కేరళలో ‘నిపా’: తమిళనాడు సరిహద్దుల్లో హైఅలర్ట్‌ | Tamil Nadu Heightens Border Surveillance After Suspected Nipah Virus Case In Kerala, More Details Inside | Sakshi
Sakshi News home page

కేరళలో ‘నిపా’: తమిళనాడు సరిహద్దుల్లో హైఅలర్ట్‌

Jun 15 2026 9:40 AM | Updated on Jun 15 2026 10:55 AM

Nipah Scare Tamil Nadu Seals Borders, High Alert in Nilgiris

చెన్నై: పొరుగు రాష్ట్రమైన కేరళలోని కోజికోడ్‌లో నిపా వైరస్ అనుమానిత కేసు నమోదు కావడంతో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ రాష్ట్రంలోకి వ్యాపించకుండా నిరోధించేందుకు కేరళ-తమిళనాడు సరిహద్దుల్లోని నీలగిరి జిల్లా యంత్రాంగం నిఘా చర్యలను చేపట్టింది. ఇరు రాష్ట్రాల మధ్య నిరంతరాయంగా జరిగే రాకపోకల దృష్ట్యా, ముందస్తు జాగ్రత్తగా సరిహద్దులను అప్రమత్తం చేసినట్లు అధికారులు తెలిపారు.

సరిహద్దుల్లో ముమ్మర తనిఖీలు
నీలగిరి జిల్లా కలెక్టర్ లక్ష్మి భవ్య తన్నేరు ఆదేశాల మేరకు ఆరోగ్య శాఖ సిబ్బంది రంగంలోకి దిగారు. తాళూర్, నాడుగని, నంబియార్‌కున్ను, సోలాడి, పట్టవాయల్ వంటి కీలక సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద ప్రత్యేక వైద్య బృందాలను మోహరించారు. కేరళ నుంచి వచ్చే ప్రయాణికులు, పర్యాటకులలో నిపా వైరస్ లక్షణాలు ఉన్నాయా లేదా అని నిశితంగా స్క్రీనింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా వ్యాపార, ఉపాధి నిమిత్తం ప్రతిరోజూ కేరళకు వెళ్లి వచ్చే సరిహద్దు గ్రామాల ప్రజలు, వలస కార్మికులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టారు.

ఆస్పత్రులకు అత్యవసర ఆదేశాలు
పరిస్థితిని అదుపులో ఉంచేందుకు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు,  ప్రైవేట్ ఆసుపత్రులను యంత్రాంగం అప్రమత్తం చేసింది. నిపా వైరస్ లక్షణాలతో కూడిన ఏ ఒక్క అనుమానిత కేసు వచ్చినా, వెంటనే ఆరోగ్య శాఖకు సమాచారం అందించాలని వైద్య సంస్థలకు ఆదేశాలు జారీ అయ్యాయి. కేరళ నుండి వచ్చే వారికి జ్వరం లేదా శ్వాసకోశ సమస్యలు ఉంటే స్వచ్ఛందంగా వైద్య సహాయం తీసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

ఆందోళన చెందవద్దు
తమిళనాడులో ఇప్పటివరకు ఎలాంటి నిపా వైరస్ ముప్పు నిర్ధారణ కాలేదని, ఈ చర్యలన్నీ కేవలం ముందస్తు జాగ్రత్తలు మాత్రమేనని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రజలు ఎలాంటి  భయాందోళనలకు గురికావద్దని ఆమె కోరారు. కేరళలో మారుతున్న పరిస్థితులను తాము నిరంతరం సమీక్షిస్తున్నామని, జిల్లా యంత్రాంగం ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధతతో ఉందని తెలిపారు.

ఇది కూడా చదవండి: నోయిడా ఎయిర్‌పోర్ట్‌: భూములిచ్చిన దాతలకు తొలి విమాన యోగం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement