సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ మూడు రోజుల పర్యటనతో రాష్ట్ర పార్టీలో జోష్ వచ్చిందని.. ఆ తర్వాత ఇన్‌ఛార్ట్‌గా నా బాధ్యతలు నేను చేస్తున్నాను’’ అని బీజేపీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ అభయ్ పాటిల్ అన్నారు. నిన్న(శనివారం) లక్ష్మణ్ ఇంట్లో ఇద్దరు కీలక నేతలతో కలిసి రొటీన్ లంచ్ మీటింగ్ జరిగిందన్నారు. మీటింగ్ తర్వాత కార్యకర్తల్లో జోష్ వచ్చిందని వింటున్నాను. పాజిటివ్ వేవ్ వస్తుందంటే ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తాం కదా అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
బండి సంజయ్, ఈటల రాజేందర్ సమావేశం ప్రత్యేకం కాదు.. ఇలాంటివి రానున్న రోజుల్లో చాలా జరుగుతాయి. రానున్న నెల రోజుల్లో ఏం జరగబోతుందో మీరే చూస్తారు. పార్టీని బలోపేతం చేయడం.. అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. సాయంత్రం మరో ఎమ్మెల్యేతో కూడా భేటీ కాబోతున్నాం. నితిన్ నబీన్ ఆదేశాలతో పని చేస్తున్నాను. పార్టీ డోర్స్ ఓపెన్ చేస్తున్నాం.. త్వరలో ఎవరెవరు వస్తారో చూడండి’’ అంటూ అభయ్ పాటిల్ చెప్పుకొచ్చారు. కాగా, రాజకీయ పరిణామాలపై చర్చించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావుతో కూడా అభయ్ పాటిల్ ప్రత్యేకంగా బ్రేక్‌ఫాస్ట్ సమావేశం నిర్వహించారు.
కాగా, రాష్ట్ర ముఖ్యనేతల మధ్య అంతర్గత వైషమ్యాలకు చెక్ పెట్టి, సయోధ్య కుదిర్చేందుకు బీజేపీ జాతీయ నాయకత్వం నడుం బిగించింది. తెలంగాణలోని ఎంపీలు, ఇతర నాయకుల మధ్య నెలకొన్న ఈగోలు, గ్రూపులు, ఇతర సమస్యల పరిష్కారం దిశగా చర్యలు వేగవంతం చేసింది. రాష్ట్రపార్టీకి కాయకల్ప చికిత్సలో భాగంగా... శనివారం బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ నివాసంలో రాష్ట్రపార్టీ ఇన్‌చార్జి అభయ్ పాటిల్ సమక్షంలో కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ సమావేశమయ్యారు. రెండుగంటల పాటు జరిగిన ఈ భేటీ అనంతరం ఇరువురు కరచాలనంతోపాటు ఆలింగనం చేసుకుని తమ మధ్య విభేదాలకు ఫుల్‌స్టాప్ పెట్టినట్టుగా సంకేతమిచ్చారు.
ఇప్పటివరకు జరిగిన విషయాలను పక్కనపెట్టి పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ఇరువురు కృషిచేయాలన్న అధిష్టానం సందేశాన్ని అభయ్‌పాటిల్ తెలియజేసినట్టు సమాచారం. రాష్ట్ర బీజేపీలోని అంతర్గత రాజకీయాలపై పార్టీ హైకమాండ్ దృష్టి పెట్టిందని.. ‘కమలదళానికి కాయకల్ప చికిత్స’ శీర్షికతో సాక్షి ప్రత్యేక కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం సంజయ్-ఈటల భేటీ, అనంతరం ఎంపీ అర్వింద్ ధర్మపురి నివాసానికి అభయ్‌పాటిల్ వెళ్లి చర్చలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది. విభేదాలు నెలకొన్న ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలను కూడా ఆయన త్వరలో కలిసి తమ మధ్య ఏర్పడిన అంతరాలను దూరం చేసుకుని పార్టీ దారిలోకి రావాల్సిందేనని హెచ్చరిస్తారని సమాచారం.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ రాష్ట్ర పర్యటనలో నేతలంతా విభేదాలు పక్కనపెట్టి పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కలిసి పనిచేయాలని గట్టి హెచ్చరిక జారీ చేసివెళ్లారు. ఈ పర్యటన తర్వాత కొన్నిరోజులకు బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి సునీల్‌బన్సల్, అభయ్‌పాటిల్ ద్వారా రాష్ట్ర నేతల మధ్య విభేదాలకు చెక్ పెట్టేందుకు హైకమాండ్ దృష్టిపెట్టింది. తెలంగాణలోని నాయకులంతా పార్టీ లైన్‌లోకి రావాల్సిందేనని స్పష్టమైన సంకేతాలిచ్చింది. ఇందులో భాగంగా... ఎంతోకాలంగా ఉప్పు నిప్పుగా సాగుతున్న సంజయ్-ఈటలను ట్రాక్‌పైకి తెచ్చింది.
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే పార్టీలో మంచి వాతావరణం ఉండాలని చెప్పింది. విభేదాలు విడిచి పార్టీ లైన్‌లోకి వచ్చేందుకు సుముఖంగా లేనివారిని పక్కన పెట్టి వారికి ప్రత్యామ్నాయం చూసుకుంటామనే సంకేతాలు ఇచ్చేందుకూ సిద్ధమైంది. అభయ్ పాటిల్ చొరవతో ఎడమొహం పెడమొహంగా ఉన్న సంజయ్–ఈటల మధ్య సయోధ్య కుదిరినట్టేననే అభిప్రాయం వ్యక్తమౌతోంది. తమ విభేదాలన్నింటినీ పక్కనపెట్టి ముందుకు సాగుతామంటూ వీరిద్దరూ స్పష్టంచేసినట్టు తెలుస్తోంది.
ఈ సమావేశం ముగిశాక బండి సంజయ్ స్పందిస్తూ.. ‘పార్టీ ఆదేశాలు నాకు శిరోధార్యం.. హైకమాండ్ ఏం చెబితే అది చేస్తా’ అని చెప్పారు. ఈటల సైతం స్పందిస్తూ.. ‘తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే మా లక్ష్యం, పార్టీ కోసం ఎందాకైనా వెళ్తా’ అని పేర్కొన్నారు. అయితే లక్ష్మణ్ మాత్రం... తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, ఇది క్యాజువల్ లంచ్ మీట్ అని చెప్పడం గమనార్హం. కాంగ్రెస్‌ను గద్దె దించేందుకు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు పేర్కొన్నారు.సంస్థాగతంగా బలోపేతానికి నేతల మధ్య సమన్వయం, సమిష్టి తత్వం వాతావరణం నెలకొల్పే ప్రయత్నాలు ప్రారంభించింది.


