ఏదో జరుగుతోంది..! | - | Sakshi
Sakshi News home page

ఏదో జరుగుతోంది..!

Jul 24 2026 1:45 AM | Updated on Jul 24 2026 1:45 AM

మున్సిపల్‌ వీధిదీపాల సరఫరా టెండర్‌ వర్క్స్‌లో అలసత్వం

లెస్‌లో పనులు పొంది నిర్వహణకు ముందుకురాని కాంట్రాక్టర్‌

బడా కాంట్రాక్టర్ల ఎత్తుగడ అనే ఆరోపణలు

రీటెండర్లలో పనులు పొందేందుకు కుయుక్తులు..?

సాక్షి,ఆదిలాబాద్‌: రెండు నెలల కిందట ఆదిలాబాద్‌ పట్టణంలో వీధిదీపాలు అమర్చడం, వాటి విడిభాగాలు సరఫరా చేసేందుకు టెండర్లు నిర్వహించారు. వర్షాకాలంలో సమస్య ఏర్పడకుండా ముందు జాగ్రత్తగా వీటిని చేపట్టి పనులను కాంట్రాక్టర్‌కు అప్పగించాలనేది ఉద్దేశం. అనుకున్న విధంగానే ప్రక్రియ చోటు చేసుకుంది. ఓ కాంట్రాక్టర్‌ అంచనా వ్యయం కంటే అమితంగా తక్కువ వ్యయానికే ఆ పనులు చేపట్టేందుకు ముందుకు వచ్చాడు. దీంతో అతనికి ఆ పనులు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత ఆ వర్క్స్‌ నిర్వహించేందుకు ఆ కాంట్రాక్టర్‌ ముందుకు రాలేదు. దీంతో అతనికి నోటీసులు పంపించారు. దానికి అతని నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. తాజాగా ఆ కాంట్రాక్టర్‌ను డిబార్‌ చేస్తున్నట్లు, రెండేళ్ల పాటు ఎలాంటి పనులు చేపట్టకుండా చర్యలు తీసుకున్నట్లు మున్సిపల్‌ అధికారులు చెబుతున్నారు. ఆ కాంట్రాక్టర్‌ ఎందుకిలా చేసి ఉంటాడు.. అంచనా వ్యయం కంటే 32 శాతం తక్కువ ధరకే తాను పనులు చేపడతానని ముందుకొచ్చిన అతను.. ఆ తర్వాత అగ్రిమెంట్‌ ఎందుకు చేసుకోలేదు.. మున్సిపాలిటీ నుంచి నోటీసులు జారీ చేసినా ఎందుకు పట్టించుకోలేదు.. రెండేళ్ల పాటు అతనికి ఏ పనులు దక్కకుండా చర్యలు తీసుకునేంత వరకు వచ్చినా ‘డోంట్‌ కేర్‌’ అన్నట్టుగా ఎందుకు వ్యవహరించాడు.. అనేది అంతుపట్టనిది. దీని వెనుక కొంత మంది మున్సిపల్‌ అధికారులు, బడా కాంట్రాక్టర్ల హస్తం ఉందనే ప్రచారం జరుగుతోంది. మొదటి కాంట్రాక్టర్‌ పనులు చేపట్టకుండా చేసి, అత్యవసరంగా చేపట్టే పనులంటూ రీటెండర్ల నిర్వహణ ద్వారా ఈ పనులను తమ అనునాయులకు దక్కేలా చేయడమే వ్యూహం అనే అపవాదు

వ్యక్తమవుతోంది.

వరుసగా విద్యుత్‌ టెండర్లలోనే..

మున్సిపాలిటీలో విద్యుత్‌ పనులకు సంబంధించిన టెండర్లలో వరుసగా ఆరోపణలు వ్యక్తమవుతున్నప్పటికీ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతనెల జూన్‌లో రూ.65 లక్షల విద్యుత్‌ పనుల్లో అక్రమాలు జరిగినట్లు ‘సాక్షి’ దినపత్రిక వెలుగులోకి తీసుకొచ్చినప్పటికీ వాటి విషయంలో ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఆన్‌లైన్‌లో నిర్వహించాల్సిన టెండర్లను ఆఫ్‌లైన్‌లో నిర్వహించి తమకు అనువైన కాంట్రాక్టర్‌కు పనులను అప్పగించారని ఓ అధికారిపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమైనప్పటికీ దాని విషయంలో ఎలాంటి విచారణ చేపట్టకపోవడం గమనార్హం.

పనుల వివరాలు ఇలా..

15వ ఆర్థిక సంఘం నిధులతో పట్టణంలో వీధిదీపాల ఏర్పాటు, వాటి విడిభాగాలు సరఫరా చేసేందుకు రెండు నెలల కిందట ఈ టెండర్లను నిర్వహించారు. బాలాజీ ఎంటర్‌ప్రైజెస్‌ పేరిట రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌కు చెందిన స్పెషల్‌ క్లాస్‌ సివిల్‌ కాంట్రాక్టర్‌ ఈ పనులను దక్కించుకున్నారు. రూ.48 లక్షల అంచనా వ్యయం గల ఈ పనులను 32 శాతం లెస్‌లో టెండర్‌లో కోడ్‌ చేసి పనులను హస్తగతం చేసుకున్నాడు. ఆ తర్వాత అగ్రిమెంట్‌ చేసుకోకుండా వెనుకడుగు వేయడమే ఇక్కడ అంతుచిక్కని ప్రశ్న.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement