PC: Instagram
వెస్టిండీస్ హెడ్‌కోచ్ డారెన్ సామీ వ్యాఖ్యలపై ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ అల్జారీ జోసెఫ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన గురించి అవాస్తవాలు మాట్లాడటం సరికాదని హితవు పలికాడు. అన్నీ తెలిసి కూడా సామీ తనపై ఎందుకు నింద వేశాడో అర్థం కావడం లేదన్నాడు.
కాగా వెస్టిండీస్ ప్రస్తుతం స్వదేశంలో పాకిస్తాన్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య తొలి టెస్టులో విండీస్.. పాక్‌ను 90 పరుగుల తేడాతో చిత్తు చేసి.. సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది.
ఇదిలా ఉంటే.. ఈ సిరీస్‌కు అల్జారీ జోసెఫ్ దూరమయ్యాడు. ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ వ్యక్తిగత కారణాల వల్లే అతడు ఈ సిరీస్ ఆడటం లేదని విండీస్ బోర్డు ప్రకటన విడుదల చేసింది. అయితే, హెడ్‌కోచ్ డారెన్ సామీ మాత్రం భిన్నంగా స్పందించాడు. అల్జారీ జోసెఫ్ సెలక్షన్‌కు అందుబాటులో లేకుండా పోయాడని.. పాక్‌తో ఆడటానికి అతడు నిరాకరించాడనే విధంగా వ్యాఖ్యలు చేశాడు.
ఈ విషయంపై అల్జారీ జోసెఫ్ తాజాగా స్పందించాడు. జోజో స్పోర్ట్ షోలో మాట్లాడుతూ.. ‘‘ఈ సిరీస్‌కు ముందు హెడ్‌కోచ్‌తో నేను చర్చించాను. విండీస్ బోర్డుతో కూడా మాట్లాడాను. ఆ సమయంలోనే బోర్డు నేను వ్యక్తిగత కారణాల వల్ల దూరమయ్యానని ప్రకటించింది.
మరి అన్ని విషయాలు తెలిసి కూడా సామీ ఆ విధంగా ఎందుకు మాట్లాడాడో నాకు అర్థం కావడం లేదు. అతడి వ్యాఖ్యలు దేనికి దారితీస్తాయో తెలుసు. తెలిసీ ఇలా మాట్లాడటం ఎందుకు?.. నిజానికి ఈ ఏడాది నేను ఆటకు దూరంగానే ఉన్నాను. కండరాల నొప్పి కారణంగా శరీరం సహకరించడం లేదు.
టెస్టు సిరీస్ ఆడేందుకు నేను ఏమాత్రం సిద్ధంగా లేను. అయినా సరే సామీ ఆ వివాదాస్పద స్టేట్‌మెంట్ ఇచ్చాడు. సమయం సందర్భం లేకుండా ఇలా ఎలా మాట్లాడగలరు?’’ అని అల్జారీ జోసెఫ్ సామీ వ్యాఖ్యల్ని ఖండించాడు. ఫిట్‌నెస్ సమస్యల కారణంగానే తాను పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్‌కు దూరంగా ఉన్నట్లు స్పష్టం చేశాడు.


