పారా స్విమ్మింగ్‌లో నాలుగో స్థానంలో నిలిచిన రవి బుడిగిన
గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్ తొలి రోజు శుక్రవారం భారత్ పతకాల బోణీ కొట్టలేకపోయింది. పారా స్విమ్మింగ్ ఎస్13 (దృష్టిలోపం) కేటగిరీ పురుషుల 100 మీటర్ల ఫ్రీస్టయిల్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ స్విమ్మర్ రవి వీర వెంకట భవాని కార్తీక్ బుడిగిన నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో కాంస్య పతకాన్ని చేజార్చుకున్నాడు. రవి 100 మీటర్ల లక్ష్యాన్ని 57.57 సెకన్లలో ముగించి నాలుగో స్థానాన్ని దక్కించుకున్నాడు. భారత్‌కే చెందిన మరో స్విమ్మర్ ఇమామ్ అలీ (1ని:03.73 సెకన్లు) ఏడో స్థానంలో నిలిచాడు.
నాథన్ హెండ్రిక్స్ (దక్షిణాఫ్రికా; 54.54 సెకన్లు), స్టీఫెన్ క్లెగ్ (స్కాట్లాండ్; 55.16 సెకన్లు), మాథ్యూ రెడ్‌ఫెర్న్ (ఇంగ్లండ్; 56.86 సెకన్లు) వరుసగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. పారా పవర్‌లిఫ్టింగ్‌లోనూ భారత్‌కు నిరాశ ఎదురైంది. పురుషుల లైట్ వెయిట్ కేటగిరీలో భారత లిఫ్టర్లు అశోక్ (143.8 పాయింట్లు) నాలుగో స్థానంలో, పరమ్‌జీత్ కుమార్ (135.6 పాయింట్లు) ఆరో స్థానంలో నిలిచారు. మహిళల లైట్ వెయిట్ కేటగిరీలో భారత లిఫ్టర్ సుమన్ దేవి (88.4 పాయింట్లు)... హెవీ వెయిట్ కేటగిరీలో కస్తూరి రాజమణి చివరిదైన ఆరో స్థానంలో నిలిచారు.
జాదుమణి శుభారంభం
పురుషుల బాక్సింగ్ 55 కేజీల విభాగంలో భారత బాక్సర్ జాదుమణి సింగ్ శుభారంభం చేశాడు. ఆరోన్ కులెన్ (స్కాట్లాండ్)తో జరిగిన తొలి రౌండ్‌లో జాదుమణి 5:0 స్కోరుతో ఘనవిజయం సాధించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. పురుషుల స్విమ్మింగ్‌లో రెండుసార్లు ఒలింపిక్స్‌లో పాల్గొన్న శ్రీహరి నటరాజ్ 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ ఈవెంట్‌లో సెమీఫైనల్‌కు చేరుకున్నాడు. లాన్ బౌల్స్‌లో భారత మహిళల జట్టు పెయిర్స్ ఈవెంట్‌లో 2–0తో దక్షిణాఫ్రికా జట్టును ఓడించింది. పురుషుల సింగిల్స్‌లో పుతుల్ సోనోవాల్ టైబ్రేక్‌లో సెసిల్ అలెగ్జాండర్ (ఫాల్‌్కలాండ్ ఐలాండ్స్)పై గెలుపొందాడు.
తొలి స్వర్ణం ఇంగ్లండ్ ఖాతాలో
కామన్వెల్త్ గేమ్స్ తొలి స్వర్ణ పతకం ఇంగ్లండ్ ఖాతాలోకి వెళ్లింది. పురుషుల పారా పవర్‌లిఫ్టింగ్ లైట్ వెయిట్ కేటగిరీలో ఇంగ్లండ్ లిఫ్టర్ మార్క్ స్వాన్ విజేతగా నిలిచాడు. మార్క్ స్వాన్ 153.9 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. రొలాండ్ ఇజురికి (నైజీరియా) రజతం, బోనీ గుస్టిన్ (మలేసియా) కాంస్యం సాధించారు. మహిళల పారా పవర్‌లిఫ్టింగ్ లైట్ వెయిట్ కేటగిరీలో ఎస్తెర్ న్వొర్‌గో (నైజీరియా; 119 పాయింట్లు) స్వర్ణం, ఎస్తెర్ ఒయెమా (నైజీరియా; 115.5 పాయింట్లు) రజతం, ఒలీవియా (ఇంగ్లండ్; 106.6 పాయింట్లు) కాంస్యం గెల్చుకున్నారు.

జూడో ప్లేయర్ తులికపై వేటు
కామన్వెల్త్ గేమ్స్ జూడో క్రీడాంశంలో భారత్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. 2022 బర్మింగ్‌హామ్ గేమ్స్‌లో +78 కేజీల విభాగంలో రజత పతకం నెగ్గిన తులిక మాన్‌పై ఈసారి వేటు పడింది. డోపింగ్ నిబంధనలను ఆమె ఉల్లంఘించడంతో జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) తులికపై సస్పెన్షన్ విధించింది. నిబంధనల ప్రకారం క్రీడాకారులు ఏడాది కాలంలో కనీసం మూడుసార్లు తాము ఎక్కడెక్కడ ఉన్నామో అనే సమాచారం ‘నాడా’కు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మూడుసార్లు విఫలమైతే వారిపై నిషేధం విధిస్తారు.

2024 పారిస్ ఒలింపిక్స్‌లోనూ పోటీపడ్డ తులిక ఏడాది కాలంలో తన ఆచూకీ వివరాలన ‘నాడా’కు సమర్పించకపోవడంతో ఆమెపై తాత్కాలిక నిషేధం విధించారు. కామన్వెల్త్ గేమ్స్ జూడో ఈవెంట్ ఈనెల 31న మొదలుకానుండగా... భారత జూడో ప్లేయర్లు ఈనెల 27న గ్లాస్గోకు బయలుదేరుతారు. పురుషుల 73 కేజీల విభాగంలో భారత జూడో ప్లేయర్ అరుణ్ కుమార్ డోపింగ్ పరీక్షలో విఫలమవ్వడంతో గురువారం జట్టు నుంచి అతడిని తొలగించారు. శుక్రవారం తులికపై వేటు పడటంతో భారత్ నుంచి 14 మందికి బదులుగా 12 మంది జూడో ప్లేయర్లు కామన్వెల్త్ గేమ్స్‌లో పోటీపడతారు.


