బిల్లును అడ్డుకోవాలి
పార్టీలకు రాహుల్ గాంధీ పిలుపు
సాక్షి, చెన్నై: మోదీ ప్రభుత్వం తలపెట్టిన నియోజకవర్గాల పునర్విభజనను అడ్డుకోవాలని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పారు. పార్లమెంట్‌లో డీలిమిటేషన్ బిల్లును ఆమోదింపజేయాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాన్ని ప్రతి జాతీయ పార్టీ, తమిళ పార్టీ వ్యతిరేకించాలని కోరారు. ఈ బిల్లుకు మద్దతు ఇస్తే ప్రజలకు ద్రోహం చేయడమే అవుతుందని తేల్చిచెప్పారు. రాహుల్ గాంధీ శనివారం తమిళనాడులోని మహాబలిపురంలో మీడియాతో మాట్లాడారు.
జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులతో మేధోమథన సమావేశంలో పాల్గొనేందుకు ఆయన ఇక్కడికి వచ్చారు. తమిళ ప్రజల ఓటు హక్కును హరించి, వారి నుంచి అధికారాన్ని లాగేసుకునేలా నియోజకవర్గాల పునర్విభజనను చేపట్టడానికి బీజేపీ ప్రయతి్నస్తోందని ఆరోపించారు. ఇలాంటి కుట్రలను కచ్చితంగా తిప్పికొట్టాలని స్పష్టంచేశారు. పార్లమెంట్‌లో డీమిలిటేషన్ బిల్లు ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమోదం పొందకుండా చూడాలన్నారు. ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజనకు మద్దతు ఇస్తే ప్రజలపై, వారి భవిష్యత్తుపై దాడి చేయడానికి బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్‌లకు అవకాశం ఇచ్చినట్లే అవుతుందని వ్యాఖ్యానించారు.
క్షమాభిక్ష కాదు.. క్షమాపణ కావాలి
తమిళనాడులో ‘నీట్’పరీక్ష వల్ల ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలను రాహుల్ గాంధీ పరామర్శించారు. కన్నబిడ్డల కోసం తల్లిదండ్రులు దుఃఖించడం చూడటం కంటే బాధాకరమైనది మరొకటి లేదని అన్నారు. అవినీతిమయమైన పరీక్షా విధానాన్ని అందించినందుకు విద్యార్థులకు ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు మోదీ క్షమాభిక్ష అవసరం లేదని, క్షమాపణ చెప్పడమే కావాలని పేర్కొన్నారు. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్టుచేశారు.


