భారత హాకీ జెర్సీపై ‘కాషాయ’ వివాదం | Controversy over Indian hockey jersey | Sakshi
Sakshi News home page

భారత హాకీ జెర్సీపై ‘కాషాయ’ వివాదం

Jul 31 2026 4:26 AM | Updated on Jul 31 2026 4:26 AM

Controversy over Indian hockey jersey

హాకీ ఇండియాపై తీవ్ర విమర్శలు 

నిర్ణయాన్ని సమర్థించుకున్న హెచ్‌ఐ  

న్యూఢిల్లీ: హాకీ ప్రపంచకప్‌లో పాల్గొనే భారత పురుషుల, మహిళల జట్ల కోసం హాకీ ఇండియా (హెచ్‌ఐ) రూపొందించిన కొత్త జెర్సీ వివాదానికి దారి తీసింది. సుదీర్ఘ కాలంగా నీలం రంగు జెర్సీలోనే భారత్‌ (మెన్‌ ఇన్‌ బ్లూ) బరిలోకి దిగుతుండగా... ఈసారి దానిని పూర్తిగా కాషాయ రంగులోకి మార్చారు. కొత్త జెర్సీ ప్రకటన రాగానే దీనిపై తీవ్ర చర్చ మొదలైంది. దేశవ్యాప్తంగా పలువురు అభిమానులతో పాటు మాజీ కెప్టెన్‌లు ధన్‌రాజ్‌ పిళ్లై, వీరేన్‌ రస్కిన్హా, పర్గత్‌ సింగ్, అజిత్‌పాల్‌ సింగ్‌ హెచ్‌ఐ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

‘దశాబ్దాలుగా నీలం రంగు జెర్సీనే భారత జట్టుకు పర్యాయపదంగా ఉంది. మేం ఎన్నో ఏళ్లు దీనిని సగర్వంగా ధరించాం. ఇదే రంగులో అభిమానులు కూడా టీమ్‌ను చూడటానికి ఇష్టపతారు. ఇప్పుడు మార్చాల్సిన అవసరం ఏముంది’ అని రస్కిన్హా వ్యాఖ్యానించాడు. జెండాలోని త్రివర్ణాల్లో కాషాయం ఒకటి అయినా... ఇది ఏనాడూ భారత హాకీ టీమ్‌ సాంప్రదాయ రంగు కాదని పిళ్లై అభిప్రాయపడ్డాడు. ఇష్టం వచ్చిన రంగులు ధరించేందుకు ఇది ఫ్రాంచైజీ లీగ్‌ కాదని అతను అన్నాడు. భారత హాకీని కూడా కాషాయీకరణ చేస్తున్నారని ఘాటుగా వ్యాఖ్యానించిన పర్గత్‌ సింగ్‌... హెచ్‌ఐ సరైన వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. జెర్సీపై అశోక చక్రను కాకుండా సుదర్శన చక్రాన్ని ఉంచడాన్ని కూడా వీరంతా ప్రశ్నిస్తున్నారు.  

‘రంగు మార్పు కొత్తేమీ కాదు’ 
తాజా వివాదంపై హాకీ ఇండియా స్పందించింది. జెర్సీ రంగులో మార్పులు కొత్తేమీ కాదని, గతంలోనూ భారత్‌ నీలం రంగు కాకుండా వేరే రంగులతో బరిలోకి దిగిందని గుర్తు చేసింది. ‘ఆటగాళ్లు, సహాయక సిబ్బందితో చర్చించిన తర్వాతే వారి సూచనలతో జెర్సీ రంగు మార్చాం. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాకీ సింథటిక్‌ మైదానాలు పూర్తిగా నీలం రంగులోనే ఉంటున్నాయి. అందులో కలిసిపోవడం వల్ల స్పష్టత లేక పలుమార్లు ఇబ్బంది అవుతోందనే అభిప్రాయం వ్యక్తం అయింది. కాషాయం కూడా త్రివర్ణ పతాకంలోని ఒక రంగు అని మర్చిపోవద్దు. జెర్సీ రంగులో మార్పులు గతంలోనూ జరిగాయి. 

2014 ప్రపంచ కప్‌లో పసుపు రంగుతో ఆడిన భారత్‌ 2018లో లేత నీలం రంగు జెర్సీతో బరిలోకి దిగింది’ అని హెచ్‌ఐ తమ వాదనను సమర్థించుకుంది. దీనిపై కూడా పలు విమర్శలు వచ్చాయి. పుష్కర కాలం క్రితమే హాకీ కోర్టులు నీలం రంగులోకి మారాయని, అప్పుడు రాని సమస్య ఇప్పుడు ఎలా వచ్చిందని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. గత రెండు ఒలింపిక్‌ పతకాలను బ్లూ టర్‌్ఫపైనే గెలిచిన విషయాన్ని వారు గుర్తు చేశారు. మరోవైపు భారత హాకీకి ప్రధాన స్పాన్సర్‌లో ఒడిషా ప్రభుత్వం వ్యవహరించడంలో కీలక పాత్ర పోషించిన నాటి ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ కూడా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. 

‘భారత హాకీ జెర్సీ రంగు నీలం నుంచి కాషాయానికి మారడం నన్ను తీవ్ర ఆవేదనకు గురి చేసింది. ఎన్నో ఏళ్లుగా నీలం రంగుతో భావోద్వేగాలు ముడిపడి ఉన్నాయి. జాతీయ పతాకంలోని అశోక చక్రంనుంచి నీలి రంగును ఎంచుకున్నాం. ఒడిషా ప్రస్తుత ప్రభుత్వ ఒత్తిడితోనే రంగు మారిందని మేం భావిస్తున్నాం’ అని పట్నాయక్‌ అన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement