శ్రీలంకతో టీమిండియా టెస్టు సిరీస్ నేపథ్యంలో సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు. లంకతో టెస్టులకు రిషభ్ పంత్‌ను ఎంపిక చేయడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నాడు. కాగా ఆగష్టు 15 నుంచి 27 వరకు భారత జట్టు శ్రీలంకలో పర్యటించనుంది.
ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య రెండు టెస్టు మ్యాచ్‌లు జరుగుతాయి. ఇందుకు గాలె, కొలంబో వేదికలు. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మంగళవారం తమ జట్టును ప్రకటించింది. శుబ్‌మన్ గిల్ కెప్టెన్సీలోని ఈ జట్టులో తొలిసారి సారాంశ్ జైన్ చోటు దక్కించుకున్నాడు.
పంత్‌తో పాటు జురెల్..
ఇదిలా ఉంటే.. రవీంద్ర జడేజా, జస్‌ప్రీత్ బుమ్రా కూడా టెస్టుల్లో పునరాగమనం చేశారు. వికెట్ కీపర్ బ్యాటర్లు కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్ కూడా ఈ జట్టులో ఉన్నారు. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా బ్యాటింగ్ దిగ్గజం డివిలియర్స్ తన యూట్యూబ్ చానెల్‌లో మాట్లాడుతూ పంత్ ఎంపికను ప్రశ్నించాడు.
అతడిని ఎలా ఎంపిక చేశారు?
ఈ మేరకు.. ‘‘శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో పంత్ ఉండటం నన్ను ఆశ్చర్యపరిచింది. అతడి ఫిట్‌నెస్ ఎలా ఉందో తెలిసిందే. అంతేకాదు.. అతడికి జట్టు తరఫున రాణించాలన్న కోరిక కూడా ఉందో లేదో చెప్పలేము.
ఐపీఎల్‌లో అతడు ఆత్మవిశ్వాసంతో కనిపించలేదు. బాగా కుంగిపోయినట్లు అనిపించింది. అయితే, దేశం తరఫున ఆడినప్పుడు పంత్ అత్యుత్తమ ప్రదర్శన ఇస్తాడని నమ్ముతున్నా. శ్రీలంకలో అతడు దూకుడుగా, తనదైన శైలిలో రాణిస్తాడనే ఆశిస్తున్నా’’ అని డివిలియర్స్ పేర్కొన్నాడు.
జడ్డూ రీఎంట్రీ సంతోషం
అదే విధంగా.. ‘‘రవీంద్ర జడేజా జట్టులోకి తిరిగి రావడం సంతోషంగా ఉంది. ఇటీవలి కాలంలో అతడు జట్టులో ఎప్పుడు ఉంటాడో, ఎప్పుడు తీసేస్తారో తెలుసుకోవడం కాస్త కష్టంగానే ఉంది.
ఇక బుమ్రా పూర్తి ఫిట్‌గా మారితే జట్టుకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అతడు జట్టులో ఉన్నాడంటే ప్రత్యర్థులకు వణుకే. బుమ్రా ఒక క్లాస్ ప్లేయర్’’ అని డివిలియర్స్ కొనియాడాడు. కాగా టీమిండియా చివరగా స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో ఏకైక టెస్టు ఆడింది.
ఐపీఎల్‌లో పంత్ విఫలం
ఈ మ్యాచ్ నుంచి జడేజా, బుమ్రాలకు సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు. ఇక ఈ మ్యాచ్‌లో రిషభ్ పంత్ 104 బంతులు ఎదుర్కొని 81 పరుగులు సాధించాడు. ఇందులో పదమూడు ఫోర్లు ఉండటం విశేషం. అయితే, అంతకుముందు ఐపీఎల్-2026లో మాత్రం పంత్ పూర్తిగా నిరాశపరిచాడు.
లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్, బ్యాటర్‌గా పంత్ విఫలమయ్యాడు. కేవలం 312 పరుగులు చేసిన పంత్ సారథ్యంలో లక్నో ఈసారి పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంలో నిలిచింది. గతేడాది 269 పరుగులు చేసిన పంత్ జట్టును ఏడో స్థానంలో నిలిపాడు. ఈ పరిణామాల నేపథ్యలో 2027 సీజన్‌కు ముందే పంత్ లక్నోను వీడి ఢిల్లీ క్యాపిటల్స్‌లో చేరాడు.
శ్రీలంకతో టెస్టులకు భారత జట్టు
శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్, సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, దేవదత్ పడిక్కల్, సారాంశ్ జైన్.


