ఒలింపిక్‌ స్వర్ణమే తదుపరి లక్ష్యం! | Manpreet Singh holds the record for the most matches played for India | Sakshi
Sakshi News home page

ఒలింపిక్‌ స్వర్ణమే తదుపరి లక్ష్యం!

Jun 19 2026 3:20 AM | Updated on Jun 19 2026 3:20 AM

Manpreet Singh holds the record for the most matches played for India

హాకీ స్టార్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌ ఆశాభావం

413 అంతర్జాతీయ మ్యాచ్‌లు పూర్తి 

భారత్‌ తరఫున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన రికార్డు  

న్యూఢిల్లీ: భారత సీనియర్‌ హాకీ ప్లేయర్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌ తన కెరీర్‌లో అతి పెద్ద మైలురాయిని అందుకున్నాడు. బుధవారం జర్మనీతో జరిగిన ప్రొ హాకీ లీగ్‌ మ్యాచ్‌ అతను తన కెరీర్‌లో 413 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాడు. భారత్‌ తరఫున అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌గా దిలీప్‌ టిర్కీ (412) రికార్డును మన్‌ప్రీత్‌ అధిగమించాడు. అంతర్జాతీయ హాకీలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన జాబితాలో జాన్‌ డోమన్‌ (481), డి నూయెర్‌ (453), ఎడీ ఒకెండెన్‌ (451), బారీ మిడిల్డన్‌ (432) తర్వాత ప్రస్తుతం ఐదో స్థానంలో ఉన్నాడు. 

మరో ఇద్దరు ఆటగాళ్లు వసీమ్‌ అహ్మద్‌ (410), జెరోన్‌ డెల్మీ (401) మాత్రమే 400కు పైగా మ్యాచ్‌లు ఆడారు. 2011 చాంపియన్స్‌ ట్రోఫీతో తన కెరీర్‌ ఆరంభించిన మిడ్‌ఫీల్డర్‌ మన్‌ప్రీత్‌ ఈ 15 ఏళ్లలో ఎన్నో ఘనతలు తన పేరిట లిఖించుకున్నాడు. 2020 టోక్యో, 2024 పారిస్‌ ఒలింపిక్స్‌లలో కాంస్య పతకాలు గెలిచిన భారత జట్లలో అతను సభ్యుడిగా ఉన్నాడు. వచ్చే శుక్రవారం తన 34వ పుట్టిన రోజు జరుపుకోనున్న మన్‌ప్రీత్‌ తాజా రికార్డు పట్ల సంతోషం వ్యక్తం చేశాడు.  

‘భారత జట్టు సభ్యుడిగా అంతర్జాతీయ మ్యాచ్‌లో బరిలోకి దిగడమే ఒక గొప్ప ఘనతగా భావించా. ఇప్పుడు దేశం తరఫున ఇన్ని మ్యాచ్‌లు ఆడటం నిజంగా చాలా గర్వకారణంగా అనిపిస్తోంది. నా ఈ ప్రయాణంలో భాగమైన సహచర ఆటగాళ్లు, కుటుంబ సభ్యులకు దీనిని అంకితమిస్తున్నా’ అని అతను స్పందించాడు. మన్‌ప్రీత్‌ ఘనతలు భవిష్యత్‌ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని ఈ సందర్భంగా హాకీ ఇండియా (హెచ్‌ఐ) ప్రశంసించింది. మన్‌ప్రీత్‌కు రూ.10 లక్షల నగదు పురస్కారాన్ని హెచ్‌ఐ ప్రకటించింది. 

రెండు ఒలింపిక్స్‌ కాంస్యాల తర్వాత ఇప్పుడు తన తదుపరి లక్ష్యం ఒలింపిక్‌ స్వర్ణమని, అదే తరహాలో ప్రపంచకప్‌లో కూడా విజయాన్ని ఆశిస్తున్నట్లు మన్‌ప్రీత్‌ చెప్పాడు. 2014, 2022 ఆసియా క్రీడలతో పాటు 2017, 2025లలో ఆసియా కప్‌ గెలిచిన జట్లలో కూడా అతను సభ్యుడిగా ఉన్నాడు. ‘భారత్‌కు విజయాలు అందించాలనే తపనే నన్ను ఇన్నేళ్లుగా నడిపిస్తోంది. ఇప్పుడు కూడా రెండు కలలు మిగిలి ఉన్నాయి. ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించడంతో పాటు ప్రపంచ కప్‌ కూడా గెలవాలనేది నా కోరిక. ఈ క్రమంలో నా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ఎప్పుడైనా సిద్ధమే’ అని అతను అన్నాడు.

ఆదర్శం... విరాట్‌ కోహ్లి 
2028 లాస్‌ ఏంజెలిస్‌ ఒలింపిక్స్‌ను దృష్టిలో ఉంచుకొని తన ఫిట్‌నెస్‌పై ప్రత్యేక దృష్టిపెట్టినట్లు... ఈ విషయంలో భారత స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి తనకు ఆదర్శమని మన్‌ప్రీత్‌ వెల్లడించాడు. ‘అత్యుత్తమ ఫిట్‌నెస్‌తో తర్వాతి పోటీలకు సిద్ధం కావాలని ఆశిస్తున్నా. ఇందులో లోటు ఉంటే జట్టునుంచి నేనే స్వయంగా తప్పుకుంటా. ఫిట్‌నెస్‌ విషయంలో నేను కోహ్లిని చూసి చాలా నేర్చుకున్నా. 

36 ఏళ్ల వయసులో కూడా ఎంత చురుగ్గా ఉండవచ్చో అతడిని చూస్తే తెలుస్తుంది. మైదానంలో దూకుడుగా ఉండటం, ఎక్కడా తగ్గకుండా 100 శాతం శ్రమించడం వంటివి కోహ్లి చేసి చూపించాడు. నేనే అదే చాలా వరకు పాటించా. ఇంత సుదీర్ఘ కాలం నేను జట్టులో కొనసాగడానికి మంచి ఫిట్‌నెస్‌ కూడా కారణం’ అని మన్‌ప్రీత్‌ వ్యాఖ్యానించాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement