source: X
శ్రీలంక పర్యటనలో పాకిస్తాన్ మహిళల క్రికెట్ జట్టుకు వరుస పరాభవాలు ఎదురవుతున్నాయి. తొలుత మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను కోల్పోయిన (1-2తో) ఈ జట్టు.. తాజాగా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 0-2 తేడాతో కోల్పోయింది.
డంబుల్లా వేదికగా ఇవాళ జరిగిన రెండో టీ20లో ఆతిథ్య జట్టు పాక్‌పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. శ్రీలంక మరో 14 బంతులు (17.4 ఓవర్లు) మిగిలుండగానే కేవలం 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
కెప్టెన్ చమారీ ఆటపట్టు (40), సంజనా కవిండి (46) మెరుపు ఇన్నింగ్స్ ఆడి లంక విజయంలో కీలకపాత్ర పోషించారు. విష్మి గుణరత్నే (31), హర్షిత సమరవిక్రమ (37 నాటౌట్) కూడా ఉపయోగకరమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. ఆఖర్లో కవిష దిల్హరి (14 నాటౌట్) కూడా బ్యాట్ ఝులిపించింది. పాక్ బౌలర్లలో హనీ 2, వహీదా, అయేషా జాఫర్ తలో వికెట్ తీశారు.
అంతకుముందు పాక్ తరఫున ఓపెనర్లు మునీబా అలీ (45), షావాల్ జుల్ఫికర్ (48) రాణించారు. ఆఖర్లో ఫాతిమా (30 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. మిగతా ప్లేయర్లలో ఎమాన్ నసీర్ 21, అయేషా జాఫర్ 8, సైరా జబీన్ 16, హనీ 2 (నాటౌట్) పరుగులు చేశారు. లంక బౌలర్లలో ప్రబోధ 2, సుగంధక కుమారి, చమారీ ఆటపట్టు, కవిష దిల్హరి తలో వికెట్ తీశారు. ఈ సిరీస్‌లో నామమాత్రపు మూడో టీ20 ఆగస్ట్ 4న జరుగనుంది.


