కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత పారా అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల షాట్‌పుట్ F57 ఫైనల్లో సోమన్ రాణా స్వర్ణ పతకం సాధించగా, శుభమ్ జుయాల్ రజత పతకం దక్కించుకున్నాడు.
సోమన్ రాణా 13.40 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానంలో నిలువగా.. శుభమ్ జుయాల్ 13.28 మీటర్ల త్రోతో రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఈ పతకాలతో భారత్ మొత్తం పతకాల సంఖ్య 30కి (8 గోల్డ్, 15 సిల్వర్, 7 బ్రాంజ్) చేరింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో భారత్ ఆరో స్థానంలో కొనసాగుతోంది.
కాగా, ఇవాళ ఒక్క రోజే భారత్ ఖాతాలో 3 స్వర్ణాలు (మహిళల బాక్సింగ్ 54 కేజీల విభాగంలో ప్రీతి పవార్, మహిళల బాక్సింగ్ 57 కేజీల విభాగంలో జాస్మిన్ లంబోరియా, పారా పురుషుల షాట్‌పుట్ F57 విభాగంలో సోమన్ రాణా) చేరాయి.
ట్రిపుల్ జంప్‌లోనూ రెండు పతకాలు
ఇవాళే జరిగిన పురుషుల ట్రిపుల్ జంప్ విభాగంలోనూ భారత అథ్లెట్లు మెరిశారు. ప్రవీణ్ చిత్రవేల్ (16.58 మీటర్ల ఎత్తు) ఎగిరి రజతం ఒడిసిపట్టగా, భారత్‌కే చెందిన మరో అథ్లెట్ సెల్వ ప్రభు (16.52 మీటర్ల ఎత్తు) ఎగిరి కాంస్య పతకం సాధించాడు.
రజతంతో సరిపెట్టుకున్న జడుమణి
పురుషుల 55 కేజీల విభాగంలో భారత బాక్సర్ జడుమణి సింగ్ రజతంతో సరిపెట్టుకున్నాడు. ఫైనల్లో జడుమణి ఆస్ట్రేలియాకు చెందిన జై డిక్సన్ చేతిలో ఓటమి పాలయ్యాడు.


