కాషాయ రంగులోకి టీమిండియా జెర్సీ.. దిగ్గజ గోల్‌కీపర్‌ కీలక వ్యాఖ్యలు | Indian Hockey Icon PR Sreejesh Baffled By Jersey Colour Row | Sakshi
Sakshi News home page

కాషాయ రంగులోకి టీమిండియా జెర్సీ.. దిగ్గజ గోల్‌కీపర్‌ కీలక వ్యాఖ్యలు

Aug 2 2026 1:13 PM | Updated on Aug 2 2026 1:20 PM

Indian Hockey Icon PR Sreejesh Baffled By Jersey Colour Row

PC : Times Now

భారత హాకీ జట్టు సంప్రదాయ నీలం రంగు స్థానంలో కాషాయ రంగు జెర్సీ ధరించడంపై కొనసాగుతున్న వివాదానికి దిగ్గజ గోల్‌కీపర్‌ పీఆర్‌ శ్రీజేష్‌ తెరదించే ప్రయత్నం చేశారు. జెర్సీ రంగు మార్చడంపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే నీలం జెర్సీ వల్ల నీలం టర్ఫ్‌పై ఆటగాళ్లకు కనిపించడం కష్టమవుతుందనే కారణం మాత్రం తనకు అర్థం కావడం లేదని అన్నారు.

ఆగస్టు 15 నుంచి నెదర్లాండ్స్‌, బెల్జియంలో జరగనున్న హాకీ ప్రపంచకప్‌లో భారత పురుషుల, మహిళల జట్లు తమ ప్రధాన కిట్‌గా కాషాయ జెర్సీని ధరించనున్నాయి. దీనిపై మాజీ కెప్టెన్లు వీరెన్‌ రస్కిన్హా, ధన్‌రాజ్‌ పిళ్లే, అజిత్‌ పాల్‌ సింగ్‌, వాసుదేవన్‌ భాస్కరన్‌, పర్గత్‌ సింగ్‌ తదితరులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

“జెర్సీ రంగు మార్చడమే వివాదమైతే 2014, 2018 ప్రపంచకప్‌ల సమయంలోనూ ఇది జరగాలి. అప్పుడు మేం పసుపు, లైట్‌ బ్లూ రంగు జెర్సీలు ధరించాం. రంగు మార్చడంపై నాకు సమస్య లేదు. కానీ అందుకు చెబుతున్న కారణమే విచిత్రంగా ఉంది” అని శ్రీజేష్‌ పేర్కొన్నారు.

నీలం టర్ఫ్‌ కారణంగా నీలం జెర్సీ కనిపించడం కొంత కష్టంగా ఉండొచ్చని అంగీకరించినప్పటికీ, 2012 లండన్‌ ఒలింపిక్స్‌ నుంచి నీలం టర్ఫ్‌పై భారత్‌ ఎన్నో టోర్నీల్లో నీలం జెర్సీతోనే ఆడిందని గుర్తుచేశారు.

రాజకీయాలకు దూరంగా ఉండాలి
జెర్సీ మార్పుకు ఆటగాళ్లు అంగీకరించి ఉంటే ఇక ఈ అంశంపై చర్చ అవసరం లేదని శ్రీజేష్‌ స్పష్టం చేశారు.

“క్రీడలను రాజకీయాలకు దూరంగా ఉంచాలి. ఆటగాళ్లే అత్యంత ముఖ్యమైన వారు. వారికి ఎలాంటి సమస్య లేకపోతే బయటివారు కూడా దీనిపై అభ్యంతరం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు” అని అన్నారు.

అయితే కొత్త జెర్సీని ప్రపంచకప్‌కు ముందే కొన్ని మ్యాచ్‌ల్లో ఉపయోగించి ఉంటే ఆటగాళ్లు దానికి అలవాటు పడేవారని అభిప్రాయపడ్డారు.

50 ఏళ్ల నిరీక్షణకు తెరదించే అవకాశం
ప్రపంచకప్‌లో భారత్‌ 50 ఏళ్లుగా టైటిల్‌ కోసం ఎదురుచూస్తోందని, ఈసారి సెమీఫైనల్‌ చేరే అవకాశం బలంగా ఉందని శ్రీజేష్‌ అభిప్రాయపడ్డారు.

ఇంగ్లండ్‌ మాత్రమే తమ గ్రూప్‌లో ప్రధాన సవాల్‌ అని, గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిస్తే తర్వాతి దశలో మార్గం కొంత సులభంగా ఉండొచ్చని చెప్పారు.

“బయటి చర్చలను పక్కన పెట్టి అత్యుత్తమ హాకీ ఆడండి. 50 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలికి పతకం సాధించండి” అని శ్రీజేష్‌ భారత జట్టుకు సూచించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement