వరుసగా మూడు వైట్‌బాల్ సిరీస్‌లను కోల్పోయిన టీమిండియా వారం రోజులు తిరగక ముందే మరో కీలక పోరుకు సిద్దమైంది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని భారత జట్టు జింబాబ్వేతో మూడు టీ20ల సిరీస్‌లో తలపడనుంది. ఇప్పటికే జింబాబ్వే గడ్డపై అడుగుపెట్టిన భారత జట్టు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది.
వరుస పరాజయాల తర్వాత టీమిండియా మళ్లీ గెలుపు బాట పట్టడానికి ఈ టీ20 సిరీస్ అత్యంత కీలకంగా మారింది. అయితే పేపర్ మీద భారత్ అత్యంత బలమైన జట్టుగా కనిపిస్తున్నప్పటికి టీ20 ఫార్మాట్‌లో మాత్రం జింబాబ్వేను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు.
పసికూనే కాదా అని తేలికగా తీసుకుంటే మన జట్టుకు మరో పరభావం ఎదురవ్వకతప్పదు. ఎందుకంటే తమ సొంతగడ్డపై జింబాబ్వే బంగ్లాదేశ్‌పై వరుస విజయాలు సాధించి మంచి జోష్‌లో ఉండి. తాజాగా టీ20 సిరీస్‌ను కోల్పోయినప్పటికి ఆ జట్టు ఆటగాళ్లంతా సూపర్ ఫామ్‌లో ఉన్నారు. టీ20 ప్రపంచకప్-2026లో పటిష్టమైన ఆస్ట్రేలియాను సైతం జింబాబ్వే చిత్తు చేసింది. ఈ క్రమంలో జింబాబ్వే బలాలు, బలహీనతలను ఓసారి పరిశీలిద్దాం.
రజాతో డెంజర్..
ముఖ్యంగా ఆ జట్టుకు కెప్టెన్ సికందర్ రజా అతిపెద్ద బలం. అతడు బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లోనూ టీమ్‌ను ముందుండినడిపించగలడు. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా లీగ్ క్రికెట్ ఆడిన అనుభవం అతడికి ఉంది. ఒంటో చేత్తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేయగలడు. మ్యాచ్‌పై భారత్ పట్టు సాధించాలంటే అతడిని తొందరగా పెవిలియన్‌కు పంపాల్సిందే. బంతితో కూడా మ్యాజిక్ చేయగలడు.
అతడి ఆఫ్ స్పిన్‌ను భారత బ్యాటర్లు జాగ్రత్తగా ఎదుర్కొవాలి. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఆడితే వికెట్ సమర్పించుకోక తప్పదు. మరోవైపు యువ ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ నుంచి భారత జట్టుకు ముప్పు పొంచి ఉంది. ఈ ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాపై బెన్నెట్ హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన మల్టీ ఫార్మాట్ సిరీస్‌లలో కూడా అతడు దుమ్ములేపాడు.
అతడి వికెట్‌ను ఆరంభంలోనే భారత్ సాధిస్తే ఆతిథ్య జట్టును ఒత్తిడిలోకి నెట్టవచ్చు. బెన్నెట్‌తో పాటు మరో బెన్ కుర్రాన్ రూపంలో మరో అద్భుతమైన ఓపెనర్ జింబాబ్వే వద్ద ఉన్నాడు. బంగ్లాదేశ్‌తో వన్డేలో బెన్ సూపర్ సెంచరీతో చెలరేగాడు.
ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ సామ్ కుర్రాన్ సొదరుడే ఈ బెన్ కుర్రాన్ కావడం గమనార్హం. మిడిలార్డర్‌లో రియాన్ బర్ల్ వంటి సీనియర్ ఆల్‌రౌండర్ ఉన్నాడు. వీరితో పాటు పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ బ్రాడ్ ఎవాన్స్ బ్యాట్‌తో కూడా మెరుపులు మెరిపించగలడు. బౌలింగ్‌లో రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజరబానీ వంటి స్పీడ్ స్టార్లు ఉన్నారు.
బలహీనతలు ఇవే
అయితే బ్యాటింగ్ ఆర్డర్‌లో స్థిరత్వం లేకపోవడం జింబాబ్వే ప్రధాన సమస్యగా ఉంది. టాప్ ఆర్డర్ త్వరగా వికెట్లు కోల్పోతే మిడిల్ ఆర్డర్ తీవ్ర ఒత్తిడికి లోనవుతుంది. కొన్నిసార్లు మెరుగైన ఆరంభం లభించినప్పటికి పవర్ ప్లే తర్వాత వరస వికెట్లు కోల్పోయి చిత్తు అయిన సందర్భాలు ఉన్నాయి. సికందర్ రజా లేదా బెన్నెట్‌పై కూడా అతిగా ఆధారపడడం కూడా వారి బలహీనతగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా సరైన బెంచ్ బలం కూడా జింబాబ్వే వద్ద లేదు.


