భారత అండర్–21 జట్టు
హెడ్ కోచ్‌గా తొలగింపు
కొత్త కోచ్‌ను ఎంపిక చేసిన హాకీ ఇండియా
న్యూఢిల్లీ: భారత మాజీ గోల్‌కీపర్, అండర్–21 జూనియర్ పురుషుల హాకీ జట్టు హెడ్ కోచ్ పీఆర్ శ్రీజేశ్‌పై అనూహ్యంగా వేటు పడింది. అతడిని కోచ్ పదవి నుంచి హాకీ ఇండియా (హెచ్‌ఐ) తప్పించింది. 17 నెలల పాటు కోచ్‌గా వ్యవహరించిన శ్రీజేశ్ మార్గనిర్దేశనంలో భారత్ ఐదు టోర్నీలు ఆడగా ఐదింటిలోనూ పతకం సాధించింది. జూనియర్ వరల్డ్ కప్‌లో కూడా కాంస్యం గెలుచుకుంది. అయితే శ్రీజేశ్ కాంట్రాక్ట్‌ను పొడిగించకుండా హెచ్‌ఐ కొత్త జూనియర్ కోచ్ ఎంపిక ప్రక్రియను పూర్తి చేసింది.
దీనిపై అతను తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. కోచ్‌గా తన విజయాలను పట్టించుకోకుండా కేవలం విదేశీ కోచ్‌ను ఎంపిక చేసేందుకే హెచ్‌ఐ ఈ నిర్ణయం తీసుకుందని అతను ఆరోపించాడు. పురుషుల సీనియర్ జట్టు కోచ్ క్రెయిగ్ ఫుల్టన్ జూనియర్ టీమ్‌కు కూడా విదేశీ కోచ్ కావాలని కోరడంతోనే హెచ్‌ఐ ఈ తరహాలో వ్యవహరించడం ఆశ్చర్యం కలిగించిందని శ్రీజేశ్ అన్నాడు. ఇటీవలే కేంద్ర క్రీడా మంత్రి మన్‌సుఖ్ మాండవీయ... 2036 ఒలింపిక్స్ కోసం శ్రీజేశ్‌లాంటి కోచ్‌లు కావాలని తనను ప్రశంసించిన విషయాన్ని అతను గుర్తు చేశాడు.
‘కోచ్‌గా విఫలమైతే అతడిని తప్పిస్తారనేది ఇంత కాలం చూశాను. కానీ విదేశీ కోచ్‌ను ఎంపిక చేసేందుకు భారత కోచ్‌ను తొలగిస్తారనేది ఇప్పుడు చూస్తున్నాను. జూనియర్ జట్టుకు కూడా విదేశీ కోచ్ ఉంటేనే భవిష్యత్తు కోసం సీనియర్ జట్టును సిద్ధం చేసేందుకు అనుకూలంగా ఉంటుందని హాకీ ఇండియా అధ్యక్షుడు నాకు చెప్పారు. విదేశీ కోచ్‌లకు ఇచ్చే ప్రాధాన్యత ఏమిటో దీని వల్ల అర్థమవుతోంది. భారత కోచ్‌లు భారత హాకీని అభివృద్ధి చేయలేరా’ అని శ్రీజేశ్ స్పందించాడు. వరుసగా రెండు ఒలింపిక్స్ క్రీడల్లో (2020 టోక్యో, 2024 పారిస్) భారత జట్టు కాంస్య పతకాలు గెలవడంలో గోల్‌కీపర్ శ్రీజేశ్ కీలకపాత్ర పోషించాడు. పారిస్ ఒలింపిక్స్ అనంతరం ప్లేయర్‌గా కెరీర్‌కు వీడ్కోలు పలికిన శ్రీజేశ్ కోచింగ్ వైపు వెళ్లాడు.
హాకీ ఇండియా వివరణ...
శ్రీజేశ్ అసంతృప్తిపై హెచ్‌ఐ స్పందించింది. అతడిపై తాము వేటు వేయలేదని, నిబంధనల ప్రకారమే వ్యవహరించామని స్పష్టం చేసింది. ‘శ్రీజేశ్ కాంట్రాక్ట్ గత డిసెంబర్‌లో ముగిసింది. దాంతో నిబంధనల ప్రకారం ప్రకటన ఇచ్చాం. అర్హులైన వారందరినీ షార్ట్‌లిస్ట్ చేసి ప్రక్రియ ప్రకారమే కొత్త కోచ్‌ను ఎంపిక చేశాం. త్వరలోనే కొత్త కోచ్ పేరును ప్రకటిస్తాం. శ్రీజేశ్‌ను మేం తొలగించలేదు. వచ్చే రెండు ఒలింపిక్స్‌ను దృష్టిలో ఉంచుకొని డెవలప్‌మెంట్ టీమ్‌కు కోచ్‌గా ఉండమని కోరాం. కోచ్‌గా కూడా అతను మరింత పరిణతి సాధించేందుకు అవకాశం లభిస్తుందని చెప్పాం. అయితే మేం ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా అతను దానిని తిరస్కరించాడు’ అని హెచ్ స్పష్టం చేసింది.


