మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా మాజీ హాకీ ప్లేయర్ మైకేల్ నాబ్స్ కన్నుమూశారు. ఆయన గతంలో భారత పురుషుల హాకీ జట్టుకు కోచ్‌గా పనిచేశారు. నాబ్స్ శిక్షణలోనే భారత జట్టు లండన్‌లో జరిగిన 2012 ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించింది.
కాగా 72 ఏళ్ల నాబ్స్ కొంతకాలంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన భార్య లీ కేప్స్ కూడా మాజీ హాకీ ప్లేయర్. ఆస్ట్రేలియా మహిళల జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. కుమార్తె కైట్లిన్ కూడా హాకీరూస్ స్టార్‌గా ఎదిగింది.
ఇక ఆటగాడిగా నాబ్స్ భారత్ ఆతిథ్యమిచ్చిన 1981 హాకీ ప్రపంచకప్, 1984లో జరిగిన లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో పోటీపడ్డారు. తదనంతరం కోచ్‌గా మారారు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌కు భారత్ అర్హత సాధించడంలో విఫలమైంది. దీంతో 2011లో భారత కోచ్‌గా నాబ్స్ నియమితులయ్యారు.
లండన్ మెగా ఈవెంట్‌కు అర్హత సాధించినప్పటికీ ఆ విశ్వక్రీడల్లో భారత్ అట్టడుగున నిలవడంతో ఆయనపై వేటు పడింది. నాబ్స్ భారత్‌తో పాటు జపాన్ జట్టుకు కోచ్‌గా పనిచేశారు. కాగా నాబ్స్ మృతి పట్ల హాకీ ఆస్ట్రేలియా సంతాపం వ్యక్తం చేసింది. అత్యంత ప్రభావంతమైన ఒలింపియన్‌ను కోల్పోయామంటూ నివాళులు అర్పించింది.


