సాక్షి, హైదరాబాద్: మరోసారి బీజేపీ నేతలపై ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. ఒక మంచి ఆలోచనతో పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ఈటల రాజేందర్, బండి సంజయ్‌ని ఒక చోట కూర్చోబెట్టారు అభయ్ పాటిల్.. కానీ ఆ ఇద్దరు వ్యక్తులు ఒకటైతే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందా..?. ఆ నేతల మధ్య చిన్న చిన్న సమస్యలు ఉండవచ్చు..అయినా ఒకటిగానే ఉన్నారు. పార్టీలో సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. వారి పరిస్థితి ఏంటి?’’ అంటూ రాజాసింగ్ ప్రశ్నించారు.
‘‘గతంలో చాలామంది మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేటర్లు గెలిచారు. వాళ్ల దగ్గరకి వెళ్లి వాళ్ల సమస్యలు, డివిజన్ సమస్యలు, బూత్ కార్యకర్తల సమస్యలు అడుగుతున్నారా?. గ్రేటర్ హైదరాబాద్‌లో జరిగే మూడు కార్పొరేషన్ ఎన్నికల్లో మూడు మేయర్లు గెలుస్తామని చెపుతున్నారు. ఆ మూడు కార్పొరేషన్‌లలో బీజేపీ బలంగా ఉందని తెలుసుకున్నారా? సమావేశాల్లో మేము చాలా బలంగా ఉన్నామని బీజేపీ నేతలు స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు. మూడు కార్పొరేషన్ మేయర్లు గెలవడం కాదు.. ఒకటి కూడా కాదు.. ఒక కార్పొరేషన్‌లోని సగం సీట్లు గెలిచి చూపించండి’’ అంటూ రాజాసింగ్ వ్యాఖ్యానించారు.
‘‘బీజేపీ పని తీరు నాకు అట్లా కనిపిస్తుంది.. కొంత మందికి అధ్యక్ష పదవి రావొద్దని.. ఆ పదవిలో కొంత మంది రాంచందర్‌రావుని కూర్చోపెట్టారు. రాంచందర్ రావు చేతులు కట్టేసి పని చేయమంటే ఎట్లా?. రాంచందర్‌రావు ఎంత బాధలో ఉన్నారో నాకు తెలుసు. ఒకే ఒక్క వ్యక్తి మేము చెప్పినట్లే పని చేయాలని చెపితే ఎట్లా చేస్తారు. వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలిస్తే మీకే పేరు వస్తుంది. ఉన్న సీట్లలో తగ్గితే మీపైనే రాళ్లు వేస్తారు. మీ చేతులు కట్టేసిన వాళ్ళ గురించి కేంద్ర పెద్దలకు చెప్పండి. మీరు ఫ్రీ హ్యాండ్‌గా పని చేస్తేనే మంచి పలితాలు వస్తాయి.
..అధిష్టానం, పార్టీలో ఉన్న పెద్దలకి నా విజ్ఞప్తి.. ఒక వ్యక్తి కోసం ఎప్పడు ఆలోచన చేయకండి. నాలాంటి వాళ్లు పార్టీలోకి వచ్చి బాధపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీ భిక్షం నాకు వద్దు. ఇద్దరు ముగ్గురు ఇగోల వల్ల పార్టీకి ఎంత నష్టం జరిగిందో హైకమాండ్‌కి చెప్పండి. తెలంగాణలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రావాలని బీజేపీ శ్రేణులు, ప్రజలు కోరుకుంటున్నారు. కాషాయ రాజ్యం కోసం చాలా మంది కలలు కంటున్నారు. ఆ కలలని నిజం చేయండి’’ అంటూ రాజాసింగ్ చెప్పుకొచ్చారు.


