ధాన్యం టెండర్ల రద్దుపై విచారణకు సీఎం ఆదేశం
మీడియాలో వచ్చేవరకు మంత్రి ఉత్తమ్‌కు తెలియదనే చర్చ
పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులపై మంత్రి ఫైర్
తన శాఖ వ్యవహారాలు పత్రికల్లో చూసి తెలుసుకోవాల్సి వస్తోందంటూ సన్నిహితుల వద్ద ఆవేదన, ఆగ్రహం
తన ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని అనుమానిస్తున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి!
సాక్షి, హైదరాబాద్: పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి తెలియకుండానే ఆ శాఖలో జరిగిన సన్న ధాన్యం టెండర్ల రద్దు వ్యవహారంపై విజిలెన్స్ విచారణ సాగడం చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారం వెనుక సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నట్టుగా మంత్రి భావిస్తున్నారని తెలిసింది. మిగిలిపోయిన సన్న ధాన్యాన్ని గ్లోబల్ టెండర్ల ద్వారా విక్రయించాలని భావించి టెండర్లను పిలిస్తే, బిడ్డర్లు తక్కువ ధరను కోట్ చేయడంతో మంత్రి ఆదేశాలతో ఆ టెండర్లు రద్దయ్యాయి. అయితే రద్దయిన ఈ టెండర్లకు సంబంధించి మంత్రికి తెలియకుండా సీఎం రేవంత్‌రెడ్డి విజిలెన్స్ విచారణకు ఆదేశించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
సంబంధిత శాఖ అధికారులు సైతం విషయం మంత్రికి తెలియజేయలేదని అంటున్నారు. విజిలెన్స్ విచారణ సంగతి పత్రికల్లో వచ్చేంత వరకు మంత్రికి కనీసం సమాచారం లేదని తెలుస్తోంది. దీనిపై తీవ్ర అసంతృప్తికి గురైన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. శాఖ ఉన్నతాధికారులపై తీవ్రంగా మండిపడినట్లు తెలిసింది. తనకు శాఖకు సంబంధించిన అంశాలు పత్రికల్లో చూసి తెలుసుకోవాల్సి వస్తోందంటూ సన్నిహితుల వద్ద ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.
మంత్రిని సంప్రదించకుండానే..?
గత ఖరీఫ్ సీజన్‌లో సేకరించిన ధాన్యంలో కేంద్రం సెంట్రల్ పూల్ కింద తీసుకున్నది, రాష్ట్ర అవసరాలకు ఉంచుకున్నది పోగా.. సుమారు 12 లక్షల టన్నుల సన్న ధాన్యం మిగిలిపోయింది. ఈ ధాన్యాన్ని గ్లోబల్ టెండర్ల ద్వారా వేలం వేయాలని నిర్ణయించిన మంత్రి.. పౌరసరఫరాల సంస్థ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు. తొలుత 5 లక్షల టన్నుల ధాన్యాన్ని 11 లాట్లుగా విభజించి టెండర్లను ఆహా్వనించారు. ఇందులో కనీస ధరను టన్నుకు రూ. 34,050గా నిర్ణయించినప్పటికీ, బిడ్డర్లు రూ.25 వేల నుంచి రూ.27 వేల మధ్య మాత్రమే కోట్ చేశారు. దాంతో మంత్రి ఆదేశాల మేరకు ఆ టెండర్లను అధికారులు రద్దు చేశారు.
ఈ నేపథ్యంలో బిడ్డర్లు తక్కువ ధరలకు ఎందుకు కోట్ చేశారనే అనుమానంతో ముఖ్యమంత్రి విజిలెన్స్ విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. అయితే ఈ నిర్ణయం తీసుకునే ముందు సంబంధిత శాఖ మంత్రి అయిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని సంప్రదించలేదని సమాచారం. కాగా పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు కూడా మంత్రికి ఈ విషయం తెలియజేయకుండా ఏకంగా మిల్లుల్లో విచారణ చేపట్టారు. మీడియాలో వచ్చిన సమాచారంతో విషయం తెలుసుకున్న మంత్రి ఉత్తమ్..‘నా శాఖలో నాకు తెలియకుండా విజిలెన్స్ విచారణ ఎలా వేస్తారు..? ఎవరి ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నారు..?’ అంటూ గురువారం అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
సీఎంవో నుంచే నిర్ణయాలా..?
పౌరసరఫరాల శాఖకు సంబంధించిన కీలక నిర్ణయం నేరుగా సీఎంవో ఆదేశాలతోనే అమలవుతుండడం, ఆ శాఖ మంత్రికి సమాచారం ఇవ్వకపోవడం అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సీఎంవో నుంచి వచ్చిన సూచనల మేరకు ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకు విజిలెన్స్ విచారణ, మిల్లుల్లో దాడులు చేపట్టినట్టు ప్రచారం జరుగుతోంది. కాగా ఆ మరుసటి రోజే మిల్లులకు ఇచ్చిన రూ.52 కోట్ల ధాన్యం మాయమైందనే విషయాన్ని కూడా మంత్రికి తెలియజేయకుండానే లీక్ చేసినట్లు తెలిసింది.
మిల్లుల నుంచి సీఎంఆర్ పూర్తిగా సేకరించకుండానే ధాన్యం మాయమైందనే నిర్ణయానికి వచ్చిన అధికారులు.. ఆ విషయాన్ని లీక్ చేయడంపై కూడా మంత్రి ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. నిర్ణయాలు ముందుగా మీడియాకు లీక్ చేసి, అనంతరం శాఖను ఇరకాటంలో పెట్టేలా పరిస్థితి నెలకొంటోందని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. విజిలెన్స్ విచారణ, దాడుల పేరుతో తన ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానాన్ని కూడా ఆయన తన సన్నిహితుల వద్ద వ్యక్తం చేసినట్లు సమాచారం.


