Photo Credit: Sri Lanka Sports
కామన్వెల్త్ గేమ్స్ 2026లో జావెలిన్ త్రోలో శ్రీలంక స్టార్ రుమేశ్ తరంగ పతిరగె స్వర్ణం గెలిచిన సంగతి తెలిసిందే. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన జావెలిన్ త్రో ఫైనల్లో రుమేశ్ తరంగా పతిరగె 89.75 మీటర్ల దూరం విసిరి స్వర్ణ పతకాన్ని సాధించగా, నీరజ్ చోప్రా ఈ సీజన్‌లో తన అత్యుత్తమ ప్రదర్శన (85.83 మీటర్లు) చేసినప్పటికీ రజత పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
భారత్‌కే చెందిన మరో జావెలిన్ త్రోయర్ యశ్‌వీర్ సింగ్ తన వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనతో 85.41 మీటర్లు విసిరి కాంస్య పతకాన్ని ఒడిసిపట్టాడు. కామన్‌వెల్త్‌లో రుమేశ్ స్వర్ణం సాధించడం వెనుక పెద్దగా ఆశ్చర్యమేమి లేదు. ఎందుకంటే ఈ ఏడాది రోమ్ డైమండ్ లీగ్‌లో 90 మీటర్ల మార్కును దాటిన తొలి అథ్లెట్‌గా నిలిచిన పతిరగే, 92.62 మీటర్లతో ప్రపంచంలోనే అత్యుత్తమ త్రో రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
క్రికెటర్ నుంచి జావెలిన్ ఛాంపియన్‌గా..
రుమేశ్ పతిరగే ప్రస్థానం ఎంతో ఆసక్తికరమైనది. జావెలిన్ క్రీడలోకి రాకముందు అతను ఒక క్రికెటర్. అండర్-18 కేటగిరీలో శ్రీలంక పేసర్ ఇషాన్ మలింగ తర్వాత గంటకు 134 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసిన రెండో ఫాస్టెస్ట్ బౌలర్‌గా అతనికి పేరుంది. అయితే, కోచ్ టోనీ ప్రసన్న ప్రోత్సాహంతో జావెలిన్ వైపు మళ్లినట్లు పతిరగే 'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. "నాకు జావెలిన్‌ను పరిచయం చేసింది కోచ్ టోనీనే. ఆయన నాకు క్రీడ గురించే కాదు, జీవితం గురించి కూడా నేర్పించారు" అని పేర్కొన్నాడు.
చదవండి: బాక్సింగ్‌లో డబుల్ స్వర్ణాలు.. ట్రిపుల్ జంప్‌లో రెండు పతకాలు


