సహజత్వానికి మారుపేరు నటి సాయి పల్లవి . డాక్టర్ అయ్యి యాక్టర్ అయిన ఈ తమిళ నటి ఆదిలో నటనపై ఆసక్తితో తమిళంలో చిన్న చిన్న పాత్రలు పోషించినా, మలయాళంలో ప్రేమమ్ చిత్రంతో అనూహ్యంగా దూసుకొచ్చారు. ఆ తరువాత తమిళం, తెలుగు భాషల్లో అవకాశాలు ఈ భామను వెతుక్కుంటూ వచ్చాయి. అలా తెలుగులో నటించిన చిత్రాలు వరుసగా విజయాలను సాధించడంతో అక్కడ స్టార్డమ్ వచ్చింది. ఆ తరువాత కోలీవుడ్‌లో కాస్త ఆలస్యంగా అవకాశాలు వచ్చినా, గార్గి చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తరువాత నటించిన కొన్ని చిత్రాలు నిరాశ పరిచినా అమరన్ చిత్రం ఘన విజయాన్ని అందించింది. మళ్లీ తమిళంలో చిన్న బ్రేక్ వచ్చింది.
అందుకు కారణం తెలుగులో బిజీగా నటించడం, అదే సమయంలో బాలీవుడ్లో అవకాశాలు రావడం కారణం కావచ్చు. హిందీలో సాయి పల్లవి నటించిన ఏక్ దిన్ చిత్రం పూర్తిగా నిరాశ పరిచింది. అయితే ప్రస్తుతం నటిస్తున్న రామాయణ చిత్రంలో సీతగా ఆమె నటనపై ఆసక్తి నెలకొంది. కారణం ఆ పాత్రలో ఇంతకు ముందు పలువురు ప్రముఖ నటీమణులు నటించడమే. కాగా ఇటీవల విడుదలైన రామాయణ చిత్ర టీజర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది.
ఇకపోతే ఇప్పుడు తమిళంలో మరో రెండు క్రేజీ చిత్రాల్లో సాయి పల్లవి కథానాయకిగా నటిస్తున్నారు. అందులో ఒకటి ధనుష్ కు జంటగా నటిస్తున్న ఓం చిత్రం కాగా, రెండోది మణిరత్నం దర్శకత్వంలో విజయ్ సేతుపతి సరసన నటిస్తున్న రొమాంటిక్ లవ్ స్టొరీ చిత్రం. ఈ రెండు చిత్రాలు సాయి పల్లవి స్థాయిని మరింత పెంచేవిగా ఉంటాయని అంటున్నారు కోలీవుడ్ వర్గాలు. గ్లామర్‌కు దూరంగా తన సహజమైన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్న సాయి పల్లవి తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు.


