టీమిండియా హెడ్‌కోచ్‌గా ధోని రావాలి: గంభీర్‌ | I wish one day he could be in my position: Gambhir Comments On Dhoni | Sakshi
Sakshi News home page

టీమిండియా హెడ్‌కోచ్‌గా ధోని రావాలి: గంభీర్‌

Mar 16 2026 5:13 PM | Updated on Mar 16 2026 5:25 PM

I wish one day he could be in my position: Gambhir Comments On Dhoni

టీమిండియా హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ నవ్వడం అరుదు. ఎల్లప్పుడూ గంభీరంగానే కనిపించే ఈ ఢిల్లీ స్టార్‌ ముఖంపై అప్పుడప్పుడు మాత్రమే చిరునవ్వులు చూడగలం. ఇటీవల భారత్‌ టీ20 ప్రపంచకప్‌-2026 గెలిచిన సందర్భంగా గౌతీ నవ్వులు చిందించడం అభిమానులకు కనువిందు చేసింది.

ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజ కెప్టెన్‌, భారత్‌కు మూడు ఐసీసీ టైటిళ్లు అందించిన వీరుడు మహేంద్ర సింగ్‌ ధోని సైతం గౌతీ నవ్వు గురించి కామెంట్‌ చేశాడు. టీమిండియాకు శుభాకాంక్షలు చెబుతూ ఒకప్పటి సహచర ఆటగాడు గంభీర్‌ను ఉద్దేశించి ధోని పెట్టిన పోస్ట్‌ వైరల్‌ అయింది.

గంభీరమైన ముఖంలో ఆ నవ్వు..
‘‘కోచ్‌ సాహెబ్‌.. మీ ముఖంపై చిరునవ్వు ఎంతో గొప్పగా ఉంటుంది. గంభీరమైన ముఖంలో ఆ నవ్వు.. అబ్బా అదొక కిల్లర్‌ కాంబో. మీరు అద్భుతం చేశారు’’ అంటూ ధోని క్యాప్షన్‌ జతచేశాడు. ఇందుకు బదులిస్తూ.. ‘‘నవ్వులు చిందించేందుకు ఇంతకంటే గొప్ప కారణం ఉంటుందా!.. నిన్ను చూడటం సంతోషంగా ఉంది’’ అని గంభీర్‌ పేర్కొన్నాడు.

కాగా ధోని ఈసారి టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌కు హాజరైన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్‌ వేదికగా న్యూజిలాండ్‌ను ఓడించి భారత్‌ మరోసారి పొట్టి క్రికెట్‌ వరల్డ్‌కప్‌ను ముద్దాడిన దృశ్యాలను ధోని ప్రత్యక్షంగా వీక్షించాడు. ఈ నేపథ్యంలో గంభీర్‌ ధోనిని కలుసుకోవడం సంతోషమంటూ కామెంట్‌ చేశాడు.

అతడు నా స్థానంలో ఉండాలి
ఇక తాజాగా రెవ్‌స్పోర్ట్స్‌తో మాట్లాడిన గంభీర్‌కు ధోని ‘స్మైల్‌ కామెంట్’‌ గురించి ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘ప్రపంచకప్‌ ఫైనల్‌ చూసేందుకు ధోని అక్కడికి రావడం సంతోషంగా అనిపించింది. తను నన్ను నవ్వమని అడగటం కూడా నచ్చింది.

ఏదో ఒకరోజు అతడు నా స్థానంలో ఉండాలని కోరుకుంటున్నా. అప్పుడు నేను కూడా ధోని గురించి అదే కోట్‌ రాస్తాను. అతడు కూడా డగౌట్‌లో కూర్చుని నవ్వుతుంటే చూడాలని ఉంది’’ అని గంభీర్‌ పేర్కొన్నాడు. తనలాగే ధోని టీమిండియా హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టి.. కోచ్‌ హోదాలో ఐసీసీ ట్రోఫీ గెలవాలని ఆకాంక్షించాడు.

ధోని సారథ్యంలో గౌతీ
కాగా 2007లో ఐసీసీ తొలిసారి ప్రవేశపెట్టిన టీ20 ప్రపంచకప్‌ ట్రోఫీని ధోని సారథ్యంలోని టీమిండియా గెలిచింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను చిత్తు చేసి టైటిల్‌ కైవసం చేసుకుంది. ఇక 2011లో ధోని కెప్టెన్సీలోనే సొంతగడ్డపై శ్రీలంకను ఓడించి వన్డే వరల్డ్‌కప్‌ ట్రోఫీని భారత్‌ గెలుచుకుంది.

ఈ రెండు సందర్భాల్లోనూ గౌతం గంభీర్‌ భారత జట్టులో సభ్యుడు. ఇక ధోని 2013లో కెప్టెన్‌ హోదాలో ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ కూడా గెలిచాడు. మరోవైపు.. 2024లో టీమిండియా హెడ్‌కోచ్‌గా వచ్చిన గౌతం గంభీర్‌ మార్గదర్శనంలో ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025, తాజాగా టీ20 ప్రపంచకప్‌-2026 టైటిల్‌ను భారత్‌ గెలుచుకుంది.

ఇక తాజా విజయంతో టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. ఓవరాల్‌గా మూడోసారి, వరుసగా రెండోసారి, సొంతగడ్డపై తొలిసారి టీ20 ప్రపంచకప్‌ గెలిచిన తొలి జట్టుగా భారత్‌ ప్రపంచ రికార్డు సాధించింది. 

చదవండి: T20 WC: ఆ ఒక్క ఎంపిక విషయంలోనే మా మధ్య విభేదాలు: సూర్య

Advertisement
 
Advertisement
Advertisement