IND vs ENG: టీమిండియాకు భారీ షాక్‌! | Why Jasprit Bumrah Not Playing In IND Vs ENG 3rd ODI, BCCI Issues Major Injury Update Ahead Of Series Decider | Sakshi
Sakshi News home page

IND vs ENG: టీమిండియాకు భారీ షాక్‌!

Jul 19 2026 3:35 PM | Updated on Jul 19 2026 5:09 PM

Jasprit Bumrah Not Playing In 3rd ODI Vs ENG BCCI Gives Big Update

PC: BCCI X

ఇంగ్లండ్‌తో మూడో వన్డేకు ముందు టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఇందుకు సంబంధించి భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) తాజాగా ప్రకటన విడుదల చేసింది.

ఈ మేరకు.. ‘‘కార్డిఫ్‌ వేదికగా ఇంగ్లండ్‌తో రెండో వన్డే సందర్భంగా జస్‌ప్రీత్‌ బుమ్రా ఎడమ మోకాలికి గాయమైంది. కాబట్టి మూడో వన్డే కోసం సెలక్షన్‌కు అతడు అందుబాటులో లేకుండా పోయాడు. అతడి ఎడమ మోకాలు ఉబ్బిపోయింది’’ అని బీసీసీఐ తన ప్రకటనలో పేర్కొంది. 

రెండు వికెట్లు
కాగా చాన్నాళ్ల తర్వాత బుమ్రా ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌తో పునరాగమనం చేశాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన తొలి వన్డేలో కెప్టెన్‌ హ్యారీ బ్రూక్‌ (1) రూపంలో కీలక వికెట్‌ తీసి.. జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇక కార్డిఫ్‌ వేదికగా రెండో వన్డేలో బెన్‌ డకెట్‌ను డకౌట్‌ చేశాడు. అయితే, ఈ మ్యాచ్‌ సందర్భంగానే అతడు గాయపడినట్లు సమాచారం.

ఇక ఇప్పటికే చెరో విజయంతో టీమిండియా- ఇంగ్లండ్‌ మూడు వన్డేల సిరీస్‌లో 1-1తో సమంగా ఉన్నాయి. ఈ క్రమంలో లార్డ్స్‌ వేదికగా ఆదివారం నాటి ఆఖరి వన్డే కీలకంగా మారింది. అయితే, బుమ్రా గాయం కారణంగా ఈ నిర్ణయాత్మక మ్యాచ్‌కు దూరమయ్యాడు. కాగా బుమ్రా గాయం తీవ్రతపై ఇంకా స్పష్టత రాలేదు.

మూడు మార్పులు
మరోవైపు.. ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ కూడా రెండో వన్డే సందర్భంగా గాయపడి.. మూడో వన్డేకు దూరమయ్యాడు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇంగ్లండ్‌తో ఆఖరి వన్డేలో భారత్‌ తమ తుదిజట్టులో మూడు మార్పులు చేసింది. కేఎల్‌ రాహుల్‌ తిరిగి రాగా.. శివం దూబేపై వేటు పడింది. బుమ్రా, వాషీ స్థానాల్లో అర్ష్‌దీప్‌ సింగ్‌, ప్రిన్స్‌ యాదవ్‌ తుదిజట్టులోకి వచ్చారు.

మూడో వన్డేకు తుదిజట్లు
భారత్‌
రోహిత్‌ శర్మ, శుబ్‌మన్‌ గిల్‌ (కెప్టెన్‌), విరాట్‌ కోహ్లి, ఇషాన్‌ కిషన్‌  (వికెట్‌ కీపర్‌), శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌, అక్షర్‌ పటేల్‌, గుర్నూర్‌ బ్రార్‌, ప్రిన్స్‌ యాదవ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, ప్రసిద్‌ కృష్ణ

ఇంగ్లండ్‌
బెన్‌ డకెట్‌, జేకబ్‌ బెతెల్‌, జో రూట్‌, హ్యారీ బ్రూక్‌ (కెప్టెన్‌), జోస్‌ బట్లర్‌ (వికెట్‌ కీపర్‌), సామ్‌ కర్రాన్‌, విల్‌ జాక్స్‌, గస్‌ అట్కిన్సన్‌, జోఫ్రా ఆర్చర్‌, ఆదిల్‌ రషీద్‌, జోష్‌ టంగ్‌.

చదవండి: టీ20 సిరీస్‌.. జింబాబ్వేకు బయల్దేరిన టీమిండియా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement