టీమిండియా వెటరన్ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్‌ను తిరిగి జాతీయ జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్‌లు ఎక్కవుగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సైతం వన్డే ప్రపంచకప్-2027 దృష్ట్యా భువనేశ్వర్‌ను తిరిగి పిలుపునివ్వాలని సెలక్టర్లను సూచించాడు.
ఈ నేపథ్యంలో తన రీఎంట్రీపై భువీ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టులోకి తిరిగి రావడమే లక్ష్యంగా తాను ఆడట్లేదని, ఆటపై ఇష్టంతోనే క్రికెట్‌ను కొనసాగిస్తున్నాని అతడు తెలిపాడు. భువనేశ్వర్ గత నాలుగేళ్లగా భారత జట్టుకు దూరంగా ఉన్నాడు.
అయితే ఐపీఎల్, యూపీ టీ20 లీగ్స్‌లో మాత్రం క్రమం తప్పకుండా అతడు ఆడుతున్నాడు. ఆర్సీబీ వరుసగా రెండు టైటిల్స్ గెలవడంలో భువీది కీలక పాత్ర. అతడిలో ఏ మాత్రం జోరు తగ్గలేదు. అదే పేస్, స్వింగ్‌తో బౌలింగ్ చేస్తున్నాడు. అందుకే అతడు రీఎంట్రీ ఇవ్వాలని మాజీలతో పాటు అభిమానులు కోరుకుంటన్నారు.
"నేను ఐపీఎల్, డొమెస్టిక్ క్రికెట్ ఆడుతున్నానంటే దానికి కారణం ఆటపై ఉన్న ఇష్టమే. దేశం తరపున ఆడాలనే నా కలను ఇప్పటికే నెరవేర్చుకున్నాను. మళ్లీ తిరిగి భారత జట్టుకు ఆడేందుకు కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మళ్లీ భారత జట్టుకు ఆడే అవకాశం వస్తే అది చాలా సంతోషం.
కానీ నేను ఎప్పుడూ ప్రస్తుతం గురించే ఆలోచిస్తాను. నా చేతుల్లో లేని విషయం గురుంచి ఆలోచించను. ఆటపై ఇష్టమున్నంతవరకు కొనసాగుతాను. దేశవాళీ క్రికెట్‌తో పాటు ఐపీఎల్, యూపీ క్రికెట్ లీగ్స్‌లో వీలైనంతవరకు పూర్తి స్ధాయిలో అందుబాటులో ఉండేందుకు ఇష్టపడతాను.
మిగిలిన సమయాన్ని నా కుటంబానికి కేటాయిస్తాను" అని ఆర్సీబీ పాడ్‌కాస్ట్‌లో భువీ పేర్కొన్నాడు. 36 ఏళ్ల భువనేశ్వర్ చివరిసారిగా 2022లో భారత్ తరపున ఆడాడు. ఇప్పటివరకు అతడు 21 టెస్టులు, 121 వన్డేలు, 87 టీ20ల్లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు.


