కొలీజియం తీర్మానాలపై జస్టిస్ ఉజ్జల్ భూయాన్
న్యూఢిల్లీ: న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి కొలీజియం ఎలాంటి కారణాలు చెప్పకపోవడం సరికాదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ విమర్శించారు. ఇలాంటి చర్యల వల్ల రాజ్యాంగ విరుద్ధంగా ప్రజా సమూహాన్ని చీమల్లా వరి్ణంచే న్యాయమూర్తులు వ్యవస్థలోకి వచ్చే ప్రమాదముందని ఆయన స్పష్టం చేశారు. ‘‘కొలీజియం ఇటీవల మూడు తీర్మానాల్లో జడ్జీల నియామకానికి ఏ రకమైన కారణాలూ చెప్పలేదు. ఇది పారదర్శకత సిద్ధాంతం నుంచి వెనకడుగు వేసినట్లే’’అని ఆయన వ్యాఖ్యానించారు. కొంతమంది ఈ తీర్మానాలు కాపీ పేస్ట్ చందంగా ఉన్నాయని వ్యాఖ్యానించినట్లు చెప్పారు.
విధి అనే సంస్థ చేపట్టిన జల్దీ కార్యక్రమం తాలూకూ నివేదిక విడుదల సందర్భంగా శనివారం ఏర్పాటైన ఒక కార్యక్రమంలో జస్టిస్ ఉజ్జల్ భూయాన్ మాట్లాడుతూ కొలీజియం తన నిర్ణయాలకు కారణాలు చెప్పకపోవడం వల్ల ప్రతిభావంతులైన జడ్జీలకు అన్యాయం జరుగుతుందని అన్నారు. అంతేకాకుండా.. కొంతమంది వ్యక్తులు న్యాయవ్యవస్థలోకి ప్రవేశించి ఆ తరువాత ప్రజలను చీమలని రాజ్యాంగ విరుద్ధంగా, విలువలకు వ్యతిరేకంగా మాట్లాడేందుకు అవకాశం ఏర్పడుతుందని వివరించారు.
2024లో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి వీహెచ్‌పీ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేయడంతో వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. ‘‘చిన్న చీమకు కూడా హాని చేయకూడదన్న విలువలు మనకు నేరి్పంచారు. అందుకే మనం సహానుభూతి, ఓర్పుతో ఉంటున్నాం. ఇతరులు బాధపడుతూంటే మనకూ నొప్పిగా అనిపిస్తూంటుంది. అయితే మీ సంస్కృతిలో పిల్లలు చిన్నప్పటి నుంచి జంతువులను నరకడం చూస్తూంటారు. అలాంటివాళ్లు ఓరిమితో, సహానుభూతితో ఉంటారని ఎలా ఆశించగలం’’అని ఆ హైకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
‘ద్వేషపూరిత ప్రసంగం’చేసినందుకు ఆ జడ్జిపై చర్యకు ప్రతిపక్షాలు పట్టుపట్టాయి కూడా. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ సూర్యకాంత్ కూడా కొంతమంది యువకులు ‘కాక్రోచ్’లుగా మారారని వ్యాఖ్యానించడం ఆది కాస్తా కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భావానికి, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ నిరసనలకు దారి తీసిన విషయం తెలిసిందే. అయితే కొలీజియంపై వస్తున్న విమర్శలపై సీజేఐ గతంలో చేసిన కొన్ని కీలక వ్యాఖ్యలను ఇక్కడ ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి కొలీజియం సిఫారసులు వేర్వేరు అంశాలపై ఆధారపడి ఉంటాయని, పనితీరు, న్యాయమూర్తులుగా కొనసాగిన కాలం, నిర్వహించిన హోదాల వంటివి పరిగణనలోకి తీసుకుంటామని సీజేఐ స్పష్టం చేశారు.


