breaking news
Tamil party
-
పునర్విభజనను సమర్థించేవాళ్లు ద్రోహులే
సాక్షి, చెన్నై: మోదీ ప్రభుత్వం తలపెట్టిన నియోజకవర్గాల పునర్విభజనను అడ్డుకోవాలని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పారు. పార్లమెంట్లో డీలిమిటేషన్ బిల్లును ఆమోదింపజేయాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాన్ని ప్రతి జాతీయ పార్టీ, తమిళ పార్టీ వ్యతిరేకించాలని కోరారు. ఈ బిల్లుకు మద్దతు ఇస్తే ప్రజలకు ద్రోహం చేయడమే అవుతుందని తేల్చిచెప్పారు. రాహుల్ గాంధీ శనివారం తమిళనాడులోని మహాబలిపురంలో మీడియాతో మాట్లాడారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులతో మేధోమథన సమావేశంలో పాల్గొనేందుకు ఆయన ఇక్కడికి వచ్చారు. తమిళ ప్రజల ఓటు హక్కును హరించి, వారి నుంచి అధికారాన్ని లాగేసుకునేలా నియోజకవర్గాల పునర్విభజనను చేపట్టడానికి బీజేపీ ప్రయతి్నస్తోందని ఆరోపించారు. ఇలాంటి కుట్రలను కచ్చితంగా తిప్పికొట్టాలని స్పష్టంచేశారు. పార్లమెంట్లో డీమిలిటేషన్ బిల్లు ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమోదం పొందకుండా చూడాలన్నారు. ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజనకు మద్దతు ఇస్తే ప్రజలపై, వారి భవిష్యత్తుపై దాడి చేయడానికి బీజేపీ–ఆర్ఎస్ఎస్లకు అవకాశం ఇచ్చినట్లే అవుతుందని వ్యాఖ్యానించారు. క్షమాభిక్ష కాదు.. క్షమాపణ కావాలి తమిళనాడులో ‘నీట్’పరీక్ష వల్ల ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలను రాహుల్ గాంధీ పరామర్శించారు. కన్నబిడ్డల కోసం తల్లిదండ్రులు దుఃఖించడం చూడటం కంటే బాధాకరమైనది మరొకటి లేదని అన్నారు. అవినీతిమయమైన పరీక్షా విధానాన్ని అందించినందుకు విద్యార్థులకు ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు మోదీ క్షమాభిక్ష అవసరం లేదని, క్షమాపణ చెప్పడమే కావాలని పేర్కొన్నారు. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్టుచేశారు. -
బహిష్కరించాల్సిందే
= కామన్వెల్త్ సమావేశాలపై తమిళపార్టీల కన్నెర్ర = తమిళనాడు అసెంబ్లీలో ఉద్వేగ భరిత చర్చ = పార్టీలకు అతీతంగా ఏకగ్రీవ తీర్మానం చెన్నై, సాక్షి ప్రతినిధి : శ్రీలంక పట్ల భారత ప్రభుత్వం అనుసరిస్తున్న ఉదాసీన వైఖరిపై తమిళనాడులోని అన్ని పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రెండో రోజైన గురువారం కామన్వెల్త్ సమావేశాలే ప్రధానాంశంగా చర్చకు వచ్చింది. పార్టీలన్నీ శ్రీలంక తమిళుల ప్రయోజనాల విషయంలో ఏకతాటిపై నిలిచి కామన్వెల్త్ను బహిష్కరించాల్సిందేనని పట్టుబట్టాయి. ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జయలలిత అసెంబ్లీలో మాట్లాడారు. ప్రత్యేక ఈలం కోసం పోరాటం చేస్తున్న తమిళ ప్రజలను అణిచివేయాలనే ఏకైక లక్ష్యంతో 2009లో శ్రీలంక ప్రభుత్వం మారణహోమాన్ని ృష్టించిందని ఆరోపించారు. జెనీవా ఒప్పందాన్ని, అందులోని నిబంధనలను తుంగలో తొక్కిన శ్రీలంక ఉన్మాదానికి వేలాదిమంది తమిళులు ప్రాణాలు కోల్పోయారని, లక్షలాది మంది చెట్టుకొకరు, పుట్టకొకరుగా నిరాశ్రయులుగా మిగిలారని ఆవేదన వ్యక్తంచేశారు. శ్రీలంక సైనికుల దాడుల్లో తీవ్రంగా గాయపడిన ఈలం తమిళులు చికిత్స పొందుతుండగా ఆస్పత్రులపై సైతం బాంబుల వర్షం కురిపించారని దుయ్యబట్టారు. ఇది పూర్తిగా మానవహక్కుల ఉల్లంఘన కిందికు వస్తుందన్నారు. శ్రీలంక యద్ధ ఉన్మాదాన్ని ఐక్యరాజ్య సమతిలోని సభ్యదేశాల్లో అధిక శాతం తీవ్రంగా ఖండిచాయన్నారు. శ్రీలంక దేశాధ్యక్షుడు రాజపక్సేను యుద్ధ ద్రోహిగా పరిగణించి ఐక్యరాజ్య సమితి ముందు దోషిగా నిలబెట్టాలని డిమాండ్ చేశారు. ఈలం తమిళులు శాంతియుతంగా జీవనం సాగించేలా చర్యలు తీసుకోవాలని, శ్రీలంక దేశంపై ఆర్థిక నిషేధం విధించాలని కోరారు. ఇవే డిమాండ్లపై భారత్ ఐక్యరాజ్య సమితిపై ఒత్తిడి తేవాలని కోరుతూ 2011లో తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రధాని మన్మోహన్సింగ్కు లేఖ రాశానని, అదేవిధంగా అసెంబ్లీ తీర్మానం ద్వారా విన్నవించామని పేర్కొన్నారు. ఈ అంశాన్ని ప్రధాన మంత్రి సాధారణంగా తీసుకోవడమే కాకుండా పరిశీలిస్తానని ముక్తసరిగా సమాధానం ఇవ్వడం బాధాకరమని తెలిపారు. తమిళనాడు ప్రజల మనోభావాలను ప్రధాని గౌరవించడం లేదని ఆరోపించారు. కొద్దిశాతం మాత్రమే తమిళ జనాభా కలిగిన కెనెడా దేశం సైతం కామన్వెల్త్ సమావేశాలపై ఒక నిర్ణయానికి వచ్చిందన్నారు. 8 కోట్ల తమిళ జనాభాను కలిగి ఉన్న భారత ప్రభుత్వం ఇప్పటి వరకు నోరు మెదపక పోవడం దురదృష్టకరమని దుయ్యబట్టారు. శ్రీలంకలో నవంబర్ 15వ తేదీన నిర్వహిస్తున్న కామన్వెల్త్ మహానాడును భారత్ బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రవేశపెడుతున్న తీర్మానానికి మానవతా ధృక్ఫథంతో మద్దతుపలకాలని జయ కోరారు. డీఎంకే తరపున స్టాలిన్, కాంగ్రెస్ తరపున గోపీనాథ్ రెడ్డి, డీఎండీకే తరపున బన్రూటి రామచంద్రన్, సీపీఐ తరపున ఆర్ముగం, ఇతర పార్టీలకు చెందిన సభ్యులంతా శ్రీలంక వైఖరిని, కేంద్ర ప్రభుత్వ తీరును దుయ్యబడుతూ ప్రసంగించారు. ముఖ్యమంత్రి జయలలిత ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని సభలోని సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. డీఎండీకే అధినేత కెప్టెన్ విజయకాంత్ ఉదయం 10.47 గంటలకు సచివాలయానికి వచ్చి అసెంబ్లీ రిజిస్టరులో సంతకం చేశారు. ఐదు నిమిషాలు మాత్రమే అక్కడ గడిపి వెళ్లిపోయారు.


