమ్‌. పారిస్‌ ఒలింపిక్స్‌-2024లో అనూహ్య రీతిలో ఈ జావెలిన్‌ త్రోయర్‌ ఈటెను 92.97 మీటర్ల దూరం విసిరి పసిడి పతకం కైవసం చేసుకున్నాడు. తద్వారా విశ్వక్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన జావెలిన్‌ త్రోయర్‌గా ప్రపంచ రికార్డు సాధించాడు.

ఈ క్రమంలో పాకిస్తాన్‌లో అర్షద్‌ నదీమ్‌పై ప్రశంసల వర్షం కురిసింది. అత్యంత సాధారణ కుటుంబం నుంచి వచ్చిన అతడు సన్మానాలు, సత్కారాలతో ఉక్కిరిబిక్కిరయ్యాడు. కానీ ఆ తర్వాత పరిస్థితి మారిపోయింది. అతడి ప్రదర్శన రోజురోజుకీ దిగజారిపోయింది.

చేదు అనుభవం
తాజాగా కామన్‌వెల్త్‌ గేమ్స్‌-2026లో డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన అర్షద్‌ నదీమ్‌.. కనీసం కాంస్యం కూడా గెలవలేకపోయాడు. తొలి ప్రయత్నంలోనే ఫౌల్‌ కావడంతో అతడికి ఫైనల్‌ రౌండ్‌లో చేదు అనుభవం ఎదురైంది. టాప్‌-8కు చేరలేక అతడు ఎలిమినేట్‌ అయ్యాడు. గత ఎడిషన్‌లో పసిడితో మెరిసిన అతడు ఈసారి కనీసం కాంస్యం కూడా లేకుండానే వెనుదిరిగాడు.

చెప్పినట్లు వినలేదని...
అయితే, ఇందుకు పాకిస్తాన్‌ అమెచూర్‌ అథ్లెటిక్స్‌ ఫెడరేషన్‌ (PAAF)తో అతడికి ఉన్న విభేదాలే కారణం అని తెలుస్తోంది. PAAF అభీష్టానికి వ్యతిరేకంగా అర్షద్‌.. సల్మాన్‌ బట్‌ను తన కోచ్‌గా ఎంచుకున్నట్లు సమాచారం. నిజానికి సల్మాన్‌పై PAAF 2025 అక్టోబరులో జీవితకాల నిషేధం విధించింది. ఆ తర్వాత నెల రోజుల వ్యవధిలోనే నిషేధం ఎత్తివేసింది.

దీంతో అర్షద్‌ సల్మాన్‌ మార్గదర్శనంలో ప్రాక్టీస్‌ చేశాడు. అయితే, ఇందుకు PAAF ఏమాత్రం సహకరించలేదని సమాచారం. పాకిస్తాన్‌ క్రీడా బోర్డు సైతం అర్షద్‌ నదీమ్‌ సన్నాహకాలకు కావాల్సిన నిధులు విడుదల చేయలేదని అతడి సన్నిహిత వర్గాలు గతంలో స్థానిక మీడియాకు తెలిపాయి.

ఈ నేపథ్యంలో విదేశాల్లో ప్రాక్టీస్‌ చేయడం వీలుకాక.. లాహోర్‌లో ఎర్రటి ఎండల్లో అర్షద్‌ ప్రాక్టీస్‌ చేసినట్లు సమాచారం. కామన్‌వెల్త్‌ క్రీడల వేదికైన గ్లాస్గో (స్కాట్లాండ్‌)లో ఇందుకు పూర్తి వ్యతిరేకమైన వాతావరణం ఉండటం అతడి ప్రదర్శనపై తీవ్ర ప్రభావం చూపినట్లు తెలుస్తోంది.

అతడికి ఎంతటి దుస్థితి
ఈ పరిణామాల నేపథ్యంలో అర్షద్‌ నదీమ్‌ ఈసారిక పతకం లేకుండానే వెనుదిరిగినట్లు అతడి సన్నిహితవర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత, పాక్‌ మాజీ బాక్సర్‌ హుసేన్‌ షా ఈ విషయం గురించి మాట్లాడుతూ..

‘‘సరైన ఆదాయం లేని.. నిరుపేద కుటుంబం, చిన్న గ్రామం నుంచి వచ్చి దేశాన్ని తలెత్తుకునేలా చేసిన అథ్లెట్‌ అతడు. ఒలింపిక్స్‌, కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో దేశానికి పసిడి పతకాలు అందించాడు. కానీ ఇప్పుడు కామన్‌వెల్త్‌ గేమ్స్‌ కోసం సన్నద్ధమయ్యే వాతావరణం కూడా మా క్రీడా సంస్థ కల్పించలేకపోయింది.

పాక్‌ క్రీడా వ్యవస్థలోని లోపానికి ఇది నిలువెత్తు నిదర్శనం’’ అని హుసేన్‌ షా మండిపడ్డాడు. కాగా అంతకుముందు సల్మాన్‌తో పాటు సౌతాఫ్రికా కోచ్‌ టెర్సస్‌ లీబెన్‌బెర్గ్‌తో అర్షద్‌ ప్రాక్టీస్‌ చేసి అత్యుత్తమ ఫలితాలు అందుకున్నాడు.

సరైన సదుపాయాలు ఉంటే స్వర్ణం గెలిచేదాన్ని
మరోవైపు.. పాకిస్తాన్‌కు ఈసారి కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో ఏకైక పతకం అందించిన బాక్సర్‌ ఫాతిమా జెహ్రా సైతం పాక్‌ క్రీడా బోర్డు తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తనకు సరైన సదుపాయాలు కల్పించి ఉంటే కచ్చితంగా మెరుగైన పతకం అందించేదానినని పేర్కొంది. 

కాగా ఫాతిమా కాంస్య పతకం గెలిచింది. ఇక పాకిస్తాన్‌ నుంచి ఈసారి మొత్తంగా 36 మంది సభ్యుల బృందం గ్లాస్గోకు వెళ్లగా.. కేవలం ఒకే ఒక్క పతకం దక్కింది.

చదవండి: గిల్‌, అభిషేక్‌ శర్మ కీలక నిర్ణయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement