‘మీ శకం ముగిసిందా?’.. నీరజ్‌ చోప్రా అదిరిపోయే రిప్లై! | Is-Neeraj Chopra Era comes-To-End-Cryptic-Response-From-Indian Star | Sakshi
Sakshi News home page

CWG 2026: ‘మీ శకం ముగిసిందా?’.. నీరజ్‌ చోప్రా అదిరిపోయే రిప్లై!

Aug 1 2026 3:08 PM | Updated on Aug 1 2026 3:31 PM

Is-Neeraj Chopra Era comes-To-End-Cryptic-Response-From-Indian Star

Photo Credit: SAI Twitter

భార‌త స్టార్ జావెలిన్ త్రోయ‌ర్ నీర‌జ్ చోప్రా గ్లాస్కో కామ‌న్‌వెల్త్ గేమ్స్ 2026లో ర‌జ‌తం సాధించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌తికూల వాతావ‌ర‌ణంలోనూ సీజ‌న్ బెస్ట్ న‌మోదు చేసిన నీర‌జ్ ఈటెను 85.83 మీట‌ర్ల దూరం విసిరి వెండి ప‌త‌కాన్ని ఒడిసిప‌ట్టాడు. ముందే ఊహించిన‌ట్లుగా ఈసారి నీర‌జ్‌కు పోటీ పాకిస్తాన్ ప్లేయ‌ర్ అర్షద్ న‌దీమ్ నుంచి కాకుండా శ్రీలంక అథ్లెట్ రుమేశ్ ప‌తిర‌గె నుంచే ఎదుర‌య్యింది. 

ఈ పోటీలో రుమేశ్ తరంగా పతిరగె 89.75 మీటర్ల దూరం విసిరి స్వర్ణ పతకాన్ని సాధించగా, భారత్‌కు చెందిన మరో జావెలిన్ త్రోయర్ యశ్‌వీర్ సింగ్ తన వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనతో 85.41 మీటర్లు విసిరి కాంస్య పతకాన్ని ఒడిసిపట్టాడు. రజతం సాధించిన అనంతరం తన ప్రదర్శనపై నీరజ్‌ చోప్రా స్పందించాడు. గాయం పూర్తిగా నయం కాకపోవడం వల్ల మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురయ్యానని నీరజ్ తెలిపాడు. ఇదే సమయంలో ‘నీరజ్‌ మీలో మునుపటి జోష్‌ కనిపించడం లేదు.. మీ శకం ముగిసినట్లేనా?’ అనే ప్రశ్న ఎదురైంది. 

దీనికి నీరజ్‌ స్పందిస్తూ.. ‘‘మనం 100 శాతం ఫిట్‌గా ఉన్నప్పుడు ఎంతటి కఠినమైన సవాలునైనా ఎంతో ధైర్యంతో ఎదుర్కొంటాం. కానీ శరీరంలో గాయం ఉన్నప్పుడు ఎక్కడ అది తిరగబెడుతుందోననే భయం ప్రతి త్రోకు ముందు వెంటాడుతుంది. ఈరోజు కూడా అదే జరిగింది. అందుకే చాలా వేగంగా పరిగెత్తకుండా నా శరీరాన్ని నియంత్రణలో ఉంచుకోవడానికి ప్రయత్నించాను. పోటీ జరిగిన ప్రాంతంలో వాతావరణం చాలా చల్లగా ఉంది.


Photo Credit: SAI Twitter

సాధారణంగా ఇలాంటి వాతావరణంలో తన అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడం కొంచెం కష్టమే. ఈ ఫైనల్ పోటీలో నాకు ఒక్క మంచి త్రో మాత్రమే వచ్చిందని, మిగిలిన ప్రయత్నాల్లో ఆశించిన స్థాయిలో జావెలిన్ వెళ్లలేదు. విజేతగా నిలిచిన రుమేశ్ తరంగా కూడా ఒక్క అద్భుతమైన త్రోతోనే స్వర్ణాన్ని సాధించాడన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ పునరాగమనం నాకు మంచి ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. రాబోయే పోటీల్లో ఈ లోపాలను సరిదిద్దుకుని మరింత మెరుగైన ప్రదర్శన ఇవ్వడమే నా ప్రధాన లక్ష్యం’’ అని స్పష్టం చేశాడు.

పదును తగ్గిందా?
ఇక నీరజ్ చోప్రా ప్రదర్శనలో పదును తగ్గుతుందా అంటే సమాధానం చెప్పలేని స్థితి. ఎందుకంటే వయసు మీద పడుతుండడంతో నీరజ్‌లో మునుపటి జోష్ కనిపించడం లేదు. 2018 కామన్‌వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం గెలిచిన నీరజ్ చోప్రా 2020 టోక్యో ఒలింపిక్స్‌లో 87.58 మీటర్లు విసిరి స్వర్ణం సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత నీరజ్ 90 మీటర్ల మార్క్‌ను దాటేందుకు విఫలయత్నం చేశాడు. 


Photo Credit: SAI Twitter

కానీ ఈ ఐదేళ్లలో నీరజ్ అంతర్జాతీయ ఈవెంట్లలో ఒక్కసారి కూడా 90 మీటర్ల మార్క్ అందుకోలేదు. చివరగా 2024 పారిస్ ఒలింపిక్స్‌లో ఫైనల్ ఈవెంట్‌లో ఈటెను 89.45 మీటర్ల దూరం విసిరి రజతం ఒడిసిపట్టాడు. అప్పుడు కూడా తృటిలో 90 మీటర్ల మార్క్‌ను చేజార్చుకున్నాడు. ఆ తర్వాత వెన్ను నొప్పి బారిన పడిన నీరజ్ కోలుకోలేకోపోయాడు. రీఎంట్రీ తర్వాత నీరజ్‌లో మునుపటి పదును తగ్గిందనే చెప్పొచ్చు.

2025 వరల్డ్ చాంపియన్‌షిప్‌లో ఈటెను 84.03 మీటర్ల దూరం విసిరిన నీరజ్ 8వ స్థానంలో నిలిచి నిరాశపరిచాడు. తాజాగా గ్లాస్కో కామన్‌వెల్త్ గేమ్స్‌లో రజతం గెలిచినప్పటికీ ఈటెను వేసిన దూరం లెక్కిస్తే ఇది నీరజ్ స్థాయికి సరిపోని ప్రదర్శనగా పరిగణించవచ్చు. ప్రస్తుతం నీరజ్ 28 ఏళ్ల వయసు ఉండడం, ఒలింపిక్స్‌కు మరో రెండేళ్ల సమయం ఉండడంతో తన ప్రదర్శనను మెరుగుపరుచుకోవాలని ఆశిద్దాం.

 

 

Read: మెడ విరిగినా వెనక్కి తగ్గలేదు.. ఒలింపిక్ గోల్డ్‌ను ముద్దాడాడు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement