● ఢిల్లీకి చేరిన సిమెంట్‌ పరిశ్రమ అంశం ● ఇప్పటికే కేంద్ర మంత్రిని కలిసిన బీఆర్‌ఎస్‌, సాధన కమిటీ సభ్యులు ● సీఎం, మంత్రులను కలిసేందుకు ప్రయత్నం.. ● స్పందించకుంటే సెప్టెంబర్‌ 1 నుంచి ఆమరణ నిరాహార దీక్ష | - | Sakshi
Sakshi News home page

● ఢిల్లీకి చేరిన సిమెంట్‌ పరిశ్రమ అంశం ● ఇప్పటికే కేంద్ర మంత్రిని కలిసిన బీఆర్‌ఎస్‌, సాధన కమిటీ సభ్యులు ● సీఎం, మంత్రులను కలిసేందుకు ప్రయత్నం.. ● స్పందించకుంటే సెప్టెంబర్‌ 1 నుంచి ఆమరణ నిరాహార దీక్ష

Jul 24 2026 1:45 AM | Updated on Jul 24 2026 1:45 AM

● ఢిల్లీకి చేరిన సిమెంట్‌ పరిశ్రమ అంశం ● ఇప్పటికే కేంద్ర మంత్రిని కలిసిన బీఆర్‌ఎస్‌, సాధన కమిటీ సభ్యులు ● సీఎం, మంత్రులను కలిసేందుకు ప్రయత్నం.. ● స్పందించకుంటే సెప్టెంబర్‌ 1 నుంచి ఆమరణ నిరాహార దీక్ష

ఆదిలాబాద్‌టౌన్‌: ఆదిలాబాద్‌ జిల్లా పారిశ్రామిక చరిత్రలో ఒకప్పుడు కీలక స్థానాన్ని సంపాదించిన సిమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) పరిశ్రమ పునఃప్రారంభం అంశం మరోసారి తెరపైకి వచ్చింది. పరిశ్రమను పునఃప్రారంభించాలని కొన్నేళ్లుగా సీసీఐ సాధన కమిటీ ఉద్యమిస్తోంది. దశాబ్దాలుగా మూతపడిన ఈ పరిశ్రమను తిరిగి ప్రారంభించే వరకు ఉద్యమాలు, ఆందోళనలు కొనసాగి స్తామని సీసీఐ సాధన కమిటీ స్పష్టం చేసింది. సీసీఐ పరిశ్రమను 1982లో స్థాపించగా 1984లో ప్రారంభమైంది. 1996లో ఉత్పత్తి ఆగిపోయింది. 1998లో పూర్తిగా మూసివేశారు. ఈ ఏడాది కూలగొట్టి స్క్రాప్‌ కింద విక్రయించిన విషయం తెలిసిందే. దీంతో వేలాది కుటుంబాలు ఉపాధి కోల్పోయి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఎంతో మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫ్యాక్టరీ పునఃప్రారంభిస్తే జిల్లాకు చెందిన నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఆర్థిక స్థితిగతులు మెరుగుపడనున్నాయి.

పారిశ్రామిక పునరుజ్జీవనానికి..

సీసీఐ పునరుద్ధరణ కేవలం ఒక పరిశ్రమను తిరిగి ప్రారంభించడం మాత్రమే కాదని, జిల్లాలో పారిశ్రామిక పునరుజ్జీవనానికి నాంది పలుకుతుందని సీసీఐ సాధన కమిటీ సభ్యులు, మాజీ మంత్రి జోగు రామన్న పేర్కొంటున్నారు. పరిశ్రమ తిరిగి ప్రారంభమైతే జిల్లాలో పెట్టుబడులు పెరగడంతో పాటు కొత్త పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంటుందని, ప్రత్యక్షంగా, పరోక్షంగా జిల్లాలో 6 వేల మంది నిరుద్యోగులకు, 80 శాతం స్థానికులకే ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంటున్నారు.

హామీలతోనే సరి..

సీసీఐ పునఃప్రారంభంపై గతంలో కేంద్ర, ప్రభుత్వాలు పలుమార్లు హామీలు ఇచ్చినప్పటికీ అవి అమలుకు నోచుకోలేదు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేయడం సరైంది కాదని యువతతో పాటు కమిటీ సభ్యులు పేర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే సీసీఐ పునరుద్ధరణపై స్పష్టమైన ప్రకటన చేసి, కార్యాచరణ ప్రణాళికను ప్రకటించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇటీవల బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆధ్వర్యంలో సీసీఐ సాధన కమిటీ సభ్యులు, మాజీ మంత్రి జోగు రామన్న కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామిని కలిశారు. రెండు రోజుల క్రితం కేటీఆర్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి లేఖ రాశారు. సీసీఐపై వైఖరి స్పష్టం చేయాలని అందులో పేర్కొన్నారు.

గల్లీ నుంచి ఢిల్లీ వరకు..

సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయనున్నట్లు సాధన కమిటీ సభ్యులు తెలిపారు. ఇటీవల చర్చాగోష్టి, ఢిల్లీ పర్యటన తదితర కార్యక్రమాలు చేపట్టారు. మొదట గ్రామాలు, మండలాలు, జిల్లా కేంద్రంలో అవగాహన సమావేశాలు నిర్వహించి ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారు. ఇంటింటికీ కరపత్రాల పంపిణీ, ధర్నాలు, ర్యాలీలు, మానవహారాలు, నిరాహార దీక్షలు, వినతిపత్రాల సమర్పణ వంటి కార్యక్రమాలు చేపడతామని, అవసరమైతే ఢిల్లీలోని సంబంధిత కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ఎదుట కూడా ఆందోళనలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సీసీఐ పునరుద్ధరణ కోసం అన్ని రాజకీయ పార్టీలు, కార్మిక, ప్రజాసంఘాలు, వ్యాపారవేత్తలు, మేధావులు, యువజన సంఘాలు ఒక్క తాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పరిశ్రమను తిరిగి ప్రారంభించే దిశగా చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు. సీసీఐలో మళ్లీ ఉత్పత్తి ప్రారంభమయ్యే వరకు తమ ఉద్యమం ఆగదని, అవసరమైన అన్ని ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాటాన్ని కొనసాగిస్తామని చెబుతున్నారు.

స్పందించకుంటే ఉద్యమాలే..

సీసీఐ ఫ్యాక్టరీ పునఃప్రారంభంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని సాధన కమిటీ సభ్యులు, మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్‌ చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబును కలిసేందుకు అపాయింట్‌మెంట్‌ తీసుకుంటామని, వారు స్పందించకుంటే హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్‌ వద్ద ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. ఆగస్టు 1 నుంచి 31 వరకు జిల్లా కేంద్రంలో అన్ని కుల సంఘాలు, రాజకీయ పార్టీలు, యువజన సంఘాలతో కలిసి రిలే దీక్షలు చేపడతామని స్పష్టం చేశారు. సెప్టెంబర్‌ 1 నుంచి ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement