(Courtesy: PTI)
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు రెండేళ్ల తర్వాత మరోసారి వరల్డ్ టూర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. జపాన్ ఓపెన్ 2026 మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో చిరకాల ప్రత్యర్థి, చైనా స్టార్ చెన్ యుఫేయిపై 21-19, 15-10తో విజయం సాధించి తొలిసారి ఈ టోర్నీ ఫైనల్‌లోకి అడుగుపెట్టింది.
ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌లో సింధు దూకుడుగా ఆడి ఆధిక్యం సాధించింది. యుఫేయి గట్టి పోటీ ఇచ్చినా కీలక సమయంలో సింధు వరుస పాయింట్లు సాధించి తొలి గేమ్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఇద్దరి మధ్య జరిగిన 51 షాట్ల సుదీర్ఘ ర్యాలీ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.
రెండో గేమ్‌లో కూడా సింధు అదే జోరు కొనసాగించింది. అయితే హ్యామ్‌స్ట్రింగ్ గాయంతో బాధపడుతున్న చెన్ యుఫేయి మ్యాచ్‌ను మధ్యలోనే విరమించుకోవడంతో సింధు విజేతగా నిలిచింది. ఈ విజయంతో యుఫేయిపై వరుసగా ఐదు ఓటముల తర్వాత సింధు ప్రతీకారం తీర్చుకుంది.
2024లో సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ టైటిల్ గెలిచిన తర్వాత సింధు ఏ టోర్నీలోనూ ఫైనల్‌కు చేరలేదు. రెండేళ్ల నిరీక్షణకు తెరదించిన ఆమె జపాన్ ఓపెన్ ఫైనల్లో ఆతిథ్య జపాన్‌కు చెందిన అకానే యమగుచి లేదా ఇండోనేషియాకు చెందిన పుత్రి కుసుమ వార్దానితో తలపడనుంది.
ఈ టోర్నీలో ఇప్పటికే ప్రపంచ నంబర్-5 హాన్ యూయేను ఓడించిన సింధు, సెమీఫైనల్లో మరో అద్భుత ప్రదర్శనతో టైటిల్‌కు ఒక్క అడుగు దూరంలో నిలిచింది.


