నగరవాసుల మొగ్గు అర్జెంటీనా వైపే!
మెస్సీ మెస్మరైజ్ చేసి కప్ కొట్టాలని ఆశ
సిటీ జనులను కమ్మేసిన ఫైనల్ ఫీవర్
హైదరాబాదీల అభిమాన ఆటగాడు లయోనల్ మెస్సీ
రాత్రిపూట స్క్రీనింగ్స్.. తెల్లార్లూ సందడే
నైట్ లైఫ్‌నకు ప్రయోగాత్మక అడుగులు
నేటి అర్ధరాత్రి ఫుట్‌బాల్ ప్రపంచ కప్ తుది సమరం వీక్షణకు సిద్ధం
ప్రపంచంలోనే అత్యంత ఆదరణ ఉన్న ఫుట్‌బాల్ వరల్డ్ కప్ ఫైనల్ అంకాన్ని తప్పకుండా చూసేందుకు సిటీ జనులు సిద్ధమయ్యారు. ఆదివారం అర్ధరాత్రి 12.30కు మొదలయ్యే అర్జెంటీనా–స్పెయిన్ జట్ల తుది సమరాన్ని వీక్షించేందుకు ఉత్సుకతతో ఉన్నారు. ప్రపంచకప్‌నకు ఆతిథ్యం ఇచ్చింది ఉత్తర అమెరికా ఖండంలోని దేశాలు కావడంతో ఆయా దేశాల టైమ్ జోన్ మేరకు ఇప్పటికే తమ అలారాల సెట్టింగ్‌ను మార్చుకుని దాదాపు 40 రోజులుగా నగరంలోని ఫుట్‌బాల్ అభిమానులు మ్యాచ్‌ల మజాను ఆస్వాదించారు.
ఇప్పుడు ఫైనల్ కోసం మరింత ఉత్సుకతగా ఉన్నారు. పైగా, హైదరాబాదీల అభిమాన ఆటగాడు లయోనల్ మెస్సీ సారథ్యంలో అభిమాన జట్టు అర్జెంటీనా పోటీ పడుతుంటే ఇక తెల్లవారుజాము వరకైనా మేల్కొనేందుకు సిద్ధపడ్డారు. స్పెయిన్ కంటే అర్జెంటీనానే మనవాళ్ల ఫేవరెట్ అని.. మెజారిటీ సిటీజనుల మొగ్గు అర్జెంటీనా వైపే అని హైదరాబాద్‌లోని ఫుట్‌బాల్ కోచ్‌లు, ఆటగాళ్లు పేర్కొంటున్నారు. 2022లో జరిగిన ప్రపంచ కప్ ఫైనల్‌లో ఫ్రాన్స్, అర్జెంటీనా తలపడగా అప్పుడూ మనవాళ్లు అర్జెంటీనాకే మద్దతు పలికిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ఇక గత కొన్ని మ్యాచ్‌ల ఓపెన్ స్క్రీనింగ్స్‌లో వచ్చిన స్పందన కూడా ఇదే విషయం స్పష్టం చేస్తోంది. - సాక్షి, హైదరాబాద్
మెస్సీని తలచుకుంటూ...
గత ఏడాది చివర్లో మెస్సీ హైదరాబాద్‌లో పర్యటించిన సందర్భంలో విశేష ప్రజాదరణ దక్కింది. అప్పట్లో కేరళ వంటి ఫుట్‌బాల్‌కు ఆదరణ విపరీతంగా ఉండే రాష్ట్రంలో కాకుండా మెస్సీ భాగ్య నగరానికి రావడం విశేషం. దీన్నిబట్టే.. ఇప్పుడు అతడు వరుసగా రెండోసారి ప్రపంచ కప్ అందుకోవాలని హైదరాబాదీలు బలంగా కోరుకుంటున్నారు.
ఈ క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకునే, శనివారం అర్ధరాత్రి జరిగిన ఫ్రాన్స్–ఇంగ్లండ్ (మూడో స్థానం కోసం) మ్యాచ్, ఫైనల్ సందర్భంగా బార్‌లు, క్లబ్‌లు, మైక్రో బ్రూవరీలు రాత్రిళ్లు ఎక్కువసేపు తెరిచి ఉంచడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. కాగా, ఈ నిర్ణయాన్ని ఫుట్‌బాల్ ఫైనల్‌కు తాత్కాలిక సడలింపుగా మాత్రమే కాక నగర నైట్ లైఫ్‌నకు ఊపునిచ్చే దిశలో తొలి అడుగుగా ఆతిథ్య రంగం భావిస్తోంది. ఈ అనుమతులను సద్వినియోగం చేసుకుని పూర్తి స్థాయి రాత్రి వేళ వ్యాపారాలకు బాటలు వేసుకోవాలని ఆశిస్తోంది.
అభివృద్ధిదాయక నైట్‌లైఫ్ నగరంలో సాధ్యమని నిరూపించడానికి ఇదొక సువర్ణావకాశమని నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఆర్‌ఏఐ) అభిప్రాయపడుతోంది. అందుకని అవాంతరాలు లేకుండా గడిచేలా చూడాలని ఏఆర్‌ఏఐ హైదరాబాద్ చాప్టర్ తమ సభ్యులను కోరింది. ‘ప్రతి సంస్థ సొంత బ్రాండ్‌నే కాకుండా, హైదరాబాద్ ఆతిథ్య రంగం ప్రతిష్టను కూడా ఇనుమడింపజేయాలి’ అని చాప్టర్ హెడ్ సందీప్ బాలసుబ్రమణియన్ సూచించారు.


