మధిరకు సై.. మనకు నై.. | - | Sakshi
Sakshi News home page

మధిరకు సై.. మనకు నై..

Jul 24 2026 1:45 AM | Updated on Jul 24 2026 1:45 AM

● విద్యార్థులకు అందని సాంకేతిక విద్య ● అన్ని జిల్లాల్లో ఇంజినీరింగ్‌ కాలేజీలు ● ఆదిలాబాద్‌కు ఇచ్చిన హామీ ఏమాయే ● నిర్మల్‌ జిల్లా డిమాండ్‌పై పట్టింపేది..?

నిర్మల్‌: ‘నాన్నా.. ఇంకెంత దూరం వెళ్లాలి. ఈ బస్‌ సీట్ల గంటల కొద్ది కూర్చుంటున్నందుకేమో కాళ్లు, నడుము నొస్తుంది నాన్నా..’ ఇది ఇంజినీరింగ్‌ చదవడానికి బోథ్‌ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన ఓ విద్యార్థి అవస్థ. ‘ఏం చేస్తాం బిడ్డా..! మన ప్రాంత పరిస్థితులు అట్లున్నయ్‌. ఓట్లేయించుకునేందుకే తప్పా.. ఇక్కడి ప్రజల కష్టాలను ఓళ్లు కూడా పెద్దగా పట్టించుకోరు. మన ఉమ్మడి ఆదిలాబాద్‌ అంటేనే చిన్నచూపు. మేం చదువుకున్నప్పటి నుంచి అడుగుతున్నం. నిర్మల్‌ల్లన్న, ఆదిలాబాద్‌ల్లన్న ఇంజినీరింగ్‌ కాలేజీ పెట్టాలని. కానీ.. ఏ ప్రభుత్వమూ పట్టించుకున్న పాపాన పోవడం లేదు బిడ్డా..?! మీ భవిష్యత్‌ బాగుండాలని మాలాంటి తల్లిదండ్రులం కాయకష్టం చేసుకుంట, ఎంత కష్టనష్టమైనా వంద ల కిలోమీటర్ల దూరంల ఉన్న హైదరాబాద్‌ల మి మ్మల్ని సదివించుకుంటున్నం..’ అని ఆ తండ్రి ఆవేదన వ్యక్తంచేశాడు. ఆదిలాబాద్‌–నిర్మల్‌ జిల్లాలకు కనీసం వంద కిలోమీటర్ల దూరంలోనూ ఒక్క ప్రభు త్వ ఇంజినీరింగ్‌ కాలేజీ లేదు. ఆదిలాబాద్‌ నుంచి 310కిలో మీటర్ల నిర్మల్‌ నుంచి 220కిలో మీటర్ల దూరంలో ఉన్న హైదరాబాద్‌ వరకు వెళ్లాల్సిందే.

అక్కడలా.. ఇక్కడెందుకిలా..?

రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కళాశాలల ఏర్పాటు నిర్ణయాలు తీసుకుంటున్న సమయంలో నిర్మల్‌, ఆదిలాబాద్‌ జిల్లాలకూ ప్రతిసారీ నిరాశే ఎదురవుతోంది. మాటిచ్చిన వారంలోనే మధిరకు ప్రభుత్వం వెంటనే ఆమోదం తెలపడం అభినందనీయమే. కానీ.. ఇదే సమయంలో ఇప్పటివరకూ కనీసం యూనివర్సిటీ కూడా లేని ఉమ్మడి జిల్లానూ లెక్కలోకి తీసుకోవాలన్నదే ఈ ప్రాంతవాసుల వాదన. మధిరకు 210కిలో మీటర్ల దూరంలో హైదరాబాద్‌, కేవలం 75కిలో మీటర్ల దూరంలో విజయవాడ ఉంది. పైగా రెండు నగరాలకు మధ్యన గల ఈ నియోజకవర్గానికి రైల్వేమార్గం కూడా ఉంది. అలాంటి చోటును కరుణించిన సర్కారు.. వందల కిలో మీటర్ల దూరంలో ఉన్న మన ప్రాంతాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదన్న అభిప్రాయం బలపడుతోంది.

జిల్లాలతో దోబూచులాట

గత ప్రభుత్వమైనా, ఇప్పటి సర్కారైనా నిర్మల్‌, ఆదిలాబాద్‌ ప్రాంతాలతో విద్యారంగం విషయంలో దోబూచులాడుతున్నాయే గాని ముందడుగు వేయడం లేదన్నది స్పష్టమవుతోంది. ముందుగా ఆదిలాబాద్‌ సభలో జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. అనంతరం నిర్మల్‌ సభలో ఇదే జిల్లాలో తాత్కాలికంగా బాసరలోనే విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఇలా రెండు జిల్లాల్లో అదే మాటిచ్చారు. కానీ.. ఆరునెలలు దాటినా అక్కడ.. ఇక్కడ.. యూనివర్సిటీకి సంబంధించి అడుగు కూడా ముందుకు పడలేదు. ఇక గతంలో నిర్మల్‌లో ఇంజినీరింగ్‌ కాలేజీ కావాలని అడిగితే అప్పటి సీఎం కేసీఆర్‌ ఆదిలాబాద్‌కు ఇస్తున్నట్లు చెప్పారు. పోనీ.. అక్కడైనా ఏర్పాటు చేశారా.. అంటే అదీ లేదు. ఇలా ప్రభుత్వాలే దోబూచులాడటంపై రెండుజిల్లాల ప్రజలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. చదువులతల్లి కొలువైన ప్రాంతంలో పూర్తిస్థాయి విద్యాభివృద్ధి ఇంకెప్పుడు చేస్తారని ప్రశ్నిస్తున్నారు.

10న హామీ.. 18న జీవో

ఈనెల 10న ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలంలో రైతు ఆశీర్వాద సభ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డిని మధిర ఎమ్మెల్యే, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తమకు ఇంజినీరింగ్‌ కాలేజీ కావాలని కోరారు. వెంటనే సీఎం సుముఖత వ్యక్తంచేశారు. అంతే కాదు.. వారం వ్యవధిలోనే మధిరకు ఇంజినీరింగ్‌ కాలేజీని మంజూరు చేస్తూ ఈనెల 18న జీవో జారీచేశారు. మధిరకు కేవలం 84కిలో మీటర్ల దూరంలోగల ఇదే ఖమ్మం జిల్లా పాలేరులో ఇప్పటికే ప్రభుత్వ జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కాలేజీ ఉండటం గమనార్హం.

మూడేళ్లు దాటినా ముచ్చటేది?

నిర్మల్‌ జిల్లా కేంద్రంలో 2023 జూన్‌ 4న కలెక్టరేట్‌ ప్రారంభోత్సవం సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించారు. అప్పటి సీఎం కేసీఆర్‌ హాజరు కాగా, అప్పటి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నిర్మల్‌ జిల్లాలో ఇంజినీరింగ్‌ కాలేజీ ఏర్పాటు చేయాలని కోరారు. ఇందుకు కేసీఆర్‌ స్పందిస్తూ నిర్మల్‌ పేరు చెప్పకుండా ఉమ్మడి జిల్లాలో జేఎన్‌టీయూ ఇంజి నీరింగ్‌ కాలేజీ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. రెండ్రోజుల తర్వాత దానిని ఆది లాబాద్‌లో ఏర్పాటు చేస్తామని ప్రకటించా రు. కానీ, ఇప్పటిదాకా ఇంజినీరింగ్‌ కాలేజీ ముచ్చటే లేదు. అడిగిన నిర్మల్‌కు ఇవ్వలేదు.. ఇస్తామన్న ఆదిలాబాద్‌కూ దక్కలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement