జపాన్ ఓపెన్‌లో విజేతగా నిలిచిన స్టార్ షట్లర్
ఈ ఘనత సాధించిన తొలి భారతీయ ప్లేయర్‌గా రికార్డు
ఫైనల్లో ప్రపంచ చాంపియన్ అకానె యామగుచిపై విజయం
19 నెలల నిరీక్షణకు తెరదించుతూ అంతర్జాతీయ వేదికపై భారత స్టార్ షట్లర్ పీవీ సింధు విజయగర్జన చేసింది. జపాన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో సింధు చాంపియన్‌గా అవతరించింది. తద్వారా 44 ఏళ్ల చరిత్ర కలిగిన జపాన్ ఓపెన్‌లో టైటిల్ గెలిచిన తొలి భారతీయ ప్లేయర్‌గా ఈ తెలుగు తేజం రికార్డు
సృష్టించింది. 1983లో ఇదే టోర్నీలో భారత దిగ్గజం ప్రకాశ్ పదుకొనె పురుషుల సింగిల్స్‌లో రన్నరప్‌గా నిలిచాడు.
టోక్యో: తన ప్రియమైన ప్రత్యర్థి అకానె యామగుచిపై భారత స్టార్ పీవీ సింధు పైచేయి సాధించింది. ఆదివారం ముగిసిన జపాన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో సింధు విజేతగా నిలిచింది. 50 నిమిషాలపాటు జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 10వ ర్యాంకర్ సింధు 21–17, 21–17తో ప్రపంచ మూడో ర్యాంకర్, ప్రస్తుత ప్రపంచ చాంపియన్ అకానె యామగుచి (జపాన్)పై జయభేరి మోగించింది.
విజేత సింధుకు 66,500 డాలర్ల (రూ. 64 లక్షల 15 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 11,000 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ యామగుచికి 32,300 డాలర్ల (రూ. 31 లక్షల 16 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 9,350 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. సింధు, యామగుచి ఇప్పటి వరకు 30 సార్లు తలపడ్డారు. సింధు 16 సార్లు... యామగుచి 14 సార్లు విజయం సాధించారు. సింధు ఓవరాల్ కెరీర్‌లో ఇది 25వ సింగిల్స్ టైటిల్. ఈ ఏడాది మాత్రం ఆమెకిదే తొలి టైటిల్ కావడం గమనార్హం. 2024 నవంబర్‌లో లక్నోలో జరిగిన సయ్యద్ మోదీ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 టోర్నీలో చివరిసారి సింధు టైటిల్ గెలుచుకుంది.
ఆధిక్యం దోబూచులాడుతూ...
ఆరోసారి జపాన్ ఓపెన్‌లో ఫైనల్ చేరిన యామగుచిపై తుదిపోరులో సింధు ఆటతీరు చూశాక స్పష్టమైన ప్రణాళికతో వచ్చినట్లు అనిపించింది. అవసరమైనపుడు ర్యాలీలను తక్కువ షాట్‌లలో ముగిస్తూ... కొన్నింటిని సుదీర్ఘంగా కొనసాగిస్తూ సింధు పైచేయి సాధించింది. కొన్ని ర్యాలీలు 38 షాట్‌లు, 37 షాట్‌లు, 31 షాట్‌ల వరకు కొనసాగాయి. ఆరంభంలో సింధు 9–5తో ముందంజ వేసింది. ఆ తర్వాత 9–11తో వెనుకబడింది.
స్కోరు 11–12 వద్ద సింధు ఒక్కసారిగా చెలరేగి వరుసగా ఐదు పాయింట్లు గెలిచి 16–12తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత యామగుచి పుంజుకోవడంతో స్కోరు 17–17తో సమైమంది. ఈ దశలో సింధు మరోసారి విజృంభించి వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి 21–17తో తొలి గేమ్‌ను 23 నిమిషాల్లో దక్కించుకుంది. రెండో గేమ్ ఆరంభంలో సింధు కళ్లు చెదిరే స్మాష్‌లు సంధించింది. 8–3తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత యామగుచి తేరుకొని ఆధిక్యాన్ని 8–7కు తగ్గించింది. ఈ దశలో సింధు మళ్లీ మెరిసింది. వరుసగా ఆరు పాయింట్లు నెగ్గి 14–7తో దూసుకెళ్లింది.
అనంతరం యామగుచి కోలుకోవాలని ప్రయత్నించినా సింధు కీలకదశలో పాయింట్లు సాధించి రెండో గేమ్‌ను 27 నిమిషాల్లో సొంతం చేసుకొని మ్యాచ్‌తోపాటు టైటిల్‌ను కైవసం చేసుకుంది. ‘చాలా ఆనందంగా ఉంది. మాటలు రావడం లేదు. నా కళ్లలో ఆనందభాష్పాలు వచ్చాయి. ఎందుకంటే ఈ విజయం నాకెంతో అవసరం. 19 నెలల తర్వాత టైటిల్ సాధించాను. ఈ గెలుపు నాలో ఆత్మవిశ్వాసాన్ని అమాంతం పెంచుతుంది. అనవసర తప్పిదాలు చేయకుండా, సంయమనం కోల్పోకుండా ఆడినందుకు మంచి ఫలితం వచ్చింది. కొత్త కోచ్ ఇర్వన్‌సి ఆది ప్రతమ, స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ వేన్ లోంబార్డ్, సహాయక సిబ్బంది, తల్లిదండ్రులు, నా భర్త వెంకటదత్త సాయికి ధన్యవాదాలు’ అని విజయానంతరం సింధు వ్యాఖ్యానించింది.


