నీరజ్‌ బాటలో ఆశిష్‌.. వరల్డ్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌లో రజతం | World Athletics U20 Championships 2026: Ashish Yadav wins javelin silver, follows in Neeraj Chopra footsteps | Sakshi
Sakshi News home page

నీరజ్‌ బాటలో ఆశిష్‌.. వరల్డ్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌లో రజతం

Aug 8 2026 3:21 PM | Updated on Aug 8 2026 3:56 PM

World Athletics U20 Championships 2026: Ashish Yadav wins javelin silver, follows in Neeraj Chopra footsteps

source: X

భారత యువ జావెలిన్‌ త్రోయర్‌ ఆశిష్‌ యాదవ్‌ అంతర్జాతీయ వేదికపై సత్తా చాటాడు. అమెరికాలోని యూజీన్‌లో జరుగుతున్న వరల్డ్‌ అథ్లెటిక్స్‌ U20 ఛాంపియన్‌షిప్స్‌ 2026లో పురుషుల జావెలిన్‌ త్రోలో రజత పతకం సాధించాడు. 19 ఏళ్ల ఆశిష్‌ 74.09 మీటర్ల అత్యుత్తమ ప్రదర్శనతో రెండో స్థానంలో నిలిచాడు.

ఈ విజయంతో వరల్డ్‌ అథ్లెటిక్స్‌ U20 ఛాంపియన్‌షిప్స్‌ జావెలిన్‌ విభాగంలో పతకం సాధించిన రెండో భారత అథ్లెట్‌గా ఆశిష్‌ నిలిచాడు. 2016లో నీరజ్‌ చోప్రా స్వర్ణం సాధించిన పదేళ్ల తర్వాత భారత్‌కు ఈ విభాగంలో మరో పతకం దక్కంది.

దక్షిణాఫ్రికాకు చెందిన జాన్‌-హెండ్రిక్‌ హేమన్స్‌ 80.50 మీటర్లతో స్వర్ణ పతకం సాధించాడు. డొమినికాకు చెందిన అడిసన్‌ జేమ్స్‌ 73.89 మీటర్లతో కాంస్యం గెలుచుకున్నాడు.

ఆశిష్‌ ఫైనల్లో తొలి ప్రయత్నంలో 69.96 మీటర్లు విసిరాడు. రెండో ప్రయత్నం ఫౌల్‌ కాగా, మూడో ప్రయత్నంలో 74.09 మీటర్లతో తన అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశాడు. ఆ తర్వాత 72.31, 70.62, 67.98 మీటర్ల దూరాలను నమోదు చేశాడు.

ఆశిష్‌ ఈ ఏడాది పటియాలాలో జరిగిన ఇండియన్‌ ఓపెన్‌ త్రోస్‌ పోటీలో 74.49 మీటర్ల వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశాడు. యూజీన్‌ పోటీలకు ముందు అతని వ్యక్తిగత రికార్డు ఇదే.

నీరజ్‌ తర్వాత ఆశిష్‌..
2016లో బైడ్‌గోష్‌లో జరిగిన ప్రపంచ U20 ఛాంపియన్‌షిప్స్‌లో నీరజ్‌ చోప్రా 86.48 మీటర్ల ప్రపంచ U20 రికార్డుతో జావెలిన్‌ స్వర్ణం సాధించాడు. ఇప్పుడు ఆశిష్‌ యాదవ్‌ రజతంతో అదే వేదికపై పతకం సాధించిన రెండో భారత జావెలిన్‌ త్రోయర్‌గా చరిత్ర సృష్టించాడు.

ఈ పోటీల్లో భారత్‌ నుంచి మరో జావెలిన్‌ త్రోయర్‌ టి. ధరణీధరన్‌ కూడా ఫైనల్‌కు చేరాడు. 72.35 మీటర్ల అత్యుత్తమ త్రోతో ఆరో స్థానంలో నిలిచాడు.

క్వాలిఫికేషన్‌లో ఆశిష్‌ 69.87 మీటర్లు విసిరి 26 మంది అథ్లెట్లలో రెండో స్థానంలో నిలిచాడు. ధరణీధరన్‌ 68.07 మీటర్లతో 12వ స్థానంలో నిలిచి ఫైనల్‌ బెర్త్‌ దక్కించుకున్నాడు.

ప్రపంచ U20 ఛాంపియన్‌షిప్స్‌ 2026లో భారత్‌ 36 మంది అథ్లెట్ల బృందంతో బరిలోకి దిగింది. మొత్తం 147 దేశాలకు చెందిన 1,800 మందికి పైగా అథ్లెట్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement