మానవ్‌ మాయాజాలం.. టీమిండియా రికార్డు విజయం | India Beat Afghanistan By Innings And 300 Runs In New Chandigarh Test, Check Out Score Details Inside | Sakshi
Sakshi News home page

మానవ్‌ మాయాజాలం.. టీమిండియా రికార్డు విజయం

Jun 8 2026 3:15 PM | Updated on Jun 8 2026 3:43 PM

India beat afghanistan by innings 300 runs

న్యూ చండీఘడ్‌లోని ముల్లాన్‌పూన్‌ వేదికగా పసికూన ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన ఏకైక టెస్ట్‌లో భారత్‌ ఇన్నింగ్స్‌ 300 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కేవలం రెండున్నర రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో భారత్‌ ఒకేసారి బ్యాటింగ్‌ చేసి ఆఫ్ఘనిస్తాన్‌ను రెండుసార్లు ఆలౌట్‌ చేసింది. 

భారత స్పిన్నర్లు ఏకంగా 16 వికెట్లు తీసి ఆఫ్ఘన్ల భరతం పట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో అరంగేట్రం స్పిన్నర్‌ 6 వికెట్లు తీయగా.. రెండో ఇన్నింగ్స్‌లో సుందర్‌ 4, కుల్దీప్‌ 3 వికెట్లతో సత్తా చాటారు. ఈ గెలుపు టీమిండియాకు పరుగుల పరంగా (ఇన్నింగ్స్‌) అతి భారీ విజయంగా నిలిచింది.

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 564-8 స్కోర్‌ వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. భారత ఆటగాళ్లలో కేఎల్‌ రాహుల్‌ (100), కెప్టెన్‌ శుభ్‌మన​్‌ గిల్‌ (126) సెంచరీలతో కదంతొక్కగా.. సాయి సుదర్శన్‌ (81), రిషబ్‌ పంత్‌ (81), వాషింగ్టన్‌ సుందర్‌ (52 నాటౌట్‌) అర్ద సెంచరీలతో రాణించారు. 

మిగతా ఆటగాళ్లలో యశస్వి జైస్వాల్‌ 24, ధృవ్‌ జురెల్‌ 19, మానవ్‌ సుతార్‌ 28, మహ్మద్‌ సిరాజ్‌ 22, కుల్దీప్‌ యాదవ్‌ 9 (నాటౌట్‌) పరుగులు చేశారు. ఆఫ్ఘన్‌ బౌలర్లలో మహ్మద్‌ సలీమ్‌ సఫీ 6 వికెట్లతో చెలరేగగా.. జియా ఉర్‌ రహ్మాన్‌, కెప్టెన్‌ హష్మతుల్లా షాహిది తలో వికెట్‌ తీశారు.

అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆఫ్ఘనిస్తాన్‌ను అరంగేట్రం లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌ మానవ్‌ సుతార్‌ (22-10-33-6) తిప్పేశాడు. అతడికి ప్రసిద్ద్‌ కృష్ణ (11-2-37-3), సుందర్‌ (6.4-1-21-1) కూడా తోడవ్వడంతో ఆఫ్ఘనిస్తాన్‌ 152 పరుగులకే చాపచుట్టేసింది. ఆ జట్టు తరఫున రహ్మత్‌ షా (60) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు.

అనంతరం ఫాలో ఆన్‌ ఆడిన ఆఫ్ఘనిస్తాన్‌ రెండో ఇన్నింగ్స్‌లో ప్రతిఘటనే లేకుండా చేతులెత్తేసింది. ఈసారి సుందర్‌ (11-4-36-4), కుల్దీప్‌ (7.5-1-30-3), సుతార్‌ (10-2-29-1), సిరాజ్‌ (4-1-11-1) రెచ్చిపోవడంతో 112 పరుగులకే ఆలౌటై, ఘోర పరాజయంపాలైంది.

 

Advertisement
 
Advertisement
Advertisement