FIFA World Cup 2026: జగజ్జేత స్పెయిన్‌ | Spain emerged as the winner of the 2026 FIFA World Cup | Sakshi
Sakshi News home page

FIFA World Cup 2026: జగజ్జేత స్పెయిన్‌

Jul 20 2026 3:33 AM | Updated on Jul 20 2026 7:12 AM

Spain emerged as the winner of the 2026 FIFA World Cup

రెండోసారి ప్రపంచకప్‌ టైటిల్‌ సొంతం

ఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌ అర్జెంటీనాపై విజయం

అదనపు సమయంలో గోల్‌ కొట్టిన స్పెయిన్‌ 

అసాధారణ ప్రదర్శన కనబరిచిన అర్జెంటీనా గోల్‌కీపర్‌

న్యూయార్క్‌: ఒకవైపు పటిష్టమైన డిఫెన్స్‌... మరోవైపు పాదరసంలాంటి కదలికలతో అటాకింగ్‌... వెరసి స్పెయిన్‌ జట్టు రెండోసారి ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున ముగిసిన ఫైనల్లో స్పెయిన్‌ 1–0 గోల్‌ తేడాతో డిఫెండింగ్‌ చాంపియన్‌ అర్జెంటీనా జట్టును ఓడించింది. అదనపు సమయంలోని 106వ నిమిషంలో సబ్‌సిట్యూట్‌ ఫెరాన్‌ టోరెస్‌ గోల్‌తో స్పెయిన్‌ జట్టు విజయం అందుకుంది. 

పెడ్రో పోరో కుడి వైపు నుంచి కొట్టిన క్రాస్‌ పాస్‌ను ‘డి’ ఏరియాలో నికో విలియమ్స్‌ హెడర్‌ షాట్‌తో వెనక్కి పంపించాడు. అక్కడే ఉన్న ఫెరాన్‌ టోరెస్‌ అర్జెంటీనా గోల్‌కీపర్‌ను బోల్తా కొట్టిస్తూ బంతిని లక్ష్యానికి చేర్చాడు. దాంతో స్పెయిన్‌ ఖాతా తెరిచింది. ఆ తర్వాత అదనపు సమయంలో మిగిలిన క్షణాల్లో అర్జెంటీనాను నిలువరించి స్పెయిన్‌ ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. 2010లో స్పెయిన్‌ తొలిసారి ప్రపంచకప్‌ గెలిచింది.

 నెదర్లాండ్స్‌తో ఆనాడు జరిగిన ఫైనల్లోనూ స్పెయిన్‌ అదనపు సమయంలోని రెండో అర్ధభాగంలో ఇనియెస్టా చేసిన గోల్‌తో విజయం అందుకుంది. 16 ఏళ్ల తర్వాత అలాంటి దృశ్యమే పునరావృతమైంది.  అంతకుముందు నిర్ణీత 90 నిమిషాల్లో రెండు జట్లు గోల్‌ చేయలేదు. 90+3వ నిమిషంలో అర్జెంటీనా ప్లేయర్‌ ఎంజో ఫెర్నాండెజ్‌ రెడ్‌ కార్డుకు గురయ్యాడు. దాంతో అదనపు సమయంలో 30 నిమిషాలు అర్జెంటీనా 10 మంది ఆటగాళ్లతోనే ఆడాల్సి వచ్చింది.

 ఈ సువర్ణావకాశాన్ని స్పెయిన్‌ సద్వినియోగం చేసుకుంది. పదే పదే దాడులు చేస్తూ 106వ నిమిషంలో ఫలితాన్ని సాధించింది. మ్యాచ్‌ మొత్తంలో అర్జెంటీనా గోల్‌కీపర్‌ ఎమిలియో మార్టీనెజ్‌ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. 12 సార్లు స్పెయిన్‌ ఆటగాళ్లు గోల్‌పోస్ట్‌ లక్ష్యంగా కొట్టిన షాట్‌లను నిలువరించాడు. అయితే 13వ ప్రయత్నంలో మాత్రం మార్టీనెజ్‌ ఏమీ చేయలేకపోయాడు. ఫైనల్‌ చేరే క్రమంలో 19 గోల్స్‌ కొట్టిన అర్జెంటీనా తుది పోరులో పూర్తిగా నిరాశపరిచింది. స్పెయిన్‌ ఫార్వర్డ్‌ ఆటగాళ్లను అడ్డుకోవడంలోనే అర్జెంటీనాకు సరిపోయింది.  

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement