పట్టుదలకు మారుపేరుగా సీమా
అవాంతరాలు దాటి విజయాల వైపు
ఆటకు తోడుగా పీహెచ్‌డీ
కళ్లద్దాలు, నుదుటిపై బొట్టు, చలి నుంచి తట్టుకునేందుకు చెవుల వరకు చిన్న సైజు టోపీ... డిస్కస్ త్రో ఈవెంట్ ప్రారంభానికి ముందు నిలబడిన అథ్లెట్ల వరుసలో ఆమెను చూస్తే మైదానంలో ఒక ప్లేయర్‌లాగా కాకుండా ఒక టీచర్ తరహాలో కనిపించింది. పొరపాటున అటువైపు వచ్చినట్లుగా అనిపించిన ఈ అథ్లెట్ మరికొద్ది సేపు తర్వాత పతకధారిగా పోడియంపై నిలిచింది. ఈ ప్రస్తావన అంతా భారత డిస్కస్ త్రోయర్ సీమా కాలిరామ్నా గురించి. !కామన్వెల్త్ క్రీడల డిస్కస్ త్రోలో పతకం గెలిచిన నాలుగో భారత ప్లేయర్‌గా 27 ఏళ్ల సీమా నిలిచింది. చదువులోనూ తగ్గని ఆమె వ్యాయామ విద్యలో పీహెచ్‌డీ చేస్తోంది. తల్లిగా మారిన తర్వాత పలు ప్రతికూలతలను అధిగమించి ఇప్పుడు మెడల్‌తో మెరిసింది.
హరియాణాలోని భివానీ పట్టణం సీమా స్వస్థలం. సైన్యంలో పని చేసిన తండ్రి వ్యక్తిగతంగా మంచి బాస్కెట్‌బాల్ ఆటగాడు, జావెలిన్ త్రోయర్ కూడా. ఆయన ప్రోత్సాహంతో అటు చదువు, ఇటు ఆటల్లో కూడా సీమా సమాంతరంగా మంచి ఫలితాలు రాబడుతూ ఎదిగింది. స్కూల్ స్థాయిలో ఆటలపై పెరిగిన ఆసక్తి ఆపై జిల్లా, రాష్ట్ర స్థాయిలో విజయాలు సాధిస్తూ పూర్తి స్థాయి అథ్లెట్‌గా మారడం వరకు చేరింది. మాజీ డిస్కస్ త్రోయర్ రవీందర్ కాలిరామ్నాతో వివాహం తర్వాత ఆమె కెరీర్ మరింత ఊపందుకుంది. రవీందర్ కోచ్‌గా మారి సీమాకు మార్గనిర్దేశనం చేశాడు. ఇప్పుడు సాధించిన కామన్వెల్త్ మెడల్ సీమా అంతర్జాతీయ కెరీర్‌లో మొదటి పతకం కావడం విశేషం.

2022లో బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత సీమా ప్రసవానంతరం సమస్యలు ఎదుర్కొంది. దాంతో పాటు ‘ఆర్థరైటిస్’ బారిన పడి తీవ్ర మోకాలి నొప్పితో బాధపడింది. దీని నుంచి కోలుకునేందుకు డాక్టర్లు స్టెరాయిడ్ ఇంజక్షన్‌లను సిఫారసు చేశారు. అయితే ఇందుకు దంపతులిద్దరూ అంగీకరించలేదు. సహజరీతిలో స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ ఎక్సర్‌సైజ్‌లు, డైట్‌లతో పాటు స్వల్ప ఆయుర్వేద చికిత్సతో ఆమె శారీరక పరిస్థితి మెరుగవుతూ వచ్చింది.
కొడుకు పుట్టిన రెండేళ్ల తర్వాత 2024 జాతీయ క్రీడల్లో సీమా పునరాగమనంలో స్వర్ణం గెలిచింది. ఆపై జాతీయ చాంపియన్‌షిప్‌లో అత్యుత్తమ ప్రదర్శన (59.73 మీటర్లు) ఆమె నమోదు చేసింది. ‘అథ్లెట్ల ప్రదర్శనలో ఊహాత్మక ప్రభావం–సానుకూల దృక్పథం’ అనే అంశంపై పీహెచ్‌డీ చేస్తోన్న సీమా పోటీల సమయంలో దానినే తనకు అన్వయించుకుంది. ఇదే స్ఫూర్తితో మరిన్ని విజయాలు సాధించాలని ఆమె పట్టుదలగా ఉంది.


