టీమిండియా యువ ఆల్‌రౌండర్ మానవ్ సుతార్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. 23 ఏళ్ల సుతార్ తిరిగి ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్‌లో వార్విక్‌షైర్ తరపున ఆడేందుకు సిద్దమయ్యాడు. శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ ముగిసిన వెంటనే అతడి ఇంగ్లండ్‌కు పయనం కానున్నాడు. ఈ విషయాన్ని వార్విక్‌షైర్ క్రికెట్ క్లబ్ ఎక్స్ వేదికగా ధ్రువీకరించింది.
ప్రస్తుతం జరుగుతున్న కౌంటీ ఛాంపియన్‌షిప్ డివిజన్ వన్ టోర్నీలో వార్విక్‌షైర్ ఆడే చివరి 4 మ్యాచ్‌లకు మానవ్ అందుబాటులో ఉండనున్నాడు. కాగా ఈ సీజన్ ఆరంభంలోనూ వార్విక్‌షైర్ తరఫున మానవ్ రెండు మ్యాచ్‌లు ఆడాడు. సమర్‌సెట్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు.
యార్క్‌షైర్‌తో మ్యాచ్‌లోనూ తన స్పిన్ మయాజాలాన్ని ప్రదర్శించాడు. మొత్తంగా రెండు మ్యాచ్‌ల్లో 11 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. ఈ రాజస్తాన్ స్పిన్నర్ బ్యాటింగ్‌లో కూడా 98 పరుగులు చేశాడు. మళ్లీ ఇప్పుడు ఇంగ్లీష్ గడ్డపై ఇరగదీసేందుకు సుతార్ ఉవ్విళ్లూరుతున్నాడు.
అరంగేట్రంలో అదుర్స్
కాగా మానవ్ సుతార్ గత నెలలో ముల్లాన్‌పూర్ వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో భారత్ తరపున అరంగేట్రం చేశాడు. తన తొలి మ్యాచ్‌లోనే అతడు అదరగొట్టాడు. బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ రాణించాడు.
డెబ్యూ మ్యాచ్‌లోనే 5 వికెట్ల హాల్ సాధించి అందరి ప్రశంసలను అందుకున్నాడు. ఈ క్రమంలోనే సుతార్‌ను రవీంద్ర జడేజా అందుబాటులో వచ్చినప్పటికి శ్రీలంక పర్యటనకు ఎంపిక చేశారు. అతడికి తుది జట్టులో కూడా చోటు దక్కే అవకాశముంది.
చదవండి: LPL 2026: ఇదేమి బ్యాటింగ్ బ్రో? అక్కడ కూడా పరువు తీస్తున్నావుగా?


