T20 WC: వరల్డ్‌కప్‌లో ఈసారి సెంచరీ చేసేది అతడే: రైనా | Sanju Samson Has Ability To Score 100 in T20 WC 2026: Suresh Raina | Sakshi
Sakshi News home page

T20 WC: వరల్డ్‌కప్‌లో ఈసారి సెంచరీ చేసేది అతడే: రైనా

Jan 30 2026 12:12 PM | Updated on Jan 30 2026 12:48 PM

Sanju Samson Has Ability To Score 100 in T20 WC 2026: Suresh Raina

టీ20 ప్రపంచకప్‌ టోర్నమెంట్లో శతకం సాధించిన భారత ఏకైక క్రికెటర్‌గా సురేశ్‌ రైనా కొనసాగుతున్నాడు. సుమారుగా పదహారేళ్ల క్రితం 2010 నాటి వరల్డ్‌కప్‌ టోర్నీలో సౌతాఫ్రికా మీద రైనా శతక్కొట్టాడు. వెస్టిండీస్‌ వేదికగా లీగ్‌ దశలో సఫారీలతో మ్యాచ్‌లో 59 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్నాడు. మొత్తంగా 60 బంతుల్లో 101 పరుగులు చేసి నిష్క్రమించాడు.

రైనా ఆడిన నాటి శతక ఇన్నింగ్స్‌లో తొమ్మిది ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియా 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే, ఆ తర్వాత భారత్‌ తరఫున ఇంత వరకు ఒక్క ఆటగాడు కూడా టీ20 ప్రపంచకప్‌లో సెంచరీ చేయలేదు. తాజా ఎడిషన్‌ సందర్భంగా తన రికార్డును సమం చేయగల సత్తా ఉన్న ఆటగాడి పేరును సురేశ్‌ రైనా (Suresh Raina) తాజాగా వెల్లడించాడు.

వరల్డ్‌కప్‌లో ఈసారి సెంచరీ చేసేది అతడే
టీమిండియా టీ20 ఓపెనర్‌ సంజూ శాంసన్‌ (Sanju Samson)ఈసారి వరల్డ్‌కప్‌ టోర్నీలో సెంచరీ చేస్తాడని రైనా అంచనా వేశాడు. ‘‘సంజూ ఓపెనింగ్‌ బ్యాటర్‌. సెంచరీ చేయగల సత్తా అతడికి ఉంది. ఇప్పటికే అంతర్జాతీయ టీ20లలో అతడి పేరిట రెండు శతకాలు ఉన్నాయి.

సౌతాఫ్రికా మీద రెండుసార్లు సంజూ శతక్కొట్టాడు. ఇక సంజూతో పాటు ఈసారి అభిషేక్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌ కూడా ఈ జాబితాలో చేరే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే నా ఓటు సంజూ శాంసన్‌కే’’ అని రైనా వెల్లడించాడు. కాగా సంజూ గత కొన్నాళ్లుగా ఫామ్‌లేమితో సతమతమవుతున్న విషయం తెలిసిందే.  

స్వదేశంలో న్యూజిలాండ్‌తో తాజా టీ20 సిరీస్‌లో అతడు చేసిన స్కోర్లు 10. 6. 0, 24. ఇలాంటి తరుణంలో రైనా సంజూకు మద్దతుగా నిలవడం విశేషం.

సంజూ క్లాస్‌ బ్యాటర్‌
“ఫామ్‌ తాత్కాలికం. సంజూ క్లాస్‌ బ్యాటర్‌. టీమిండియా తరఫున, ఓవరాల్‌గా టీ20 క్రికెట్‌లో అతడు భారీ ఎత్తున పరుగులు సాధించాడు. కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ కూడా చాలాకాలంగా ఫామ్‌లేమితో ఇబ్బందిపడ్డాడు.

అయినప్పటికీ హెడ్‌కోచ్‌ అతడికి అండగా ఉన్నాడు. సంజూ విషయంలోనూ ఇదే జరగాలి. అతడికి ఒక్క ఛాన్స్‌ దొరికితే తిరిగి విజృంభించడం ఖాయం’’ అని రైనా ఈ కేరళ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌కు అండగా నిలిచాడు.

చదవండి: ICC vs BCB: బంగ్లాదేశ్‌కు షాక్‌.. తొలిసారి స్పందించిన శ్రీలంక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement