source: X
భారత యువ బ్యాడ్మింటన్ సంచలనం తన్వీ శర్మ చరిత్ర సృష్టించింది. తైపీ ఓపెన్ సూపర్ 300 టోర్నీలో మహిళల సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకుని తన కెరీర్‌లో తొలి BWF వరల్డ్ టూర్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.
ఆదివారం జరిగిన ఫైనల్లో 17 ఏళ్ల తన్వీ.. వియత్నాంకు చెందిన ఆరో సీడ్ తుయ్ లిన్ న్గుయెన్‌ను వరుస గేముల్లో ఓడించింది. కేవలం 36 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో 21-16, 21-16తో విజయం సాధించి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది.
పంజాబ్‌కు చెందిన తన్వీ గతేడాది US ఓపెన్ సూపర్ 300లో రన్నరప్‌గా నిలిచింది. ఈసారి తైపీ ఓపెన్‌లో మాత్రం ఫైనల్‌ను విజయంగా మలిచి తన తొలి సూపర్ 300 టైటిల్‌ను అందుకుంది.
జూనియర్ స్థాయిలోనూ ఘనతలు
తన్వీ గతంలో ప్రపంచ జూనియర్ నంబర్-1గా నిలిచింది. వరల్డ్ జూనియర్ ఛాంపియన్‌షిప్స్‌లో ఒకే ఎడిషన్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయురాలిగా కూడా రికార్డు సృష్టించింది. బాలికల సింగిల్స్‌లో రజతం, మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో కాంస్యం సాధించింది.
అంతేకాకుండా, భారత జట్టు తొలిసారి ఆసియా టీమ్ ఛాంపియన్‌షిప్ స్వర్ణం గెలిచిన జట్టులో కూడా సభ్యురాలిగా ఉంది.
17 ఏళ్ల వయసులో మరో రికార్డు
16 ఏళ్ల వయసులోనే తన తొలి సూపర్ 300 ఫైనల్‌కు(2025 US ఓపెన్) చేరుకున్న తన్వీ.. ఆ తర్వాత ఒడిశా మాస్టర్స్, గువాహటి మాస్టర్స్‌లోనూ రన్నరప్‌గా నిలిచింది.
తైపీ ఓపెన్ ఫైనల్‌కు చేరుకునే సమయానికి ఆమె ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్-35లోకి దూసుకొచ్చింది.
17 ఏళ్ల 222 రోజుల వయసులో తైపీ ఓపెన్ నెగ్గిన తన్వీ, ఈ టోర్నీ చరిత్రలో అత్యంత పిన్న వయస్కురాలైన టైటిల్ విన్నర్‌గా నిలిచింది.
తన్వీకి పీవీ సింధు మాజీ కోచ్ పార్క్ టే-సాంగ్ మార్గదర్శకత్వం అందిస్తున్నాడు. దూకుడైన ఆటతీరు, నిలకడతో ఆకట్టుకుంటున్న తన్వీ.. ఈ టైటిల్‌తో భారత బ్యాడ్మింటన్‌లో భవిష్యత్ స్టార్‌గా తన స్థానాన్ని మరింత బలపరుచుకుంది.


