హాకీ ప్రపంచకప్ టోర్నీలో పాల్గొనే భారత పురుషుల, మహిళల జట్ల కోసం హాకీ ఇండియా రూపొందించిన కొత్త జెర్సీ వివాదంలో మరో మలుపు చోటు చేసుకుంది. ఈ విషయం గురించి వివరణ ఇవ్వాల్సిందిగా హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కి ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యులకు లేఖ రాశాడు.
కాగా సుదీర్ఘ కాలంగా నీలం రంగు జెర్సీలోనే భారత జట్టు బరిలోకి దిగుతుండగా... ఈసారి మాత్రం జెర్సీని పూర్తిగా కాషాయ రంగులోకి మార్చారు. దీంతో రాజకీయంగానూ ఇది వివాదానికి దారితీసింది. ఒడిషా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్.. ప్రస్తుతం ఒడిషాలో బీజేపీ ప్రభుత్వ ఒత్తిడి వల్లే ఈ మార్పు జరిగి ఉంటుందని ఆరోపించారు.
ఇక కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా సైతం జెర్సీ రంగు కాషాయంలోకి మారడం వెనుక రాజకీయ కోణం ఉందని ఆరోపించారు. అయితే, హాకీ ఇండియా మాత్రం తమ నిర్ణయాన్ని సమర్థించుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కి ఎగ్జిక్యూటివ్ బోర్డు మెంబర్లకు రాసిన లేఖ సంచలనంగా మారింది.
ఈ మేరకు.. ‘‘భారత జాతీయ హాకీ జట్టు జెర్సీ రంగులో మార్పు గురించి చర్చించాలనుకుంటున్నాను. ఎగ్జిక్యూటివ్ బోర్డు ముందు ప్రతిపాదన లేకుండానే.. నా దృష్టికి రాకుండానే ఈ నిర్ణయం జరిగిపోయిందనిపిస్తోంది.
జెర్సీని కాషాయ రంగులోకి మార్చడం ఒక్కటే నా లేఖకు కారణం కాదు. ఇది దేశానికి ప్రాతినిథ్యం వహించే జాతీయ జట్టు గుర్తింపుతో ముడిపడి ఉన్న అంశం. ఇలాంటి ప్రాధాన్య అంశం గురించి ఎన్నికైన నాయకత్వం వద్ద చర్చించకపోవడం సరికాదు.
ఈ విషయం గురించి మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. దురదృష్టవశాత్తూ రాజకీయంగానూ ఇది చర్చనీయాంశంగా మారింది. ప్రపంచకప్ టోర్నీకి సమయం ఆసన్నమవుతున్న వేళ ఇలాంటి రచ్చ జరుగుతోంది.
అయితే, ఇది కేవలం క్రీడాపరంగా మాత్రమే తీసుకున్న నిర్ణయమని నేను స్పష్టం చేయాలనుకుంటున్నా. ఒడిషా ప్రభుత్వం ఈ విషయం గురించి నన్ను వివరణ కోరింది. కాబట్టి హాకీ ఇండియా అధికారులు నాకు వివరణ ఇవ్వాల్సి ఉటుంది.
కొత్త జెర్సీ రంగు ఎంపిక వెనుక కారణం, రంగు మార్పు ప్రక్రియ, ఎలాంటి పరిస్థితుల్లో ఈ నిర్ణయాన్ని ఆమోదించారు. దీనిని ఎలా అమలు చేశారన్న అంశాలపై నాకు వివరణ కావాలి’’ అని టిర్కి తన లేఖలో పేర్కొన్నాడు. జెర్సీ రంగు మార్పు గురించి బహిరంగంగా ప్రకటన చేసేందుకు ముందుగా తనకు గానీ, ఎగ్జిక్యూటివ్ బోర్డుకు గానీ ఎందుకు తెలపలేదని ప్రశ్నించాడు.


