అనాథ శవాలకు అండగా.. | Four Volunteers Perform Last Rites for 125 Unclaimed Bodies in Telangana | Sakshi
Sakshi News home page

అనాథ శవాలకు అండగా..

Jul 19 2026 1:23 PM | Updated on Jul 19 2026 1:34 PM

Four Volunteers Perform Last Rites for 125 Unclaimed Bodies in Telangana

అనాథ మృతదేహాలకు గౌరవప్రదంగా చివరి వీడ్కోలు పలుకుతూ సేవే పరమోధర్మం అంటూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు ఆ నలుగురు. మరణించిన తర్వాత అంత్యక్రియలు చేసేవారు లేక ఆస్పత్రి, మార్చురీ, రహదారులతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న మృతదేహాలకు అన్నీ తామై సంప్రదాయబద్దంగా అంతిమ సంస్కారం నిర్వహిస్తున్నారు. కరోనా సమయంలోనూ తమ సేవానిరతిని చాటి ఎందరికో ఆదర్శంగా నిలిచారు. మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్న వారే ‘మానవ సేవే మాధవ సేవ’ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు.   

ఆదిలాబాద్‌ పట్టణానికి చెందిన మానవ సేవే మాధవ సేవ స్వచ్ఛంద సంస్థను 2014లో నలుగురితో ఏర్పాటు చేశారు. ఇందులో సభ్యురాలైన శశి కళ ఆదిలాబాద్‌ అర్బన్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో ఆర్‌ఐగా విధులు నిర్వహిస్తున్నారు. అలాగే కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న చిందం దేవిదాస్‌తో పాటు మరో ఇద్దరు శ్రీపాద శ్రీనివాస్, రాజు ఈ సేవ కార్యక్రమాల్లో ముందుంటున్నారు. జిల్లాలోని ఆయా పోలీసుస్టేషన్ల పరిధిలో గుర్తు తెలియని శవాలు, రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందినవారు, ఆస్పత్రిలోని మార్చురీలో రోజుల తరబడి ఉన్నటువంటి గుర్తు తెలియని మృతదేహాలకు అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నారు.

అలాగే డబ్బులు లేని వారు వీరిని సంప్రదిస్తే వారి సంప్రదాయబద్దంగా నిర్వహించేందుకు సైతం ముందుంటున్నారు. ఆర్‌ఐతో పాటు కానిస్టేబుల్‌ సొంత డబ్బులతో వీటిని చేపడుతున్నారు. కట్టెలు, బట్ట, పూలు, ఇతరత్రా దాదాపు రూ.4వేల వరకు ఖర్చవుతుంది. శవయాత్ర వాహనాల్లో మృతదేహాలను శ్మశానవాటికకు తరలించి అక్కడ అంతిమ కార్యం పూర్తి చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో పాడెమోస్తూ తీసుకెళ్లి చివరి మజిలో భాగస్వాములవుతున్నారు.

125 మృతదేహాలకు..
2014 సంవత్సరంలో ఏర్పడిన ఈ స్వచ్ఛంద సంస్థ ఇప్పటివర కు 125 మృతదేహాలకు అంతి మ సంస్కారాలు నిర్వహించింది. వృత్తిలో బిజీగా ఉన్నా ఏనా డూ ఈ సేవా కార్యక్రమాలకు వెనుకంజ వేయలేదు. మహారా ష్ట్రకు చెందిన పేద కుటుంబాలు రిమ్స్‌లో చికిత్స కోసం వచ్చినప్పుడు మరణించిన ఘటనలు అనేకంగా ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులతో మృతదేహాన్ని స్వస్థలానికి తరలించలేని పేదలకుసైతం ఆర్థికంగా అండగా నిలుస్తున్నారు. కులమత బేధం లేకుండా అన్ని మతా లకు సంబంధించి వారి సంప్రదాయబద్దంగా అంతిమ సంస్కారాలు నిర్వహించడం అభినందనీయం.

ఇతర సేవల్లోనూ ముందు..
అంతిమ సంస్కారాలు నిర్వహించడంతో పాటు పలు సేవ కార్యక్రమాల్లో సైతం వీరు ముందుంటున్నారు. ఆకలితో అలమటిస్తున్న పేదలకు సొంత ఖర్చుతో భోజనం పెట్టడం, పండుగల సమయంలో వృద్ధాశ్రమాల్లో వృద్ధులతో కలిసి జరుపుకోవడం ప్రత్యేకం. రిమ్స్, రైల్వే స్టేషన్, బస్టాండ్‌ తదితర ప్రాంతాల్లో అన్నదానం నిర్వహించడం, యాచకులకు చలికాలంలో బ్లాంకెట్లు, వేసవిలో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం, కరోనా సమయంలో పేదలకు సరుకులు పంపిణీ చేయడం వంటి అనేక సేవ కార్యక్రమాలను చేపట్టారు.

ఓ అనాథ శవాన్ని చూసి చలించిపోయా..
2014 సంవత్సరంలో ఓ అనాథ శవాన్ని ఇద్దరు వ్యక్తులు తీసుకెళ్తూ కనిపించారు. వారిద్దరిని అడిగితే అనాథ శవం అని చెప్పారు. నేను కూడా రావచ్చా అని అడిగితే వారు ఒప్పుకున్నారు. ఆ తర్వాత నలుగురం కలిసి మానవ సేవే మాధవ సేవ సంస్థను ఏర్పాటు చేశాం. మా కుటుంబ సభ్యుల సహకారంతో ఈ సేవ కార్యక్రమాలను చేపడుతున్నాం. ఇప్పటివరకు 125 మృతదేహాలకు అంతిమ సంస్కారాలు నిర్వహించాం. సొంత డబ్బుతో సేవ కార్యక్రమాలు చేపట్టడం ఆనందంగా ఉంది.       
 – శశికళ, ఆర్‌ఐ

జీవించినప్పుడు ఆదరణ లేకపోయినా..
మనిషి జీవించినప్పుడు ఆదరణ లేకపోయినా మరణించిన తర్వాతనైనా గౌరవప్రదంగా సాగనంపాలనేది మా లక్ష్యం. సేవ కార్యక్రమాలు చేసినప్పుడే మానవత్వం చిరస్థాయిగా నిలుస్తోంది. తోచిన సేవ చేయాలనే ఉద్దేశంతో వీటిని చేపడుతున్నాం. చాలా సంతోషంగా అనిపిస్తోంది. కుళ్లిపోయిన శవాలకు సైతం అంత్యక్రియలు నిర్వహించాం. వైద్యులు, పోలీసులు సమాచారం అందించిన వెంటనే అక్కడికి చేరుకొని దహన సంస్కారాలు     చేపడుతున్నాం.            
– చిందం దేవిదాస్, కానిస్టేబుల్‌

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement