టీ20 ప్రపంచకప్-2026 సన్నాహాల్లో భాగంగా వెస్టిండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో సౌతాఫ్రికా దుమ్మలేపుతోంది. గురువారం సెంచూరియన్ వేదికగా జరిగిన రెండో టీ20లో విండీస్‌ను 7 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా చిత్తు చేసింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే ప్రోటీస్ సొంతం చేసుకుంది.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన కరేబియన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీ స్కోర్ సాధించింది. విండీస్ బ్యాటర్లలో షిమ్రాన్ హెట్‌మైర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 42 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 75 పరుగులు చేశాడు. అతడితో పాటు రూథర్‌ఫోర్డ్(24 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 57) విధ్వంసం సృష్టించాడు. సఫారీ బౌలర్లలో కేశవ్ మహారాజ్ రెండు, రబాడ, జాన్సెన్ తలా వికెట్ సాధించారు.
దంచి కొట్టిన డికాక్..
అనంతరం తన కెరీర్‌లో వందో టీ20 ఆడిన క్వింటన్ డికాక్ విధ్వంసకర సెంచరీతో మెరిశాడు. భారీ లక్ష్య చేధనలో డికాక్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ సూపర్‌స్పోర్ట్ పార్క్ మైదానంలో బౌండరీల వర్షం కురిపించాడు. డికాక్ 49 బంతుల్లో 6 ఫోర్లు, 10 సిక్సర్లతో 115 పరుగులు చేశాడు.
అతడితో పాటు ర్యాన్ రికెల్టన్ కూడా అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ర్యాన్ రికెల్టన్ 36 బంతుల్లో 77 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కు 162 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో 222 పరుగుల భారీ లక్ష్యాన్ని ప్రోటీస్ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 17.3 ఓవర్లలో ఊదిపడేసింది. ఇరు జట్ల మధ్య నామమాత్రపు మూడో టీ20 శనివారం జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరగనుంది.
చదవండి: T20 WC: వరల్డ్‌కప్‌లో ఈసారి సెంచరీ చేసేది అతడే: రైనా


