గ్రేటర్ నగరంలో నకిలీ వైద్యులు
అర్హత లేకున్నా వైద్యం చేస్తున్న వైనం
ప్రైవేటు ఆస్పత్రులతో లింకులు.. రిఫరెన్స్‌పై కమీషన్లు
గల్లీల్లో క్లినిక్‌లు.. నర్సింగ్ హోమ్‌లు
పట్టించుకోని మెడికల్ కౌన్సిల్, డీఎంహెచ్‌ఓలు
నగరంలో నకిలీ వైద్యులు దర్జాగా చెలామణి అవుతున్నారు. ఎలాంటి విద్యార్హత లేకున్నా, ప్రభుత్వ పరమైన అనుమతులు లేకుండా దశాబ్దాల కాలంగా దొరికితే దొంగ లేకుంటే డాక్టర్ అన్నట్లు ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు. తమ పరిధిలో నడుస్తున్న ఆస్పత్రులు, క్లినిక్‌లు, నర్సింగ్ హోంలో జరిగే కార్యకలాపాలపై దృష్టి సారించాల్సిన జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండగా, మెడికల్ కౌన్సిల్ సభ్యులు అప్పుడప్పుడు తనిఖీలు చేపడుతున్నారు. కాగా.. గల్లీల్లోని నకిలీ వైద్యులు ప్రైవేటు ఆసుపత్రులకు కేసులను రిఫర్ చేస్తూ యాజమాన్యాల నుంచి ఖరీదైన బహుమతులు, నగదు పొందుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. – సాక్షి, హైదరాబాద్
సికింద్రాబాద్ రాంనగర్‌కు చెందిన ల్యాబ్ టెక్నీషియన్ ఎలాంటి అర్హతలు లేకపోయినా వైద్యుడి అవతారమెత్తాడు. రోగులను పరీక్షించడం, ఇంజెక్షన్లు ఇవ్వడం, ఇతర వైద్య సేవలందిస్తుండటాన్ని మూడు రోజుల క్రితం గుర్తించిన టాస్‌్కఫోర్స్ బృందం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొంది.
గత నెల 26న సైదాబాద్ సింగరేణి కాలనీలో మెడికల్ కౌన్సిల్ సభ్యులు విశ్వసనీయ సమాచారం మేరకు ఆకస్మిక తనిఖీ చేసి ముగ్గురు నకిలీ వైద్యులను గుర్తించారు. ఎలాంటి అర్హతలు లేకుండానే స్టెరాయిడ్స్, యాంటీబయోటిక్స్, పెయిన్ కిల్లర్స్, హెచ్–1 డ్రగ్స్ వినియోగిస్తూ ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మెడికల్ కౌన్సిల్ సభ్యులు తెలిపారు.
నెల రోజు క్రితం పాతనేరేడ్‌మెట్ మూడుగుళ్ల ప్రాంతంలో నకిలీ దంత వైద్యుడిని పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో సదరు వ్యక్తి ఇంటర్ కూడా పాస్ కాలేదని గుర్తించారు.
గాడితప్పిన పర్యవేక్షణ..
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో గ్రేటర్ పరిధి విస్తరించింది. దీంతో ఆయా ప్రాంతాలపై సంబంధిత జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు పర్యవేక్షించాల్సి ఉన్నా.. పట్టణ పరిధిలోని ఆసుపత్రులపై మానిటరింగ్ గాడి తప్పుతోంది. ఏదైనా సంఘటన జరిగినప్పుడే హడావుడి చేయడం, ఆ తర్వాత షరామామూలే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. వర్షాకాలం వచి్చందంటే రోగాలు ప్రబలుతాయి.
1.35 కోట్ల జనాభా ఉన్న గ్రేటర్ పరిధిలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు సుమారు 5 వేలకుపైగా ఉండగా.. ఎలాంటి అనుమతులు లేకుండా కొనసాగుతున్న క్లినిక్‌లు వందల సంఖ్యలోనే ఉంటాయని అంచనా. గత ఏడాదితో పోల్చితే ప్రస్తుతం తెలంగాణ మెడికల్ కౌన్సిల్ తనిఖీలు సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టింది. అందులోనూ కొన్ని ప్రాంతాల్లోనే తనిఖీలు చేపడుతున్నారంటూ విమర్శలను ఎదుర్కొంటున్నారు. నకిలీలను గుర్తించినా చట్టపరంగా చర్యలు తీసుకోవడంలో జిల్లా వైద్యారోగ్య శాఖ, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ మధ్య సమన్వయం లోపించిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.


