దొరికినంత దోచుకో.. తోటి పోలీసుల సొమ్ముతో కారు, బంగ్లా..! | Constable Ravi Faces RS 1 Crore Cooperative Society Scam Alleations | Sakshi
Sakshi News home page

దొరికినంత దోచుకో.. తోటి పోలీసుల సొమ్ముతో కారు, బంగ్లా..!

Jul 24 2026 12:11 PM | Updated on Jul 24 2026 12:16 PM

Constable Ravi Faces RS 1 Crore Cooperative Society Scam Alleations

దొరికినంత దోచుకో.. దోచుకుంది దాచుకో..
కారు, బంగ్లా తీసుకో.. లైఫు నీదే కుమ్ముకో.. 
ఓ సినిమా పాటలోని అర్థాన్ని కానిస్టేబుల్‌ రవి తన జీవితాన్ని అన్వయించుకున్నాడు. ఎంచక్కా తోటి సిబ్బంది సొసైటీ ఖాతాల్లోని డబ్బులతో జల్సా చేస్తున్నాడు.  

కడప అర్బన్‌: శాంతిభద్రతలను కాపాడుతూ, సమాజంలో నేరాలను అరికట్టాల్సిన పోలీస్‌ శాఖలోనే ఒక పెద్ద అవినీతి తిమింగలం తిష్టవేసింది. తోటి సిబ్బంది దాచుకున్న రక్తాన్ని, కష్టార్జితాన్ని నమిలి మింగేసింది. జిల్లా పోలీస్‌ కో–ఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీలో ఏకంగా రూ.1,07,00,000 (కోటి ఏడు లక్షలు) నిధులు నిలువునా స్వాహా అయిన వైనం జిల్లావ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ భారీ దందా బయటపడి రోజులు గడుస్తున్నా.. ఉన్నతాధికారులు విచారణ పేరిట కాలయాపన చేయడం, బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వెనుక పెద్ద తలకాయల హస్తం ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. 

పిల్లల చదువుల కోసం పెడితే.. బినామీ ఆస్తులకు వాడుకున్నారు! 
గతంలో కడప ఎస్పీగా పనిచేసిన మనీష్‌ కుమార్‌ సిన్హా హయాంలో పోలీసులు తమ అత్యవసర అవసరాల కోసం ఈ కో–ఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీని ఏర్పాటు చేసుకుని సభ్యత్వం తీసుకున్నారు. పిల్లల చదువులు, పెళ్లిళ్లు, అనారోగ్యం వంటి అత్యవసర సమయాలలో ఈ సొసైటీ నుంచి లోన్లు తీసుకుని, మరలా వాయిదాల పద్ధతిలో కట్టుకునేలా నిబంధనలు పెట్టుకున్నారు. ఈ వ్యవహారం పద్ధతి ప్రకారం జరిగి ఉంటే ఎవరికీ నష్టం కలిగేది కాదు. కానీ, ఈ సొసైటీ వ్యవహారాలను పర్యవేక్షించాల్సిన బాధ్యత కలిగిన వి.రవి (పీసీ 3275) ఈ భారీ నిధులను స్వాహా చేసినట్లు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇతనికి కొంతమంది ఉన్నతాధికారులు, సిబ్బంది తమ వంతు సహకారాన్ని అందించినట్లు తెలుస్తోంది. కానిస్టేబుల్‌ రవి 2020 సంవత్సరానికి ముందు సాధారణ జీవితాన్ని గడిపేవాడని, సొసైటీ ఏర్పాటైన తర్వాత వచ్చిన డబ్బుతో ప్రస్తుతం కడప నగరంలో ఒక భారీ భవనాన్ని నిర్మించుకున్నాడని, ఒకే ఫ్యాన్సీ నంబర్‌ కలిగిన ద్విచక్ర వాహనం, లగ్జరీ కారు కొనుగోలు చేయడం ఆ కానిస్టేబుల్‌ అవినీతి పలుకుబడికి పరాకాష్టగా మారిందని తోటి సిబ్బంది మండిపడుతున్నారు. 

ఆర్‌టీఐ కానిస్టేబుల్‌పై ఎస్పీ సీరియస్‌? 
సొసైటీలో కొన్నేళ్లుగా జరుగుతున్న అక్రమాలపై అనుమానం వచ్చిన ఒక బాధిత కానిస్టేబుల్‌.. ధైర్యంగా ముందుకొచ్చి సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేయడంతో ఈ గోల్‌మాల్‌ బాగోతం వెలుగులోకి వచ్చింది. అయితే, ఆర్‌టీఐ ప్రకారం తనకు వివరాలు తెలియజేయాలని దరఖాస్తు చేసుకున్న సదరు కానిస్టేబుల్‌ పై ప్రస్తుత జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్‌ విశ్వనాథ్‌ సీరియస్‌ అయినట్లు సమాచారం. దాదాపు రెండు నెలల క్రితం బాధితుడైన ఆ కానిస్టేబుల్‌ నేరుగా ఎస్పీని కలిసి తనకు పూర్తి వివరాలు కావాలని, తమ సొమ్ము తమకు ఇప్పించాలని కోరారు. సదరు కానిస్టేబుల్‌ విజ్ఞప్తిని స్వీకరించి, విచారిస్తామని చెప్పి రెండు నెలల పైగా గడుస్తున్నా.. ఇప్పటివరకు ఏమాత్రం విచారణ చేయకపోవడం గమనార్హం. 

మా డబ్బు మాకు వచ్చేదెప్పుడు? 
ఆధారాలతో సహా ఎస్పీ గారికి ఫిర్యాదు చేసినా విచారణ ఎందుకు నత్తనడకన సాగుతోంది? మాకు ఎప్పుడు న్యాయం జరుగుతుంది? అని బాధిత కానిస్టేబుళ్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తోటి సిబ్బంది కష్టార్జితాన్ని కాజేసిన పీసీ రవి, అతనికి సహకరించిన వారిపై ఎస్పీ ఆధ్వర్యంలో సమగ్రంగా ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని, అతను స్వాహా చేసిన డబ్బును వెనక్కి ఇప్పించేలా కృషి చేయాలని పోలీసు సిబ్బంది విజ్ఞప్తి చేస్తున్నారు. భవిష్యత్తులో డిపార్ట్‌మెంట్‌లో ఇలాంటి అవినీతి అక్రమాలకు తావులేకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు, సామాజిక కార్యకర్తలు కోరుకుంటున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement