delimitation of constituencies
-
దక్షిణాదిపై కక్షసాధింపే..
సాక్షి, న్యూఢిల్లీ: జనాభా నియంత్రణ పాటించి దేశ ఆర్థిక ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తున్న దక్షిణాది రాష్ట్రాలపై డీలిమిటేషన్ పేరుతో కేంద్రం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. గురువారం లోక్‌సభలో ఆయన మాట్లాడారు. ‘‘దేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చే కుట్రలో భాగంగానే బీజేపీ సర్కార్ ఈ బిల్లులను తీసుకొచ్చింది. దేశ జీడీపీలో 30 శాతం వాటాతో పాటు అత్యధికంగా పన్నులు చెల్లిస్తున్న దక్షిణాదికి ఎంపీ సీట్ల కోతతో శిక్ష విధించడం దారుణం. జనాభాను నియంత్రించిన రాష్ట్రాలకు తక్కువ సీట్లు, జనాభా పెంచిన ఉత్తరాదికి ఎక్కువ సీట్లు ఇవ్వడం ఇదెక్కడి న్యాయం?. అస్సాం, జమ్మూకశ్మీర్‌లలో ముస్లింల ప్రాతినిధ్యాన్ని తగ్గించినట్లే ఇప్పుడు దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ కుట్రను అమలు చేసి ముస్లిం ఎంపీలు లేకుండా చేయాలని చూస్తున్నారు. దక్షిణాదికి, మైనార్టీలకు అన్యాయం జరగకుండా జనాభాతో పాటే ఆర్థిక పనితీరుకు కూడా ప్రాధాన్యం ఇస్తూ కెనడా తరహా ‘హైబ్రిడ్ మోడల్’ను అమలు చేయాలి’’ అని ఆయన సూచించారు. -
డీలిమిటేషన్.. తెలంగాణలో 26... ఏపీలో 38
సాక్షి, న్యూఢిల్లీ: డీలిమిటేషన్ ప్రక్రియ అనంతరం తెలంగాణలో లోక్‌సభ స్థానాల సంఖ్య 17నుంచి 26కు, ఆంధ్రప్రదేశ్‌లో 25 నుంచి 38కి పెరగనున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. లోక్‌సభ నియోజకవర్గాల పునర్వీభజనతో దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగదని స్పష్టం చేశారు. గురువారం లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ల చట్ట రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు, డీలిమిటేషన్ బిల్లులపై జరిగిన చర్చలో అమిత్ షా ప్రసంగించారు. డీలిమిటేషన్ వల్ల లోక్‌సభలో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గుతుందన్న ఆందోళనను ఆయన తోసిపుచ్చారు. పునర్విభజన అనంతరం ఐదు దక్షిణాది రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాల సంఖ్య ప్రస్తుతమున్న 129 నుంచి 50 శాతం, అంటే 195కు పెరుగుతుందని వెల్లడించారు. ‘‘దక్షిణాది రాష్ట్రాల్లో లోక్‌సభ సీట్ల సంఖ్య తగ్గదు. పైపెచ్చు సభలో వాటి ప్రాతినిధ్యం మరింత పెరుగుతుంది’’అంటూ గణాంకాలతో సహా మంత్రి వివరించారు. ‘‘మొత్తం చర్చపై కేంద్ర ప్రభుత్వం తరఫున శుక్రవారం సమాధానమిస్తాను. అయితే ఒక్క విషయం మాత్రం చెప్పదలచాను. తాజాగా ప్రవేశపెట్టిన బిల్లులపై ప్రజలకు ఎలాంటి అపోహలూ వద్దు. ఈ బిల్లులతో లోక్‌సభలో దక్షిణాది ప్రాతినిధ్యం తగ్గుతుందని, ఆ ప్రాంతానికి నష్టం జరుగుతుందని పెద్ద వాదనను లేవనెత్తుతూ భ్రాంతిని వ్యాప్తి చేస్తున్నారు. దీనిపై స్పష్టత ఇవ్వదలచాను. సభ ముందున్న బిల్లుల ఆధారంగా వాస్తవాలు అందరి దృష్టికీ తెస్తాను. నియోజకవర్గాల పునర్వీభజనతో ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ స్థానాల సంఖ్య 25నుంచి 38కు, ఆ రాష్ట్ర ప్రాతినిధ్యం 4.60 నుంచి 4.65 శాతానికి పెరుగుతాయి. తెలంగాణలో స్థానాలు 17 నుంచి 26కు, ప్రాతినిధ్యం 3.13 నుంచి 3.18కి పెరుగుతాయి. తమిళనాడులో సీట్లు 39 నుంచి 59కు, ప్రాతినిధ్యం 7.18 నుంచి 7.23 శాతానికి పెరుగుతాయి. కర్నాటకలో లోక్‌సభ స్థానాలు 28నుంచి 42కు, సభలో ప్రాతినిధ్యం 5.15 శాతం నుంచి 5.14 శాతానికి చేరతాయి. కేరళలో సీట్లు 20 నుంచి 30కి, లోక్‌సభలో ఆ రాష్ట్ర ప్రాతినిధ్యం 3.68 నుంచి 3.67 శాతానికి చేరతాయి. మొత్తమ్మీద దక్షిణాది రాష్ట్రాల లోక్‌సభ స్థానాల సంఖ్య 195కు పెరుగుతుంది. లోక్‌సభలో వాటి ప్రాతినిధ్యం 23.76 శాతం నుంచి 23.97 శాతానికి పెరుగుతుందే తప్ప ఏ మాత్రమూ తగ్గదు. అలాంటప్పుడు దక్షిణాదికి అన్యాయమన్న ప్రశ్నే తలెత్తదు’’అని స్పష్టం చేశారు. జనగణనతో పాటే కులగణన ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న జనగణనతో పాటే కులగణన కూడా ఉంటుందని అమిత్ షా స్పష్టం చేశారు. ‘‘కులగణన చేపట్టాలని కేంద్రం భావించడం లేదని విపక్షాలు నిరాధార ఆరోపణలు చేస్తన్నాయి. మోదీ ప్రభుత్వం జనగణనతోపాటు కులగణన చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. జనగణన రెండు దశల్లో ఉంటుంది. ప్రస్తుతం ఇళ్ల గుర్తింపు ప్రక్రియ మొదలైంది. వ్యక్తిగత డేటాను తీసుకునేటప్పుడు కులగణన అంశం కూడా వస్తుంది’’అని ఆయన స్పష్టం చేశారు. 2029 తర్వాతే అమలు నియోజకవర్గాల పునర్విభజన ఇప్పట్లో అమలు కాబోదని సభకు అమిత్ షా తెలియజేశారు. ‘‘డీలిమిటేషన్ కమిషన్ నివేదికను పార్లమెంటు ఆమోదించి, రాష్ట్రపతి ముద్ర పడిన తర్వాతే అమల్లోకి వస్తుంది. ఇదంతా 2029కి ముందు జరిగే ప్రసక్తే లేదు. కనుక అప్పటిదాకా పలు రాష్ట్రాల్లో ఎన్నికలు పాత నియోజకవర్గాల ప్రాతిపదికనే జరుగుతాయి’’ అని చెప్పారు.లోక్‌సభ మొత్తం స్థానాల సంఖ్య 816! లోక్‌సభలో సీట్ల సంఖ్య పెంపుపై విపక్షాల ప్రశ్నలకు బదులిస్తూ అమిత్ షా ఒక ఉదాహరణ చెప్పారు. ‘‘మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలంటే ముందుగా మొత్తం సీట్లను 50 శాతం పెంచాలి. అప్పుడు వాటిలో 33 శాతం మహిళలకు కేటాయించినా మిగతా ఓపెన్ సీట్ల సంఖ్య యథాతథంగా ఉంటాయి. అంటే ప్రస్తుతమున్న 543 సీట్లను 50 శాతం పెంచితే వాటిలో 33 శాతాన్ని మహిళలకు రిజర్వ్ చేశాక కూడా ఓపెన్ కేటగిరీలో 543 సీట్లు అందుబాటులో ఉంటాయి. కాబట్టే 50 శాతం పెంపును ప్రతిపాదించాం’‘అని ఆయన వివరించారు. ‘‘లోక్‌సభ స్థానాల పెంపు గరిష్టంగా 850 దాకా అనేది సుమారుగా వేసిన సంఖ్య. కచ్చితమైన సంఖ్య బహుశా 815, లేదా 816గా ఉండవచ్చు. దీనిపై సభకు సమగ్రంగా వివరణ ఇస్తా’’అని చెప్పారు. -
‘పునర్వీభజన’కు వ్యతిరేకంగా ఓటేస్తాం
న్యూఢిల్లీ: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో రాజ్యాంగ సవరణ బిల్లులోని నియోజకవర్గాల పునర్వీభజన నిబంధనలకు వ్యతిరేకంగా ఓటు వేయాలని ప్రతిపక్షాలు నిర్ణయించాయి. మహిళా రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని వెల్లడించాయి. సంబంధిత బిల్లును తీసుకొస్తున్న విధానాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నామని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పారు. ఇది రాజకీయ ప్రేరేపిత బిల్లు అని ఆరోపించారు. విపక్ష ‘ఇండియా’కూటమి పార్టీల నేతలు బుధవారం ఢిల్లీలో ఖర్గే నివాసంలో సమావేశమయ్యారు. గురువారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహంపై చర్చించారు. భేటీ అనంతరం ఖర్గే మీడియాతో మాట్లాడారు. మహిళ రిజర్వేషన్ల బిల్లును తీసుకొస్తున్న విధానం పట్ల తమకు అభ్యంతరాలు ఉన్నాయని చెప్పారు. ప్రతిపక్షాలను అణచివేసి బిల్లును నెగ్గించుకోవాలన్నదే ప్రభుత్వ ప్రయత్నంగా కనిపిస్తోందన్నారు. మహిళా రిజర్వేషన్లకు తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. గతంలో ఆమోదించిన సవరణ బిల్లును అమలు చేయాలని కోరుతున్నామని, ప్రభుత్వం మాత్రం డీలిమిటేషన్ పేరిట డ్రామాలాడుతోందని ధ్వజమెత్తారు. పార్లమెంట్లో డీలిమిటేషన్ వ్యవహారాన్ని వ్యతిరేకించాలని ఉమ్మడిగా నిర్ణయించినట్లు స్పష్టంచేశారు. మహిళా రిజర్వేషన్లను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలని చూస్తే సహించబోమని హెచ్చరించారు. స్పష్టత లేని జనగణన, భవిష్యత్తు డీలిమిటేషన్‌తో మహిళా రిజర్వేషన్లను ముడిపెట్టొద్దని కోరారు. పార్లమెంట్ వద్ద ఉండాల్సిన అధికారాలను కార్యనిర్వాహక వర్గానికి కల్పిస్తూ, రాజకీయంగా అనుకూలమైనప్పుడల్లా నియోజకవర్గాలను మార్చేస్తే ఎలా అని ప్రశ్నించారు. అస్సాం, జమ్మూకశ్మీర్‌లో ఇలాంటి మోసం చూశామని ఖర్గే తెలిపారు. అందుకే నియోజకవర్గాల పునర్వీభజనను కచ్చితంగా వ్యతిరేకిస్తామని స్పష్టంచేశారు. అధికారం కోసమే ఈ కుతంత్రం: రాహుల్ మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ సంపూర్ణంగా మద్దతు ఇస్తోందని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పునరుద్ఘాటించారు. ఈ బిల్లును 2023లో పార్లమెంట్లో ఏకగ్రీవంగా ఆమోదించినట్లు చెప్పారు. మహిళా రిజర్వేషన్లు ఇప్పటికే రాజ్యాంగంలో భాగమేనని వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రతిపాదిస్తున్న దానికి మహిళా రిజర్వేషన్లతో ఎలాంటి సంబంధం లేదన్నారు. డీలిమిటేషన్‌తో అధికారం దక్కించుకోవాలన్న కుతంత్రం తప్ప ఇందులో ఇంకేముందని ప్రశ్నించారు. విపక్షాల భేటీలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. అనంతరం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. కుల గణన డేటాను విస్మరించి ఓబీసీ, దళిత, ఆదివాసీల హక్కులను చోరీ చేస్తే సహించబోమని హెచ్చరించారు. అలాగే దక్షిణ, ఈశాన్య, వాయువ్య, చిన్న రాష్ట్రాల పట్ల అన్యాయంగా వ్యవహరించడాన్ని అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. ప్రమాదకరం: కె.సి.వేణుగోపాల్మోదీ ప్రభుత్వం చేపట్టిన నియోజకవర్గాల పునర్విభజన చర్య ప్రమాదకరమైనదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ పేర్కొన్నారు. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థపై, ముఖ్యంగా రాష్ట్రాలకు సమాన అధికారాన్ని కల్పించే సమాఖ్య వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. విపక్ష నేతల సమావేశంలో డీఎంకే నాయకుడు టి.ఆర్.బాలు, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు సాగరికా ఘోష్, శివసేన(ఉద్ధవ్) నాయకులు సంజయ్ రౌత్, అరవింద్ సావంత్, ఎన్సీపీ సభ్యురాలు సుప్రియా సూలే, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, స్వతంత్ర ఎంపీ కపిల్ సిబల్ తదితరులు పాల్గొన్నారు. -
డీలిమిటేషన్ దంగల్
న్యూఢిల్లీ: బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ సర్కారుకు, కాంగ్రెస్ నేతృత్వంలో విపక్షాలకు నడుమ పార్లమెంటులో హోరాహోరీ పోరుకు రంగం సిద్ధమైంది. మహిళా రిజర్వేషన్ల చట్టం సత్వర అమలుకు వీలు కల్పించేందుకు ఉద్దేశించిన కీలక రాజ్యాంగ సవరణ బిల్లు ఇందుకు వేదిక కానుంది. లోక్‌సభ, అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే చట్టం ‘నారీ శక్తి వందన్ అధినియమ్’ను 2029 నుంచే అమల్లోకి తేవాలని మోదీ సర్కారు పట్టుదలగా ఉంది. అందుకోసమే గురువారం నుంచి మూడు రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయడం తెలిసిందే. ఆ మేరకు మహిళా రిజర్వేషన్ల చట్టానికి చట్టానికి అవసరమైన సవరణలు చేపట్టేలా రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు–2026ను కేంద్ర ప్రభుత్వం గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది. అనంతరం గురు, శుక్రవారాల్లో బిల్లుపై కీలక చర్చ జరగనుంది. ఇందుకు 18 గంటల సమయం కేటాయించారు. చర్చకు శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ సమాధానమిచ్చాక బిల్లుపై ఓటింగ్ జరుగుతుంది. ఆ తర్వాత రాజ్యాంగ సవరణ బిల్లును శనివారం రాజ్యసభలో ప్రవేశపెడతారు. 10 గంటల చర్చ అనంతరం అదే రోజు ఓటింగ్ జరగనుంది. లోక్‌సభతో పాటు దేశవ్యాప్తంగా అసెంబ్లీ స్థానాల సంఖ్యను పెంచనున్న నేపథ్యంలో నియోజకవర్గాల పునర్ వ్వవస్థీకరణకు వీలుగా డీలిమిటేషన్ బిల్లు–2026ను కూడా లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. ఆ రెండు బిల్లులనూ కేంద్ర న్యాయ మంత్రి అర్జున్‌రాం మేఘ్వాల్ ప్రవేశపెడతారు. వాటితో పాటు కేంద్రపాలిత ప్రాంతాల చట్టం (సవరణ) బిల్లు–2026 కూడా సభ ముందుకు రానుంది. దాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టనున్నారు. కేంద్రంపై గుర్రుగా విపక్షాలు మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణకు మోదీ సర్కారు చేస్తున్న ప్రయత్నాలపై విపక్షాలన్నీ గుర్రుగా ఉన్నాయి. తమతో మాటమాత్రం కూడా సంప్రదించకుండా, వివరాలేవీ వెల్లడించకుండా గుట్టుగా వ్యవహరించడం వెనక మతలబు ఏమిటంటూ ప్రశ్నిస్తున్నాయి. దీనికి తోడు డీలిమిటేషన్‌పైనా దక్షిణాది రాష్ట్రాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ ప్రక్రియలో ఉత్తరాది రాష్ట్రాల రాజకీయాధికారం అసమంజసంగా పెరిగిపోతుందని, తద్వారా తమకు తీరని నష్టం, అన్యాయం జరుగుతాయని అవి వాదిస్తున్నాయి. దీనిపైనా కేంద్రం వ్యవహార శైలిని విపక్షాలు గట్టిగా ప్రశ్నిస్తున్నాయి. అంతేగాక మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణకు డీలిమిటేషన్‌తో ఎందుకు ముడి పెట్టాల్సి వచ్చిందన్నది వాటి ప్రధాన అభ్యంతరం. మహిళా రిజర్వేషన్ల అమలు సాకుతో లోక్‌సభ స్థానాలను పెంపుకు ఆమోదం పొందేందుకు కేంద్రం ప్రయతి్నస్తోందని ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహిళా రిజర్వేషన్ల సవరణ బిల్లును వ్యతిరేకించాలని విపక్షాలు నిర్ణయించాయి. ఈ విషయంలోమోదీ సర్కారు వ్యవహార శైలిని తీవ్రంగా ఎండగట్టాలని కూడా భావిస్తున్నాయి. దాంతో సమావేశాలు వాడివేడిగా సాగడం ఖాయంగా కన్పిస్తోంది. దీనికి తోడు రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే పార్లమెంటు ఉభయ సభల్లోనూ మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం. ఇందుకు మోదీ సర్కారుకు విపక్షాల మద్దతు తప్పనిసరి కానుంది! ఈ నేపథ్యంలో విపక్షాలన్నీ బుధవారం ప్రత్యేకంగా సమావేశమై పార్లమెంటులో అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహంపై లోతుగా చర్చించాయి. అనంతరం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మీడియాతో మాట్లాడారు. విపక్షాలన్నీ డీలిమిటేషన్ ప్రతిపాదనలకు వ్యతిరేకంగా ఓటేస్తాయని ఆయన ప్రకటించారు! ‘‘మేం మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు. మోదీ సర్కారు రాజకీయ లబ్ధి కోసం బిల్లు తెచ్చిన తీరునే వ్యతిరేకిస్తున్నాం’’అన్నారు. సమావేశాలకు విధిగా హాజరు కావాలంటూ బీజేపీ, కాంగ్రెస్ తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి.గరిష్టంగా 850కి లోక్‌సభ స్థానాలు లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో 33 శాతం స్థానాలను మహిళలకు రిజర్వు చేసేలా 2023లోనే ‘నారీ శక్తి వందన్ అధినియమ్’పేరుతో మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని పార్లమెంటు ఆమోదించడం తెలిసిందే. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది 2034కు ముందు అమలయ్యే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని 2029 సాధారణ ఎన్నికలకు ముందే అమల్లోకి తేవాలని మోదీ సర్కారు నిర్ణయించింది. అందుకు వీలుగా లోక్‌సభ స్థానాల సంఖ్యను ప్రస్తుత 543 నుంచి గరిష్టంగా 850 దాకా> పెంచాలని బిల్లులో కేంద్రం ప్రతిపాదించింది. తుది సంఖ్యను త్వరలో ఏర్పాటయ్యే డీలిమిటేషన్ కమిషన్ నిర్ధారిస్తుంది. దాంతోపాటు అన్ని రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ స్థానాల సంఖ్యను 50 శాతం మేరకు పెంచనున్నారు. ఇందుకోసం ప్రస్తుతం అందుబాటులో ఉన్న తాజా జనాభా లెక్కలను, అంటే 2011 గణాంకాలను ప్రాతిపదికగా తీసుకోనున్నట్టు బిల్లు ముసాయిదాలో వెల్లడించింది. మహిళా రిజర్వేషన్ల అమలుకు వీలుగా 81వ ఆరి్టకల్‌కు సవరణలు ప్రతిపాదించింది.అవన్నీ వదంతులే ‘దక్షిణాదికి అన్యాయం’పై కేంద్రం లోక్‌సభ నియోజకవర్గాల పెంపులో దక్షిణాదికి అన్యా యం జరుగుతుందన్న ప్రచారంలో నిజం లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ‘‘వాస్తవానికి ఆ రాష్ట్రాలకే లబ్ధి చేకూరబోతోంది. సీట్ల పెంపులో దామాషా ప్రాతినిధ్య పద్ధతిని అనుసరిస్తుండటమే ఇందుకు కారణం’’అని తెలిపాయి. ఈ విషయమై పార్లమెంటులో ప్రధాని స్పష్టత ఇవ్వనున్నట్టు అవి వెల్లడించాయి. దీనిపై వదంతులు ప్రచారం చేయొద్దని సూచించాయి. సవరణ బిల్లు గట్టెక్కేనా? రాజ్యంగ సవరణ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందాలంటే ఉభయ సభల్లోనూ మూడింట రెండొంతుల మెజారిటీ తప్పనిసరి. లోక్‌సభలో మూడు ఖాళీలు పోను ప్రస్తుత సభ్యుల సంఖ్య 540. ఆ లెక్కన మూడింట రెండొంతుల మెజారిటీ 360. అధికార ఎన్డీఏ కూటమికి సభలో ఉన్నది 292 మంది సభ్యులే. ఇక రాజ్యసభలో మొత్తం సభ్యులు 245. ఒక స్థానం ఖాళీగా ఉంది. మూడింట రెండొంతుల మెజారిటీ 163 కాగా ఎన్డీఏ కూటమికి ఉన్నది 139 సభ్యుల బలమే. కనుక ఉభయ సభల్లోనూ సభ్యులంతా ఓటింగ్‌కు హాజరయ్యే పక్షంలో బిల్లు ఆమోదానికి అధికార పక్షానికి లోక్‌సభలో మరో 68 మంది, రాజ్యసభలో 24 మంది ఎంపీలు అవసరం. ఇందుకు విపక్షాల మద్దతు తప్పనిసరి. లోక్‌సభలో విపక్ష ఇండియా కూటమి బలం 233. మరో 15 మంది చిన్న పార్టీలకు చెందిన/స్వతంత్ర ఎంపీలున్నారు. రాజ్యసభలో ఇండియా కూటమికి 75 మంది, ఇతర విపక్షాలన్నింటికీ కలిపి 30 మంది ఎంపీలున్నారు. ఇండియా కూటమి పార్టీలన్నీ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేస్తాయని ఖర్గే ప్రకటించిన నేపథ్యంలో బిల్లు గట్టెక్కడంపై కేంద్రం ధీమా ఏమిటన్నది అంతుపట్టడం లేదు. -
లోక్‌సభ స్థానాలు 850కి పెంపు!
సాక్షి, న్యూఢిల్లీ: 2029 లోక్‌సభ ఎన్నికలకు ముందే మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని, అందుకోసం లోక్‌సభ స్థానాలను భారీగా పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దాంతో లోక్‌సభలో స్థానాల సంఖ్య ప్రస్తుతమున్న 543 నుంచి 850 దాకా పెరిగే అవకాశముంది! వీటిలో అన్ని రాష్ట్రాల్లో కలిపి 815కు, కేంద్రపాలిత ప్రాంతాల్లో గరిష్టంగా 35కు మించకుండా స్థానాలుంటాయి. మహిళలకు 33 శాతం లెక్కన వాటిలో గరిష్టంగా 280 నుంచి 281 స్థానాల దాకా రిజర్వు చేయనున్నారు. దీనికి వీలు కల్పించేందుకు ఉద్దేశించిన 3 బిల్లులను గురువారం నుంచి మూడు రోజుల పాటు జరగబోయే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో కేంద్రం ప్రవేశపెట్టనుంది.2029కి ముందే మహిళా రిజర్వేషన్ల చట్టం అమలు, అందుకోసం లోక్‌సభ స్థానాల పెంపుకు వీలు కల్పించేలా రాజ్యాంగ (131వ)సవరణ బిల్లు–2026, దేశవ్యాప్తంగా లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టేందుకు వీలుగా డీలిమిటేషన్ బిల్లు–2026, ఈ ప్రక్రియను ఢిల్లీ, జమ్మూ కశ్మీర్, పుదుచ్చేరి అసెంబ్లీలకు కూడా వర్తింపజేసేందుకు కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లు–2026 వీటిలో ఉంటాయి. ఈ మూడు బిల్లులకూ ఈ ప్రత్యేక సమావేశాల్లోనే పార్లమెంటు ఆమోదం పొందాలని ప్రభుత్వం భావిస్తోంది. వాటి ముసాయిదా ప్రతులను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంగళవారం ఎంపీలందరికీ పంపింది. లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన కోసం త్వరలో డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు కానుంది.లోక్‌సభ స్థానాల తుది సంఖ్యను పునర్విభజన కసరత్తు అనంతరం కమిషనే ఖరారు చేయనుంది. ఈ కారణంగానే పెరగనున్న లోక్‌సభ స్థానాల సంఖ్యను రాజ్యాంగ సవరణ బిల్లులో స్పష్టంగా పేర్కొనలేదు. ‘అన్ని రాష్ట్రాలకు కలిపి గరిష్టంగా 815కు మించకుండా, కేంద్రపాలిత ప్రాంతాల్లో 35కు మించకుండా లోక్‌సభ స్థానాలుండాలి’అని మాత్రమే తెలిపారు. లోక్‌సభతో పాటు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లో స్థానాల సంఖ్యను 50 శాతం పెంచాలని మోదీ సర్కారు నిర్ణయించడం తెలిసిందే.ఇందుకోసం 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుంటూ నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ ప్రక్రియ చేపట్టనున్నట్టు రాజ్యాంగ సవరణ బిల్లులో వెల్లడించారు. మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పెంపుకు వీలుగా రాజ్యాంగంలోని పలు అధికరణలకు సవరణలను కూడా ప్రతిపాదించారు. నారీశక్తి వందన్ అధినియమ్‌గా పేర్కొనే మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణలకు పార్లమెంటు ప్రత్యేక భేటీలో ఆమోదం పొందనున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే వెల్లడించడం తెలిసిందే. ఈ ప్రక్రియ ఆలస్యమైతే చట్టసభల్లో విధాన నిర్ణయ ప్రక్రియలో భాగస్వాములు కావాలని ఆశిస్తున్న మహిళలందరికీ తీవ్ర అన్యాయం జరుగుతుందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. 2029 నుంచే అమలయ్యేలా... మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని 2023లో పార్లమెంటు ఆమోదించడం తెలిసిందే. దీని ప్రకారం లోక్‌సభ, అసెంబ్లీల్లో 33 శాతం సీట్లను మహిళలకు ప్రత్యేకిస్తారు. అయితే ఈ చట్టం 2034కు ముందు అమల్లోకి వచ్చే పరిస్థితులు లేవు. మహిళా రిజర్వేషన్లు అమలవాలంటే ప్రస్తుతం కొనసాగుతున్న జనగణన–2027 ప్రక్రియ ముగిసి, ఆ లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పుననర్విభజన చేపట్టాల్సి ఉండటమే అందుకు కారణం. కానీ మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని 2029 నుంచే అమల్లోకి తేవాలని మోదీ సర్కారు భావిస్తోంది. ‘‘తదుపరి జనగణన, దాని తర్వాత డీలిమిటేషన్ ప్రక్రియకు చాలా సమయం పడుతుంది.కానీ లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు మూడోవంతు రిజర్వేషన్లు వీలైనంత త్వరగా అమలయ్యేలా చూడటం చాలా ముఖ్యం. అందుకు అనుగుణంగా మహిళా రిజర్వేషన్ల చట్టానికి అవసరమైన సవరణలు చేపట్టడమే లక్ష్యం’’అని ప్రతిపాదిత రాజ్యాంగ సవరణ బిల్లు ముసాయిదాలో కేంద్రం పేర్కొంది. ఇందుకోసం ప్రస్తుతం అందుబాటులో ఉన్న, అంటే 2011 జనాభా లెక్కల ఆధారంగానే లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ చేపట్టనున్నట్టు వెల్లడించింది. లోక్‌సభ, అసెంబ్లీల్లో మహిళలకు రిజర్వు చేసే స్థానాలను రొటేషన్ పద్ధతిలో కేటాయిస్తారని తెలిపింది. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు 15 ఏళ్ల పాటు అమల్లో ఉంటాయి. అనంతరం వాటి పొడిగింపుపై పార్లమెంటు నిర్ణయం తీసుకుంటుంది. మూడు బిల్లులపై 18 గంటల చర్చ మహిళా రిజర్వేషన్ల అమలుకు ఉద్దేశించిన మూడు కీలక బిల్లులను గురువారం లోక్‌సభలో కేంద్రం ప్రవేశపెట్టనుంది. రాజ్యంగ (131వ సవరణ) బిల్లు–2026, డీలిమిటేషన్ బిల్లు–2026, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లు–2026పై గురు, శుక్రవారాల్లో సభలో చర్చ జరగనుంది. అందుకు 18 గంటల సమయం కేటాయించారు. అనంతరం వాటిపై ఓటింగ్ చేపడతారు. తర్వాత మూడు బిల్లులపై శనివారం రాజ్యసభలో 10 గంటల పాటు చర్చ, అనంతరం ఓటింగ్ జరుగుతాయి. గురు, శుక్రవారాల్లో రాజ్యసభ డిప్యూటీ చైర్పర్సన్ ఎన్నిక కూడా జరుగుతుందని పార్లమెంటు వర్గాలు వెల్లడించాయి.లోక్‌సభ స్థానాల పెంపులో దక్షిణాది రాష్ట్రాలకు లబ్ధి?లోక్‌సభ నియోజకవర్గాల పెంపులో దామాషా ప్రాతినిధ్య విధానాన్ని ప్రాతిపదికగా తీసుకోనున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. లోక్‌సభ స్థానాలను గరిష్టంగా 850 దాకా పెంచాలని రాజ్యాంగ సవరణ బిల్లు–2026లో కేంద్రం ప్రతిపాదించింది. ‘‘వాటిని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయించే విషయంలో దామాషా విధానాన్ని అనుసరించనున్నారు. దీనిద్వారా దక్షిణాది రాష్ట్రాలకే ఎక్కువ లబ్ధి చేకూరే అవకాశముంది’’అని కేంద్ర వర్గాలు వివరించాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రధాని నరేంద్ర మోదీ గురువారం లోక్‌సభలో వెల్లడించే అవకాశమున్నట్టు తెలిపాయి.నియోజకవర్గాల పునర్విభజనకు 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకోనున్న విషయం తెలిసిందే. దక్షిణాది రాష్ట్రాలు కొన్ని దశాబ్దాలుగా కుటుంబ నియంత్రణను సమర్థంగా పాటిస్తూ వస్తున్నాయి. దాంతో ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే వాటిలో జనాభా పెరుగుదల తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో జనాభా ప్రాతిపదికన సీట్ల పెంపు చేపడితే తమకు అన్యాయం జరుగుతుందని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుండటం తెలిసిందే. పార్లమెంట్లో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గి ఉత్తరాది రాష్ట్రాల ప్రాబల్యం పెరుగుతుందని విపక్షాలు కూడా విమర్శిస్తున్నాయి.వాడీవేడిగా సమావేశాలు గురువారం నుంచి మూడు రోజుల పాటు జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ రాజకీయ లబ్ధి కోసమే మోదీ సర్కారు హడావుడిగా మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణలను తెరపైకి తెచి్చందని కాంగ్రెస్‌తో పాటు విపక్షాలన్నీ మండిపడుతున్నాయి. మరోవైపు డీలిమిటేషన్‌తో తమకు తీవ్ర అన్యాయం జరగనుందని దక్షిణాది రాష్ట్రాలు అభ్యంతరం లేవనెత్తుతున్నాయి. ఈ ప్రక్రియను పార్లమెంటులోనే సవాలు చేస్తామని ఇప్పటికే స్పష్టం చేశాయి.డీలిమిటేషన్ 2011 జనాభా లెక్కల ఆధారంగా కాకుండా తాజాగా జరుగుతున్న జనగణన ప్రాతిపదికన జరగాలని ఆప్, ఆర్జేడీ వంటి పార్టీలు డిమండ్ చేస్తున్నాయి. రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు ఆమోదానికి ఉభయ సభల్లోనూ మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం. ఇందుకు విపక్షాల మద్దుతు మోదీ ప్రభుత్వానికి తప్పనిసరి. ఈ నేపథ్యంలో సమావేశాలు వాడీవేడిగా సాగడం ఖాయంగా కని్పస్తోంది. పార్లమెంటు సమావేశాలకు విధిగా హాజరు కావాలంటూ బీజేపీ, కాంగ్రెస్ ఇప్పటికే తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి. డీలిమిటేషన్‌కు కమిషన్ ⇒ సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వం ⇒ సభ్యులుగా కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషనర్లు ⇒ ప్రతి రాష్ట్రం నుంచి 10 మంది సభ్యులులోక్సభ, అసెంబ్లీ స్థానాల పునర్ వ్యవస్థీకరణ కోసం డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు కానుంది. దానికి సుప్రీంకోర్టు ప్రస్తుత, లేదా రిటైర్డ్ న్యాయమూర్తి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్, లేదా ఎన్నికల కమిషనర్‌తో పాటు సంబంధిత రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సభ్యులుగా ఉంటారు. ఈ ప్రక్రియలో రాష్ట్రాల భాగస్వామ్యం నిమిత్తం ప్రతి రాష్ట్రం నుంచి 10 మంది చొప్పున అసోసియేట్ సభ్యులను నియమిస్తారు. వీరిలో ఐదుగురు ఎంపీలను లోక్‌సభ స్పీకర్, ఐదుగురు ఎమ్మెల్యేలను రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లు నామినేట్ చేస్తారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పరిధులు 1971 జనాభా లెక్కల ఆధారంగా ఉన్నాయి. కొన్ని దశాబ్దాలుగా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు భారీగా వలసలు పెరగడం, జనాభా పెరుగుదల రేటులో మార్పులతో నియోజకవర్గాల మధ్య సమతుల్యత దెబ్బతిన్నదని కేంద్రం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆరి్టకల్ 81, ఆరి్టకల్ 55కు కీలక సవరణలు చేస్తూ 2011 జనాభా లెక్కల ప్రాతిపదికగా నియోజకవర్గాలను పునర్ వ్యవస్థీకరించనున్నారు. -
బెంగాల్‌ను మూడు ముక్కలు చేసేందుకు కుట్ర: మమత
కోల్‌కతా: డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా పశ్చిమ బెంగాల్‌ను మూడు ముక్కలుగా విభజించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలను ఒడిశా, బిహార్లలో కలుపుతారే మోనంటూ అనుమానం వ్యక్తం చేశారు. బంకురా జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్నికల ర్యాలీల్లో మమత మాట్లాడారు. టీఎంసీ నుంచి గద్దె దించేందుకు బీజేపీ రూ.వెయ్యి కోట్ల ఒప్పందం కుదుర్చుకుందని ఆరోపించారు. ఈ విషయమై బీజేపీ తనతో రూ.1,000 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుందని, ఇప్పటికే రూ.200 కోట్లు ఇచ్చిందని హుమాయూన్ కబీర్ చేసిన ఆరోపణలతో కూడిన వీడియోను ఉద్దేశించి ఆమె ఈ వ్యాఖ్య చేశారు. -
డీలిమిటేషన్ బిల్లుకు ఆమోదం
సాక్షి, న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ చట్ట సవరణకు, లోక్‌సభ స్థానాల పెంపుకు ఉద్దేశించిన ముసాయిదా బిల్లులకు కేంద్రం పచ్చజెండా ఊపింది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఇందుకు ఆమోదముద్ర వేసింది. లోక్‌సభ స్థానాలను ప్రస్తుతమున్న 543 నుంచి 816కు పెంచాలని మోదీ సర్కారు నిర్ణయించడం తెలిసిందే. వాటిలో 273 స్థానాలను మహిళలకు కేటాయించనున్నారు. ఈ నేపథ్యంలో లోక్‌సభ, అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే నారీశక్తి వందన్ అధినియమ్ చట్టాన్ని 2029 లోక్‌సభ ఎన్నికలకు ముందే అమల్లోకి తేవాలని కేంద్రం కృతనిశ్చయంతో ఉంది. అందుకు వీలుగా రాజ్యాంగ సవరణ చేపట్టనున్నారు. దానితో పాటు డీలిమిటేషన్ బిల్లుకు కూడా పార్లమెంటు ఆమోదం పొందాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం ఏప్రిల్ 16 నుంచి 18 దాకా పార్లమెంటు ప్రత్యేకంగా సమావేశం కానుండటం తెలిసిందే. ఇందుకోసం బడ్జెట్ సమావేశాలను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.ఎరువుల సబ్సిడీకి రూ.41,534 కోట్లుఖరీఫ్ సీజన్‌కు ఎరువుల సబ్సిడీని 12 శాతం పెంపు నిర్ణయానికి కూడా కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. అందుకు రూ.41,533.81 కేటాయించారు. 2025 ఖరీఫ్ సీజన్ బడ్జెట్‌తో పోలిస్తే ఇది రూ.4,317 కోట్లు అదనమని కేంద్ర సమాచార ప్రసార మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో డీఏపీ ధరలు భారీగా పెరిగినా రైతులకు మాత్రం 50 కిలోల బస్తాను రూ.1,350కే అందుబాటులో ఉంచుతూ వస్తున్నట్టు ఆయన చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లో ఎరువులు, ముడి సరుకుల ధరల్లో మార్పులకు అనుగుణంగా రాయితీని హేతుబద్ధీకరిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుందన్నారు. ‘‘రూ.13 వేల కోట్ల పై చిలుకు అంచనా వ్యయంతో కూడిన జైపూర్ మెట్రో రెండో దశకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇది 36 స్టేషన్లతో 41 కి.మీ. మేరకు ఉంటుంది’’ అని వైష్ణవ్ వివరించారు. -
మహిళల కోటాపై కదలిక
వచ్చే నెలలో జనగణన తొలి దశ ప్రారంభం కాబోతుండగా చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు, అందరూ చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్న నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలకు సంబంధించిన పనులు ప్రారంభం కావాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం స్వాగతించదగ్గది. ఈ రెండింటికీ 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుంటారు. వాస్తవానికి 2023లో మహిళా కోటా బిల్లును ఆమోదించినప్పుడు ఆ మరుసటి సంవత్సరంలో జరిగే లోక్‌సభ ఎన్నికలకే దాన్ని వర్తింపజేయాలని విపక్షాలు కోరాయి. కానీ 2026 జనగణనకు ముందుగా ఇది సాధ్యంకాదని అప్పట్లో కేంద్రం చెప్పింది. నియోజకవర్గాల పునర్విభజనకూ దీన్నే కారణంగా చూపింది. ఈ హఠాత్ పునరా లోచనకు గల కారణమేమిటో కేంద్రం వివరించలేదు. అలాగే మహిళల కోటా నిర్ణయంలో ఎలాంటి విధానాన్ని అనుసరిస్తారన్నది కూడా చెప్పలేదు. వీటికి సంబంధించిన విధి విధానాలు పార్లమెంటు ప్రత్యేక సమావేశంలో మాత్రమే తెలిసే అవకాశం ఉంది. పునర్విభజన ప్రక్రియపై రాజకీయ పక్షాల మధ్య స్పర్థలున్నా మహిళల కోటా విషయంలో అన్ని పక్షాలూ ఏకాభిప్రాయంతోనే ఉన్నాయి. అయినా ఆ చట్టం అమలు వాయిదా పడింది.కొన్ని అభివృద్ధి చెందిన దేశాలూ, మనకన్నా వెనకబడివున్న దేశాలూ కూడా మహిళలకు దశాబ్దాల క్రితమే చట్టసభల్లో కోటా ఇచ్చి గౌరవించాయి. రువాండాలో రాజ్యాంగం ప్రకారం 30 శాతం కాగా, ఆచరణలో దాదాపు 64 శాతం మంది మహిళలున్నారు. క్యూబాలో 55.7 శాతం, ఫ్రాన్స్, అర్జెంటీనా, దక్షిణాఫ్రికా, బొలివియా, మెక్సికోల్లో 50 శాతంవరకూ రిజర్వేషన్లున్నాయి. నేపాల్‌లో 33 శాతం కోటా అమలవుతోంది. మన ఎంపీల్లో మహిళలు 14 శాతం మించిలేరు. ఈ గణాంకాలు గమనిస్తే మనం ఎంత వెనకబడి ఉన్నామో అర్థమవుతుంది. ఈ ఏడాది జనగణన ప్రక్రియ మొదలైనా, తుది గణాంకాలకు ఏడాది పడుతుంది. స్వాతంత్య్రం వచ్చి దాదాపు 8 దశాబ్దాలు కావస్తున్నా జనాభాలో సగభాగం ఉన్న మహిళలకు కోటా దక్కలేదు. ఇంకా ఆలస్యం చేయొద్దనుకోవటం మంచి నిర్ణయమే. అయితే నియోజకవర్గాల పునర్విభజన వివాదాస్పదం అయ్యే అవకాశం ఉంది. జనాభా ప్రాతిపదికన పార్లమెంటు, అసెంబ్లీ స్థానాల సంఖ్య నిర్ణయించటమే ఇందుకు కారణం. 2011 గణాంకాలను ప్రాతిపదికగా తీసుకోవటంవల్ల లోక్‌సభలో ప్రస్తుతం ఉన్న 543 స్థానాలూ 816కు ఎగబాకుతాయనీ, ఇందులో 273 స్థానాలు మహిళలకు లభిస్తాయనీ ఒక అంచనా. 2029 సార్వత్రిక ఎన్నికలకు దీన్ని వర్తింపజేస్తారు. తెలంగాణలో ఇప్పుడున్న 17 ఎంపీ స్థానాలు 26కు... 119 అసెంబ్లీ స్థానాలు 182కు పెరుగు తాయంటున్నారు. ఏపీకి ఇప్పుడున్న 25 ఎంపీ స్థానాలు దాదాపు 38కి, ప్రస్తుత 175 అసెంబ్లీ స్థానాలు 263కి చేరుతాయి. ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాదిన మహిళలు చదువుల్లో, వృత్తి ఉద్యోగాల్లో ముందుండటం, కుటుంబ నియంత్రణ వంటి కారణాలవల్ల జనాభా పెరుగుదల రేటు తగ్గింది. ఉదాహరణకు 1951లో తమిళనాడు జనాభా బిహార్‌కన్నా కొంత ఎక్కువ కాగా... ఆరు దశాబ్దాల తర్వాత బిహార్ జనాభా తమిళనాడుకన్నా ఒకటిన్నర రెట్లు అధికం. జనాభా ప్రాతిపదిక కాక, రాష్ట్రాల్లోని స్థానాలపై కొంత శాతం అధికంగా సీట్లిచ్చే విధానం ఉండాలని తమిళనాడు సీఎం స్టాలిన్ సూచిస్తున్నారు. జనాభా నిష్పత్తికి అనుగుణంగా రాష్ట్రాలకు లోక్‌సభలో ప్రాతినిధ్యం ఉండాలన్న రాజ్యాంగ అధికరణానికి ఇది విరుద్ధం. దేశంలో ప్రతి ఒక్కరి ఓటు విలువా ఒకేవిధంగా ఉండాలన్నది దీని ఆంతర్యం. కానీ జనాభారీత్యా యూపీ ఓటరు ఓటుకుండే విలువకన్నా తమిళనాడు లేదా కేరళ ఓటరు విలువ ఎక్కువుంది. ఈ వ్యత్యాసం కొనసాగనీయటం సమర్థనీయ మేనా అన్న సందేహం తలెత్తుతుంది.ప్రతి జనగణన తర్వాత దేశంలో నియోజకవర్గాల పునర్విభజన జరగాలని రాజ్యాంగం నిర్దేశిస్తున్నా, ఇందులో ఇమిడివున్న సమస్యలను పసిగట్టి గత పాలకులందరూ వాయిదాల్లో గడిపారు. 2000 సంవత్సరం వరకూ స్తంభింపజేస్తూ 1976లో... దాన్ని 2026 వరకూ పొడిగిస్తూ 2001లో రాజ్యాంగ సవరణలు తెచ్చారు. మొత్తానికి ఈ భారం ప్రస్తుత పాలకులపై పడింది. ఎవరికీ అన్యాయం జరగకుండా, ఉత్తర–దక్షిణాల వ్యత్యాసం రాకుండా సమస్యను పరిష్కరించగలిగితే దేశ సమైక్యతకు అది దోహదపడుతుంది. -
శాసనసభ స్థానాలు 263కి పెంపు!
సాక్షి, అమరావతి: నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్ర ప్రభుత్వం లైన్ క్లియర్ చేయడంతో శాసనసభ, లోక్‌సభ స్థానాల రూపురేఖలు సమూలంగా మారిపోతాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దేశంలో లోక్‌సభ, 28 రాష్ట్రాల్లో శాసనసభ స్థానాల పునర్విభజనకు 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన గంపగుత్తగా 50 శాతం స్థానాలను పెంచడం.. 33 శాతం స్థానాలను మహిళలకు రిజర్వేషన్ (ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్‌తో కలిపి) చేస్తూ రూపొందించిన మార్గదర్శకాలతో కూడిన బిల్లుపై బుధవారం కేంద్ర కేబినెట్ చర్చించనుంది. కేంద్ర కేబినెట్ ఆమోదించాక బిల్లును ఈ సమావేశాల్లోనే పార్లమెంటులో ప్రవేశపెట్టే దిశగా అడుగులు వేస్తోంది. నియోజకవర్గాల పునర్విభజన పూర్తయ్యాక.. పెరిగే నియోజకవర్గాలతోనే సార్వత్రిక ఎన్నికలకు వెళ్లాలని కేంద్రం భావిస్తోంది. నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం రూపొందించిన మార్గదర్శకాలను పరిశీలిస్తే.. రాష్ట్రంలో శాసనసభ స్థానాల సంఖ్య 175 నుంచి 262 లేదా 263కు పెరగనున్నాయి. ఇందులో మహిళలకు 33 శాతం అంటే 86 లేదా 87 స్థానాలు రిజర్వేషన్ చేయనున్నారు. ఇక లోక్‌సభ స్థానాలు 25 నుంచి 37 లేదా 38కి పెరగనున్నాయి. అందులో మహిళలకు 33 శాతం అంటే 12 లేదా 13 స్థానాలు రిజర్వేషన్ చేయనున్నారు. ఒక్కో శాసనసభ స్థానం పరిధిలో సగటున 1.60 లక్షల ఓటర్లు ఉంటారని అంచనా వేస్తున్నారు. నియోజకవర్గాల్లో సమూల మార్పు..ప్రస్తుతం రాష్ట్రంలో 29 శాసనసభ స్థానాలను ఎస్సీలకు, ఏడు శాసనభ స్థానాలకు ఎస్టీలకు రిజర్వు చేశారు. నాలుగు లోక్‌సభ స్థానాలు (చిత్తూరు, తిరుపతి, బాపట్ల, అమలాపురం) ఎస్సీలకు, ఒక లోక్‌సభ స్థానం(అరకు) ఎస్టీలకు రిజర్వు చేశారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు శాసనసభ, లోక్‌సభ స్థానాలు పెరగనున్నాయి. రాష్ట్రంలో ఎస్సీల జనాభా గరిష్టంగా ఉండే లోక్‌సభ, శాసనసభ స్థానాలను ఆ వర్గాలకు రిజర్వు చేయనున్నారు. ఎస్టీల జనాభా గరిష్టంగా ఉండే లోక్‌సభ, శాసనసభ స్థానాలను ఆ వర్గాలకు రిజర్వు చేయనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అన్ని లోక్‌సభ స్థానాల పరిధిలోనూ ఏడు చొప్పున శాసనసభ స్థానాల ఉన్నాయి. కానీ.. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఒక్కో లోక్‌సభ స్థానం పరిధిలో ఒక్కో రీతిలో శాసనసభ స్థానాల ఉండనున్నాయి. దీన్ని బట్టి చూస్తే.. లోక్‌సభ నియోజకవర్గాల స్వరూపం సమగ్రంగా మారిపోనుంది. ఇక శాసనసభ స్థానాల స్వరూపం కూడా సమగ్రంగా మారనుంది.పెరగనున్న మంత్రివర్గం కోటా:శాసనసభ స్థానాల్లో 15 శాతం లోపు సభ్యులతో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాలన్నది నిబంధన. ప్రస్తుతం శాసనసభలో 175 స్థానాలు ఉండటంతో రాష్ట్ర మంత్రివర్గం సభ్యుల సంఖ్య సీఎంతో కలిపి 26కి మించకూడదు. నియోజకవర్గాల పునర్విభజనతో శాసనసభ స్థానాల సంఖ్య 262 లేదా 263కు పెరగనుంది. ఆ మేరకు మంత్రివర్గం కోటా కూడా 26 నుంచి 39కి పెరగనుంది. -
ఆశల పల్లకీలో!
(శ్రీగిరి విజయ్‌కుమార్‌రెడ్డి– సాక్షి ప్రత్యేక ప్రతినిధి): ఎప్పుడెప్పుడా అని అంతా ఎదురుచూస్తున్న నియోజకవర్గాల పునర్విభజనకు తొలి అడుగు పడింది. పునర్విభజన జరిగితే లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయి కాబట్టి ఆ మేరకు రాజకీయంగా కూడా అవకాశాలు పెరుగుతాయి. 2027 జనాభా లెక్కలు ఆలస్యమయ్యే అవకాశం ఉండటంతో 2011 లెక్కలతోనే ప్రక్రియ మొదలుకానుంది. ప్రస్తుతం ఉన్న సీట్లకు అదనంగా 50 శాతం స్థానాలు పెంచాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల సంఖ్య 119 నుంచి 182కు పెరగనుండగా, లోక్‌సభ స్థానాలు 17 నుంచి 26కు పెరగనున్నాయి. వాస్తవానికి ప్రస్తుతం ఉన్న 119 అసెంబ్లీ స్థానాలకు 50 శాతం అంటే.. 60 స్థానాలు పెరిగితే 179 కావాలి.. కానీ ప్రతి లోక్‌సభ స్థానానికి 7 శాసనసభ స్థానాలు ఉండాలన్న నియమంతో 26 లోక్‌సభ స్థానాల పరిధిలో 182 శాసనసభ స్థానాలు ఏర్పాటు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. మరోవైపు వచ్చే ఎన్నికల నుంచే మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్న ప్రతిపాదనలతో వారికి శాసనసభలో 60, లోక్‌సభలో 9 స్థానాలు రిజర్వు అయ్యే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికల నుంచే పెంపు అమల్లోకి వస్తుంది. ఒకే జిల్లా పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గం ప్రస్తుతం ఉన్న జిల్లాల పరిధిలోనే కొత్త నియోజకవర్గాలు ఏర్పడతాయి. ఒక శాసనసభ నియోజకవర్గం ఒకే జిల్లా పరిధిలో ఉండాలన్న ప్రాథమిక నిబంధన మేరకు జిల్లా యూనిట్‌గా తీసుకుంటారు. ప్రస్తుతం పలు శాసనసభ నియోజకవర్గాలు రెండు, మూడు జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. కానీ కొత్తగా చేపట్టే పునర్విభజనలో కొత్త నియోజకవర్గాల హద్దులు ఒకే జిల్లాకు పరిమితమవుతాయి. ఈ మేరకు పలు ప్రస్తుత నియోజకవర్గాల పరిధుల్లో మార్పులు, చేర్పులు జరుగుతాయి. ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్‌లు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాల పరిధుల్లోనూ మార్పులు, చేర్పులు జరగనున్నాయి. ఇక కొత్తగా ఏర్పాటయ్యే 63 శాసనసభ స్థానాల్లో అత్యధికం హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డిలతో పాటు ఇతర పట్టణ ప్రాంతాల్లోనే ఏర్పాటు కానున్నాయి. పునర్విభజన ఇలా..! రాష్ట్రంలోని మొత్తం జనాభాను అన్ని నియోజకవర్గాలకు దాదాపు సమానంగా విభజిస్తారు. ప్రతి నియోజకవర్గానికి సగటుగా నిర్ణయించే జనాభా సంఖ్యలో 10 శాతం తక్కువ లేదా ఎక్కువ ఉండే వెసులుబాటు ఉంటుంది. 2011 లెక్కల మేరకు రాష్ట్ర జనాభా 3,51,90,260 మంది. దీని ప్రకారం ప్రతి నియోజకవర్గ సగటు 1,93,353గా ఉంటుంది. ఈ మొత్తానికి పది శాతం తక్కువ లేదా ఎక్కువ జనాభా సగటుతో నియోజకవర్గాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. పునర్విభజన కోసం ఏర్పాటు చేసే కమిషన్‌కు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి చైర్మన్‌గా, అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందినవారు సభ్యులుగా ఉంటారు. కమిషన్ తీసుకునే నిర్ణయాలపై ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేస్తారు. మహిళలకు ఎలా..? మహిళలకు కేటాయించే స్థానాలు లాటరీ ద్వారా కేటాయిస్తారా..లేక అత్యధిక జనాభా ఉన్న మొదటి 60 నియోజకవర్గాలను ఎంచుకుంటారా? అన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ అత్యధిక జనాభా ఉన్న నియోజకవర్గాలను ఎంచుకుంటే పురుషుల కంటే మహిళల జనాభా ఎక్కువగా ఉన్న నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, మెదక్, సిరిసిల్ల, భూపాలపల్లి, నారాయణపేట, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, ఖమ్మం, వికారాబాద్ జిల్లాల్లో అత్యధిక స్థానాలు కేటాయించే అవకాశం ఉంది. ఉమ్మడి జిల్లాల వారీగా కొత్తవి ఎన్ని.. ఆదిలాబాద్‌లో 5 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుతం 10 నియోజకవర్గాలుండగా కొత్తగా మరో ఐదు స్థానాలు పెరగనున్నాయి. కొత్తగా ఆదిలాబాద్ అర్బన్, ఉట్నూరు, మంచిర్యాల రూరల్ లేదా లక్సెట్టిపేట, నర్సాపూర్ (నిర్మల్) నియోజకవర్గాలతో పాటు మరొకటి కూడా ఏర్పడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఖానాపూర్ నియోజకవర్గంలో ఉన్న ఇంద్రవెల్లి, ఉట్నూరు, ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఉన్న నార్నూరు, గాదిగూడ మండలాలు ఆదిలాబాద్ జిల్లాలో ఏర్పడే కొత్త నియోజకవర్గంలోకి వెళతాయి. నిర్మల్ జిల్లాలో ఉన్న ప్రాంతాలతోనే ఖానాపూర్ నియోజకవర్గం హద్దులు మార్చుకుంటుంది. నిజామాబాద్‌లో 3 నిజామాబాద్ జిల్లాలో ప్రస్తుతం ఉన్న ఐదు స్థానాలకు కొత్తగా మరో మూడు అసెంబ్లీ స్థానాలు ఏర్పాటవుతాయి. కొత్తగా నిజామాబాద్ సౌత్ లేదా నార్త్, బోధన్ నియోజకవర్గం నుండి కొన్ని ప్రాంతాలను విడదీసి ఎడపల్లి లేదా బోధన్ రూరల్ నియోజకవర్గం ఏర్పాటవుతుంది. ఇక కామారెడ్డి జిల్లాలో కొత్తగా కామారెడ్డి రూరల్ æస్థానం ఏర్పాటుకు అవకాశం ఉంది. కరీంనగర్లో 5 ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రస్తుతం 12 స్థానాలుండగా, కొత్తగా ఐదు స్థానాలు ఏర్పడతాయి. కరీంనగర్ రూరల్, జగిత్యాల రూరల్, మెట్పల్లి, సుల్తాన్‌బాద్, ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల జిల్లా) నియోజకవర్గాలు ఏర్పడే అవకాశం ఉంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉమ్మడి కరీంనగర్ నుండి సిద్దిపేట, హనుమకొండ జిల్లాల్లోకి సుమారు 10 మండలాలు వెళ్లటంతో తక్కువ నియోజకవర్గాలు ఏర్పడుతున్నాయి. మెదక్‌లో 7 ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రస్తుతం 11 స్థానాలుండగా, కొత్తగా 7 స్థానాలు ఏర్పాటవుతాయి. అందులో సంగారెడ్డి జిల్లాలో కొత్తగా రామచంద్రాపురం, అమీన్పూర్, సదాశివపేట, మెదక్ జిల్లాలో రామాయంపేట నియోజకవర్గాలు ఏర్పడే అవకాశం ఉంది. సిద్దిపేట జిల్లాలో ప్రస్తుతం ఉన్న సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్లతో పాటు కొత్తగా సిద్దిపేట రూరల్ నియోజకవర్గం ఏర్పాటయ్యే అవకాశం ఉంది. రెండు స్థానాలపై స్పష్టత రావాల్సి ఉంది. మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్‌లోని తూప్రాన్, మనోహరాబాద్, దుబ్బాకలోని చేగుంట రామాయంపేటలో చేరతాయి. నల్లగొండలో 6 ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రస్తుతం 12 స్థానాలుండగా కొత్తగా 6 నియోజకవర్గాలు ఏర్పాటవుతాయి. కొత్తగా మిర్యాలగూడ రూరల్, నల్లగొండ రూరల్ ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ఇక యాదాద్రి భువనగిరిలో రామన్నపేట లేదా చౌటుప్పల్ లేదా మోత్కూరు నియోజకవర్గం, సూర్యాపేట జిల్లాలో ఇప్పుడు 4 స్థానాలుండగా కొత్తగా సూర్యాపేట రూరల్, మునగాల నియోజకవర్గాలతో ఇంకో నియోజకవర్గం ఏర్పాటుకు అవకాశం ఉంది. ఖమ్మంలో 2 ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం 10 స్థానాలుండగా, పునర్విభజన అనంతరం కొత్తగా రఘునాథపాలెం, ఖమ్మం అర్బన్ మండలంలోని పలు ప్రాంతాలతో ఖమ్మం రూరల్ నియోజకవర్గం ఏర్పాటు కానుంది. మిగిలిన స్థానాలు యథాతథంగా ఉంటాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రస్తుతం ఉన్న ఐదు స్థానాలుండగా కొత్తగా ఒక స్థానం పెరుగుతుంది. వరంగల్‌లో 9 ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రస్తుతం 12 నియోజకవర్గాలుండగా కొత్తగా 9 నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉంది. హనుమకొండ జిల్లాలో కాజీపేట, హసన్‌పర్తి, శాయంపేట, మడికొండ, వరంగల్ జిల్లాలో వరంగల్ సెంట్రల్, గీసుకొండ, మహబూబాబాద్ జిల్లాలో మహబూబాబాద్ రూరల్, తొర్రూరు,, భూపాలపల్లిలో కాటారం, జనగామలో ప్రస్తుతం ఉన్న మూడు నియోజకవర్గాలు కొనసాగే అవకాశం ఉంది. మహబూబ్‌నగర్‌లో 6 ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కొత్తగా 6.. మహబూబ్‌నగర్ రూరల్, గండీడ్, కోస్గి, అమరచింత, పెబ్బేరు, ఐజ నియోజకవర్గాలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం రెండు నియోజకవర్గాలుగా విడిపోనుంది. అందులో కొత్తగా ఏర్పాటయ్యే నియోజకవర్గంలో కోస్గి, మద్దూర్ ఇతర మండలాలు చేరితే,, వికారాబాద్ జిల్లాలో ఉన్న కొడంగల్, బొమ్మరాశిపేట, దుద్యాల, దౌల్తాబాద్ మరో రెండు మండలాలతో కొడంగల్ రూపురేఖలు మారనున్నాయి. హైదరాబాద్ చుట్టూ మొత్తం 51 హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో అసెంబ్లీ స్థానాల సంఖ్య మొత్తం 51కి పెరగనుంది. హైదరాబాద్‌లో 5 స్థానాలు పెరిగి మొత్తం 20 నియోజకవర్గాలు ఏర్పాటు కానునున్నాయి. మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో 31 స్థానాలు అవుతాయి. సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం వికారాబాద్‌లోని మండలాలతోనే ఏర్పాటవుతుంది. ప్రస్తుత రంగారెడ్డి జిల్లాలో శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, మహేశ్వరం నియోజకవర్గాలు రెండేసిగా ఏర్పడి మొత్తం 13 నియోజకవర్గాలు, మేడ్చల్ జిల్లాలో ప్రస్తుతం ఉన్న 5 స్థానాలకు తోడు కొత్తగా కాప్రా, అల్వాల్, బోడుప్పల్, కొంపల్లి, మూసాపేట తదితర స్థానాలు ఏర్పడే అవకాశం ఉంది. -
జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాదికి అన్యాయం
సాక్షి, హైదరాబాద్: జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేయాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సామాజిక మాధ్యమాల్లో వ్యక్తం చేసిన ఆందోళనలతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నట్టు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో కేటీఆర్ పేర్కొన్నారు.‘జనాభా నియంత్రణలో దక్షిణాది రాష్ట్రాల కృషిని పట్టించుకోకుండా జనాభా ఆధారంగా నియోజకవర్గాలను పునర్విభజించడం ప్రజాస్వామ్యానికి, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం. దక్షిణాది రాష్ట్రాలు దేశ నిర్మాణంలో అందించిన సహకారాన్ని ఎవరూ కాదనలేరు. 1951లో దక్షిణాది రాష్ట్రాల జనాభా వాటా 26.2 శాతం ఉండగా, 2022 నాటికి అది 19.8 శాతానికి పడిపోయింది. అదే సమయంలో ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, రాజస్తాన్ వంటి ఉత్తర రాష్ట్రాల జనాభా వాటా 39.1 శాతం నుంచి 43.2 శాతానికి పెరిగింది. ఈ పరిస్థితుల్లో జనాభా ఆధారంగా లోక్‌సభ సీట్లను నిర్ణయిస్తే, ఉత్తరప్రదేశ్, బిహార్‌కు 222 సీట్లు వస్తాయి. దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళకు మొత్తంగా కేవలం 165 సీట్లు మాత్రమే లభిస్తాయి. దక్షిణాది రాష్ట్రాలు ఆర్థిక వృద్ధి, మానవ అభివృద్ధి సూచికలు, జనాభా నియంత్రణ వంటి అన్ని రంగాల్లో ఉత్తర రాష్ట్రాల కంటే గణనీయంగా మెరుగైన పనితీరు కనబరిచాయి. అలాంటి రాష్ట్రాలను శిక్షించి, వెనుకబడిన రాష్ట్రాలను ప్రోత్సహించడం దేశ ప్రయోజనాలకు వ్యతిరేకం’అని కేటీఆర్ పేర్కొన్నారు.అధికార యంత్రాంగంపై వేధింపులు సిగ్గుచేటు‘తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్ స్ట్రాక్ట్ (అట్లాస్) రిపోర్టుతో కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత రాష్ట్ర ప్రజల ముందు బట్టబయలు కావడం సీఎంకు మింగుడు పడటం లేదు. వెబ్సైట్ నుంచి రిపోర్టులు తొలగించి, అధికారులపై వేటు వేసినంత మాత్రాన కేసీఆర్ కృషిని చెరిపివేయలేరు’అని కేటీఆర్ అన్నారు.టెక్, ఇన్నోవేషన్ సమ్మిట్–2025కు కేటీఆర్ఫిబ్రవరి 27, 28 తేదీల్లో జరిగే టెక్, ఇన్నోవేషన్ సమ్మిట్ (టిస్)లో ముఖ్య అతిథిగా ప్రసంగించేందుకు కేటీఆర్ బుధవారం సాయంత్రం బెంగళూరుకు బయలుదేరివెళ్లారు. గురువారం జరిగే సదస్సులో ‘డ్రైవింగ్ డిజిటల్ ఇండియా– సాంకేతికంగా అభివృద్ధి చెందిన భవిష్యత్ కోసం ఆవిష్కరణలు, వ్యూహాలు’అనే అంశంపై కేటీఆర్ కీలకోపన్యాసం చేస్తారు. -
జనగణన... వచ్చే ఏడాదే
న్యూఢిల్లీ: నాలుగేళ్ల సుదీర్ఘ జాప్యం తర్వాత ఎట్టకేలకు దేశ జనాభా గణన జరగనుంది. ‘‘2025 తొలినాళ్లలో ఈ ప్రక్రియను ప్రారంభించాలని కేంద్రం భావిస్తోంది. 2026 కల్లా ఇది ముగియనుంది. దాని ఆధారంగా జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్పీఆర్)ను సవరిస్తారు. అనంతరం తాజా జనాభా లెక్కల ఆధారంగా లోక్‌సభ స్థానాల పునర్విభజన ప్రక్రియ మొదలయ్యే అవకాశముంది. అదే జరిగితే ఆ ప్రక్రియ 2028 నాటికి పూర్తి కావచ్చు’’ అని అధికార వర్గాలు తెలిపాయి. కులగణన చేపట్టాలన్న ప్రతిపక్షాల డిమాండ్ నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. అయితే జనగణనలో భాగంగా కులగణన కూడా ఉంటుందా అన్న కీలక అంశంపై మాత్రం ప్రస్తుతానికి స్పష్టత లేదు. జనగణనలో భాగంగా పౌరులను అడిగేందుకు 31 ప్రశ్నలతో కూడిన ప్రశ్నావళిని రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనర్ కార్యాలయం ఇప్పటికే సిద్ధం చేసింది. జనగణనలో మత, సామాజిక వర్గీకరణతో పాటు, జనరల్, ఎస్సీ, ఎస్టీ గణనే గాక జనరల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలలోని ఉప విభాగాల సర్వేలు కూడా ఉండవచ్చని భావిస్తున్నారు. దీనిపై ఇప్పటికైతే స్పష్టత లేదు. జనగణనను సరైన సమయంలో చేపడతామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా గత ఆగస్టులో చెప్పడం తెలిసిందే. ఈసారి కార్యక్రమం పూర్తిగా మొబైల్ అప్లికేషన్ ద్వారా డిజిటల్‌గా జరుగుతుందని ఆయన వెల్లడించారు.మారిపోనున్న జనగణన సైకిల్: భారత్‌లో తొలి జనగణన 1872లో జరిగింది. స్వాతంత్య్రానంతరం 1951 నుంచి ప్రతి పదేళ్లకు ఓసారి జరుగుతూ వస్తోంది. చివరిసారిగా 2011లో జనగణన జరిగింది. 2021లో జరగాల్సిన జనగణనకు కరోనా కారణంగా అంతరాయం ఏర్పడింది. అప్పటినుంచీ పెండింగ్‌లోనే ఉంది. ఈ ఆలస్యం కారణంగా జనగణన సైకిల్ కూడా మారనుంది. ఇకపై 2025–35, 2035–45... ఇలా కొనసాగనుంది. తాజా పరిణామాల నేపథ్యంలో భారత జనగణన కమిషనర్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ డిప్యుటేషన్‌ను 2026 ఆగస్టు దాకా కేంద్రం పొడిగించింది. 2011 జనగణనలో భారత్‌లో 121 కోట్ల పై చిలుకు జనాభా ఉన్నట్టు తేలింది. అంతకుముందు పదేళ్లతో పోలిస్తే 17.7 శాతం వృద్ధి రేటు నమోదైంది.కులగణన జరపాల్సిందేనన్న కాంగ్రెస్: కులగణనకు కేంద్రం నిరాకరించడం ఓబీసీ వర్గాలకు ద్రోహం చేయడమేనని కాంగ్రెస్ నేత మాణిక్యం ఠాగూర్ విమర్శించారు. మోదీ సర్కారు రాజకీయ అహంకారంతో వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రజల పక్షాన నిలబడతాయా, లేదా మౌనంగా ఉంటాయా?’’ అని ఆయన ప్రశ్నించారు.లోక్‌సభ సీట్లు తగ్గుతాయేమో!జనాభా లెక్కల విషయంలో దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పటికే తీవ్ర ఆందోళన నెలకొని ఉంది. ఉత్తరాదితో పోలిస్తే ఆ రాష్ట్రాలు జనాభా నియంత్రణలో ముందంజలో ఉండటం తెలిసిందే. ఫలితంగా ఆ రాష్ట్రాల్లో జనాభా బాగా తగ్గుముఖం పట్టింది. ఈ కారణంగా నూతన జనగణన గణాంకాల ఆధారంగా పునర్ వ్యవస్థీకరణ జరిగే పోంలో తమ లోక్‌సభ స్థానాల్లో బాగా కోత పడే ఆస్కారముండటం వాటిని కలవరపెడుతోంది. ఇది రాజకీయంగా తమ ఆధిపత్యాన్ని బాగా తగ్గిస్తుందని ఆ రాష్ట్రాలు అనుమానిస్తున్నాయి. 1971 జనాభా లెక్కల ఆధారంగా చివరిసారిగా నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ జరిగింది. అయితే 2026 అనంతరం చేపట్టే తొలి జనగణన తాలూకు ఫలితాలు అందుబాటులోకి వచ్చేదాకా లోక్‌సభ నియోజకవర్గాల తదుపరి పునర్ వ్యవస్థీకరణ జరగరాదని రాజ్యాంగంలోని 82వ ఆర్టికల్ నిర్దేశిస్తోంది. ఆ లెక్కన తాజా జనగణన 2025లో మొదలయ్యే పక్షంలో వాటి ఆధారంగా పునర్ వ్యవస్థీకరణ ప్రక్రియ చేపట్టడానికి వీలుండదు. అలాగాక వాటి ఆధారంగా పునర్ వ్యవస్థీకరణ జరపాలంటే 82వ ఆర్టికల్‌ను సవరించాల్సి ఉంటుంది. కనుక ఆ క్రతువును మొదలుపెట్టే ముందు ఈ అంశాలన్నింటినీ కూలంకషంగా పరిశీలించి పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. -
నూతన దంపతులు 16 మందిని కనాలి
చెన్నై: నూతన దంప తులు ఎక్కువ మంది పిల్లల్నికనే విష యం ఆలోచించాల ని తమిళనాడు ము ఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పేర్కొ న్నారు. ‘తమిళ సంప్రదాయంలో పెద్దలు నూతన దంపతులను 16 సంపదలతో వర్ధిల్లాలని ఆశీర్వదిస్తుంటారు. కానీ, నేడు పరిస్థితి మారిపోయింది. 2026 నుంచి చేపట్టనున్న జన గణన, లోక్‌సభ నియోజ కవర్గాల పునర్విభజనతో పుణ్యమాని చిన్న కుటుంబానికి బదులు, 16 మంది సంతానంతో కళకళలాడాలని ఆశీర్వదించాల్సిన రోజులొచ్చాయి’అని ఆయన వ్యాఖ్యానించారు. సోమవారం చెన్నైలో జరిగిన సామూహిక వివాహ వేదిక కార్యక్రమంలో సీఎం స్టాలిన్ మాట్లాడారు. నియోజకవర్గాల పునర్విభజన కారణంగా దేశంలో ఎన్నికల ముఖ చిత్రమే పూర్తిగా మారిపోనుందని అన్నారు. ‘లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్య తగ్గే అవకాశం ఉన్నందున, మాకు 16 మంది పిల్లలుండాలా అని ఆశ్చర్యపోయే పరిస్థితి ఏర్పడొచ్చు. అయితే, ఈ విషయం మనం మర్చిపోకూడదు’ అని ఆయన అన్నారు. -
ఇది అన్యాయం.. బాధాకరం: కేటీఆర్
హైదరాబాద్: లోక్ససభ డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరగనుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఆవేదన వ్యక్తం చేశారు. 2026 తర్వాత జనాభా ప్రతిపాదికన జరుగనున్న లోక్‌సభ స్థానాల డీలిమిటేషన్‌పై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేశారు. అధిక జనాభాతో సతమతమవుతున్న దేశాన్ని కాపాడుకునేందుకు.. జనాభా నియంత్రణ పద్ధతులు పాటించాలని దశాబ్దాల నుంచి కేంద్రం చెబుతున్న మాటల్ని, విధానాలను దక్షిణాది రాష్ట్రాలు నమ్మాయి. ప్రగతిశీల విధానాలతో జనాభా నియంత్రణ చేశాయి. అలాంటిది ఇవాళ డీలిమిటేషన్ వల్ల తీవ్ర అన్యాయానికి లోనయ్యే అవకాశం ఉంది. ప్రగతిశీల విధానాలతో ముందుకు పోతున్న దక్షిణాది రాష్ట్రాలు ఈ నూతన డీలిమిటేషన్ వల్ల తక్కువ లోక్‌సభ స్థానాలు (MP Seats) పొందడం అన్యాయం, బాధాకరమని ట్విట్టర్ వేదికగా కేటీఆర్ తెలిపారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ విజ్ఞప్తులను పట్టించుకోకుండా జనాభా నియంత్రణ చేయని రాష్ట్రాలు, ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలు లోక్‌సభ సీట్ల పెంపులో లబ్ధిపొందుతున్నాయని.. ఇది దురదృష్టకరమన్నారు. జనాభాను నియంత్రించిన కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలు.. తమ ప్రగతిశీల విధానాలకు తీవ్రంగా శిక్షించబడుతున్నాయని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. కేవలం జనాభా నియంత్రణ మాత్రమే కాకుండా అన్ని రకాల మానవాభివృద్ధి సూచీల్లోనూ దక్షిణాది రాష్ట్రాలు ముందు వరుసలో ఉన్నాయని చెప్పారాయన. 18 శాతం జనాభా కలిగిన దక్షిణాది రాష్ట్రాలు 35 శాతం జాతీయ స్థూల జాతీయోత్పత్తికి (GDP) నిధులు అందిస్తున్నాయని, జాతీయ ఆర్థికాభివృద్ధికి, దేశాభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తున్న దక్షిణాది రాష్ట్రాలు.. అసంబద్ధమైన లోక్‌సభ డిలిమిటేషన్ విధానం వల్ల భవిష్యత్తులో తమ ప్రాధాన్యత కోల్పోరాదని అభిప్రాయపడ్డారాయన. తమ ప్రగతిశీల విధానాలకు లబ్ధిపొందాల్సిన చోట తీవ్రమైన అన్యాయానికి గురవుతున్న దక్షిణాది రాష్ట్రాల వాణిని వినిపించాల్సిన అవసరం ఉన్నదని, ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న అన్యాయంపైన నాయకులు, ప్రజలు గళమెత్తాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. This is indeed a travesty and a tragedy of it does come true. Southern states of India have been best performers on all fronts post independence Leaders and people of all Southern states need to raise their voices collectively cutting across political affiliations against this… https://t.co/ohE9GD8hDD — KTR (@KTRBRS) May 29, 2023 ఇదీ చదవండి: కేసీఆర్ కోవర్టులు అంతటా ఉన్నారు! -
డీలిమిటేషన్‌ను సవాలుచేస్తూ దాఖలైన పిటీషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
-
Jammu Kashmir: కేంద్రానికి భారీ ఊరట
న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్ నియోజకవర్గాల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఊరట లభించింది. ప్రత్యేక కమిటీ ద్వారా నియోజకవర్గాల సంఖ్య పెంపు, సరిహద్దులు మార్పులు చేయడంపై అభ్యంతరాలు లేవనెత్తుతూ ప్రతిపక్షాల తరపున దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు ఇవాళ (సోమవారం) కొట్టేసింది. జమ్ము కశ్మీర్‌లోని మొత్తం 90 అసెంబ్లీ, ఐదు లోక్‌సభ స్థానాల హద్దులను తిరగరాసింది డీలిమిటేషన్ కమిషన్. అయితే ఈ చర్య బీజేపీకి లాభం చేకూర్చేదిగా ఉందంటూ శ్రీనగర్‌కు చెందిన స్థానిక నేతలు హాజీ అబ్దుల్ ఘనీ ఖాన్, ముహమ్మద్ అయూబ్ మట్టో.. సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2019లో పార్లమెంట్లో ప్రత్యేక చట్టం ద్వారా.. ఆర్టికల్ 370 రద్దుతో జమ్ము కశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక హోదాను రద్దు చేయడంతో పాటు ఆ ప్రాంతాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన సంగతి తెలిసిందే. అయితే కిందటి ఏడాది మే నెలలో జమ్ము అసెంబ్లీని 114 అసెంబ్లీ స్థానాలు(అందులో 24 పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌కు.. 43 జమ్ము రీజియన్‌కు, కశ్మీర్ లోయకు 47 సీట్లు..), కేటాయిస్తూ డీలిమిటేషన్ కమిషన్ ప్రతిపాదనలు చేసింది. అంతేకాదు.. పాక్ ఆక్రమిత జమ్ము కశ్మీర్ శరణార్థులకు, ఇద్దరు కశ్మీర్ వలసవాదులను సైతం అసెంబ్లీకి నామినేట్ చేయాలని డీలిమిటేషన్ కమిషన్ సిఫార్సు చేసింది. అయితే.. 1971 జనాభా లెక్కల ప్రకారం.. దేశంలో 2026 ఏడాది వరకు నియోజకవర్గాలను పునర్వర్థస్థీకరించడానికి వీల్లేదని, పైగా కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత నియోజకవర్గాలను ఎలా మారుస్తారని.. కేంద్రంలోని బీజేపీది ముమ్మాటికీ రాజ్యాంగ విరుద్ధమని.. పిటిషన్‌దారులు సుప్రీం కోర్టులో వాదించారు. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం కశ్మీర్ ప్రత్యేక హోదాను జమ్ము కశ్మీర్ పునర్వవ్యస్థీకరణ చట్టం-2019 ప్రకారమే నిజయోకవర్గాల కోసం కమిటీ ఏర్పాటు చేసినట్లు వాదించింది. దీంతో కేంద్రం వాదనతోనే ఏకీభవించింది సుప్రీం కోర్టు. ఈ ఏడాదిలో.. కుదరకుంటే వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలతో పాటు జమ్ము కశ్మీర్‌కు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. -
డీలిమిటేషన్లో మార్పులు చేయలేం
సాక్షి, న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ఆర్డర్ గెజిట్ నోటిఫికేషన్‌ను సవాల్ చేయడం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం, జమ్మూకశ్మీర్(యూటీ) స్పష్టం చేశాయి. ఈ పునర్విభజనకు సంబంధించి కమిషన్ ఏర్పాటు, దాని పరిధి, పదవీకాలం, అధికారాలపై ప్రభుత్వం గెజిట్ విడుదల చేసిన నేపథ్యంలో దీనిపైæ వ్యాఖ్యలు చేయదలచుకోలేదని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను సవాల్ చేస్తూ హజీ అబ్దుల్ గనీ ఖాన్, మహమూద్ మట్టూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు కేంద్రం, జమ్మూకశ్మీర్(యూటీ), ఎన్నికల సంఘం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశాయి. పునర్విభజనపై ఏర్పాటైన కమిషన్ గెజిట్‌లో ప్రచురణ అయిన తర్వాత డీలిమిటేషన్ చట్టం–2002లోని సెక్షన్ 10(2) ప్రకారం సవాల్ చేయడం సాధ్యం కాదని కేంద్రం పేర్కొంది. మేఘరాజ్ కొఠారీ వర్సెస్ డీలిమిటేషన్ కమిషన్ కేసులో ఈ సెక్షన్‌ను ఇప్పటికే కోర్టు సమర్థించిందని గుర్తుచేసింది. పిటిషన్లను అనుమతిస్తే గెజిట్ నిష్ఫలం అవుతుందని, ఇది ఆర్టికల్ 329ని ఉల్లంఘించడమేనని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అసెంబ్లీ సీట్లు పెంపునకు సంబంధించి ఏపీ విభజన చట్టాన్ని అమలు చేయాలని కోరుతూ పురుషోత్తంరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను ఇదే కేసుతో సుప్రీంకోర్టు గతంలో జత చేసింది. -
సమాచారం పంపండి
► నియోజకవర్గాల పరిధిలో గ్రామాల జాబితా ఇవ్వండి ► జిల్లా యంత్రాంగానికి కేంద్ర ఎన్నికల కమిషన్ లేఖ సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: నియోజకవర్గాల సమగ్ర సమాచారం నివేదించాలని కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) జిల్లా యంత్రాంగానికి లేఖ రాసింది. ఆయా నియోజకవర్గాల పరిధిలోకి ఏయే మండలాలు, గ్రామాలు వస్తాయనే వివరాలను తక్షణమే పంపాలని ఆదేశించింది. అదే పట్టణ నియోజకవర్గాలయితే.. వార్డుల హద్దుల సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ మేరకు అదనపు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ అనూప్‌సింగ్ లేఖ రాశారు. నియోజకవర్గాల పునర్విభజనను నిర్వచిస్తూ లేఖలో రాసినప్పటికీ, ఇది రొటీన్ లో భాగంగా జరుగుతున్న ప్రక్రియ మాత్రమేనని అధికారవర్గాలంటున్నాయి. ఇదిలా ఉండగా, ఈసీ అడిగిన సమాచారాన్ని తక్షణమే పంపాలని ఆర్డీఓ, తహసీల్దార్లను జిల్లా యంత్రాంగం ఆదేశించింది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో నియోజకవర్గాల్లో కొన్ని మండలాలు వేర్వేరు జిల్లాల్లో కలిసినందున.. దానికి అనుగుణంగా సమాచారాన్ని సేకరించాలని నిర్దేశించింది. -
2026 వరకూ సాధ్యం కాదు!
నియోజకవర్గాల పునర్విభజనపై జైరాం రమేష్ ► 2026 వరకూ సీల్ చేస్తూ పార్లమెంట్ చట్టం చేసింది ► అందుకే జార్ఖండ్ కోసం మేం రెండేళ్లు కృషి చేసినా కాలేదు ► ఆర్టికల్-170కి లోబడే ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్-26 ఉంది ► ఒక్క రాష్ట్రం కోసం డీలిమిటేషన్ సాధ్యం కాదు ► డీలిమిటేషన్‌ను చూపి ఫిరాయింపుల పోత్సాహం సరికాదు సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ నియోజక వర్గాల పునర్విభజన అంత సులువు కాదని విభజన బిల్లు రూపకర్త, కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు. విభజన చట్టం రూపకల్పన సమయంలోనే ఈ విషయంపై చర్చ జరిగిందన్నారు. 2026 వరకూ ఇది సాధ్యం కాదని, తాను జార్ఖండ్ కోసం రెండేళ్లు కృషి చేసినా ఫలితం దక్కలేదని తెలిపారు. అసెంబ్లీ స్ధానాల పెంపు కోసం పలు రాష్ట్రాల నుంచి డిమాండ్లు వస్తున్నాయని, వాటన్నింటినీ పక్కన పెట్టి సీట్ల పెంపును తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితం చేయడం కుదరకపోవచ్చని చెప్పారు. ఏపీ విభజన బిల్లు రూపకల్పనలో కీలకపాత్ర పోషించిన జైరాం రమేష్ సోమవారం ఢిల్లీలో ‘సాక్షి’తో మాట్లాడారు. ‘‘డీలిమిటేషన్‌ను 2026 వరకూ సీల్ చేస్తూ పార్టమెంట్ చట్టాన్ని ఆమోదించింది. అందువల్ల ప్రస్తుతానికి రాజ్యాంగం ప్రకారం డీలిమిటేషన్ సాధ్యం కాదు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్-26 లో చిన్న సవరణ ద్వారా అసెంబ్లీ స్థానాల పెంపుకు అవకాశం ఉందంటున్నారు. కానీ అది ఆర్టికల్-170కి లోబడి మాత్రమే ఉంది’’అని తెలిపారు. దీనిపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రి వెంకయ్య నాయుడు స్పష్టత ఇవ్వాలన్నారు. 2026కంటే ముందు సాధ్యంకాదు డీలిమిటేషన్ కోసం వివిధ రాష్ట్రాల నుంచి పలు డిమాండ్లు వస్తున్నాయని జైరాం రమేష్ తెలిపారు. జనాభా ఆధారంగా అయితే 2026 కంటే ముందుగా అది సాధ్యం కాదన్నారు. ‘‘ఉదాహరణకి జార్ఖండ్ రాష్ట్రం ఏర్పాటయినప్పుడు శాసనసభ సంఖ్యా బలం 81గా ఖరారు చేశారు. జార్ఖండ్ జనాభా, కేరళ జనాభా సమానంగా ఉన్నాయి. కేరళ శాసన సభ సంఖ్యా బలం 140. ఆ మేరకు జార్ఖండ్ శాసనసభ సంఖ్యా బలం పెంచాలని మేం రెండేళ్లు ప్రయత్నించి విఫలమయ్యాం. అయితే తాను ఆమోదించిన ఏ చట్టాన్నైనా, ఎప్పుడైనా పార్లమెంట్ సవరించవచ్చు. దీనికి అన్ని రాజకీయ పక్షాలు మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. అందువల్ల ఏం జరుగుతుందో, కేంద్రం ఏం చేస్తుందో వేచి చూడాలి. పార్లమెంట్ ఆమోదంతోనే మొత్తం సంఖ్యాబలంలో మార్పులు సాధ్యమవుతాయి. అది కేవలం ఒక్క రాష్ట్రం కోసం సాధ్యం కాదు’’ అని వివరించారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం రూపకల్పన సమయంలోనే దీనిపై చర్చ జరిగిందని చెప్పారు. అసెంబ్లీ స్థానాలు పెరుగుతున్నాయని తెలుగు రాష్ట్రాల్లో ఫిరాయింపులను ప్రోత్సహించడం సరికాదన్నారు. పార్టీ ఫిరాయింపుల వ్యతిరేక చట్టం తన పని తాను చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. -
మళ్లీ పునర్విభజన
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : నియోజకవర్గాల పునర్విభజనతో జిల్లా రాజకీయ ముఖచిత్రంలో మార్పులు చోటు చేసుకోనున్నాయి. అసెంబ్లీ స్థానాల సంఖ్య రెండు లేదా మూడు పెరిగే అవకాశాలున్నాయి. 2019 ఎన్నికల నాటికి ఈ నియోజకవర్గాల సంఖ్య 12 నుంచి 13కు చేరనుంది. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాల భౌగోళిక స్థితిగతుల్లో కూడా మార్పులు చోటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఆయా నియోజకవర్గాల పరిధిలో ఉన్న మండలాలు పక్క నియోజకవర్గంలో కలిసే అవకాశాలున్నాయి. దీనికితోడు రిజర్వు స్థానాల సంఖ్య కూడా పెరగనున్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టిసారించడంతో ఈ అంశం చర్చకు దారితీస్తోంది. తెలంగాణలో నియోజకవర్గాల సంఖ్య పెంచాలని సీఎం కూడా ఇటీవల ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఎన్నికల సంఘం ఈ అంశంపై కసరత్తు ప్రారంభించడంతో చర్చ మొదలైంది. భారీ మార్పులు గతంలో జిల్లాలో తొమ్మిది నియోజకవర్గాలు మాత్రమే ఉండేవి. 2009లో జరిగిన పునర్విభజనతో కొత్తగా బెల్లంపల్లి నియోజకవర్గం ఆవిర్భవించగా, లక్సెట్టిపేట ఎమ్మె ల్యే స్థానం మంచిర్యాల నియోజకవర్గంగా రూపాంతరం చెందింది. ఇప్పుడు మరోమారు పునర్విభజన అంశం తెరపైకి రావడంతో మార్పులు అనివార్యం కానున్నాయి. 2011 జనాభా లెక్కలను ఆధారంగా చేసుకుని పునర్విభజన చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. ఈ లెక్కల ప్రకా రం జిల్లాలో 27.41 లక్షల జనాభా ఉంది. ప్రతి 2.30 లక్షల జనాభాకు ఒక నియోజకవర్గం చొప్పున పునర్విభజన జరిగే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాలు భావి స్తున్నాయి. దీంతో జిల్లాలో రెండు లేదా మూడు నియోజకవర్గాలు పెరగనున్నాయి. ముఖ్యంగా అత్యధిక జనాభా కలిగిన ఆదిలాబాద్ నియోజకవర్గంలో మార్పు లు అనివార్యం కానున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆదిలాబాద్ అర్బన్, బోథ్ నియోజకవర్గం పరిధిలోని కొన్ని మండలాలను కలిపి ఆదిలాబాద్ రూరల్ నియోజకవర్గం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. పెరగనున్న రిజర్వుడ్ స్థానాలు తెలంగాణలో ఎక్కడా లేని విధంగా జిల్లాలో సగం అసెంబ్లీ నియోజకవర్గాలు రిజర్వు అయ్యాయి. ఆసిఫాబాద్, బోథ్, ఖానాపూర్ నియోజకవర్గాలు ఎస్టీలకు రిజర్వు కాగా, చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాలు ఎస్సీ సామాజికవర్గానికి కేటాయించారు. పునర్విభజనతో తెలంగాణలో పెరుగనున్న నియోజకవర్గాలకు సంఖ్యను బట్టి రిజర్వు స్థానాల సంఖ్య కూడా పెరగాల్సి ఉంటుంది. దీంతో గిరిజనుల జనాభా అధికంగా ఉన్న జిల్లాలో రిజర్వుడు స్థానాల సంఖ్య ఆరుకు చేరడం ఖాయంగా కనిపిస్తోంది. -
నియోజకవర్గాల పునర్విభజన - ఒక పరిశీలన
బి. కృష్ణారెడ్డి, డెరైక్టర్, క్లాస్-1 స్టడీ సర్కిల్, హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ప్రక్రియ నేపథ్యంలో.. నూతనంగా ఏర్పాటయ్యే తెలంగాణ రాష్ట్రంలో విధానసభ స్థానాలను పెంచాలనే ప్రతిపాదన తెర మీదకు వచ్చింది. ఈ విషయంలో కొంత మంది రాష్ట్ర విభజనపై ఏర్పాటైన జీఓఎం (గ్రూప్ ఆఫ్ మినిస్టర్‌స)తో చర్చలు జరపడంతో.. ఈ అంశం ప్రాముఖ్యతను సంతరించుకొంది. ఈ నేపథ్యంలో నియోజక వర్గాల పునర్విభజనకు సంబంధించిన రాజ్యాంగ ప్రకరణలు, చట్ట ప్రక్రియలు, అసెంబ్లీ స్థానాలు స్వల్పంగా ఉండడం ఎటువంటి ప్ర భావాన్ని చూపుతుంది తదితర అంశాలపై పరిశీలన.. ప్రజాస్వామ్య దేశాల్లో ఎన్నికలకు, ప్రజా ప్రాతినిధ్యానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఎన్నికలు ప్రజాస్వామ్యానికి వెన్నెముక వంటివి. పాలనా సౌధానికి పునాది. ఓటర్లు తమకు రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన ఓటు హక్కు ద్వారా నియోజకవర్గ ప్రాతిపదికగా తమ ప్రతినిధులను ఎన్నుకుంటారు. మనదేశంలో ఏకసభ్య నియోజకవర్గ విధానం అమల్లో ఉంది. అంటే ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఒక్కొక్క సభ్యుడు మాత్రమే ఎన్నికవుతాడు. నియోజకవర్గ పరిమాణం, సరిహద్దులు వంటి అంశాలు ఎన్నికల ఫలితాలను చెప్పుకోదగ్గ స్థారుులోనే ప్రభావితం చేస్తాయి. కాబట్టి నియోజకవర్గాల ఏర్పాటు, పునర్విభజన శాస్త్రీయంగా, వాస్తవికంగా ఉండాలి. ఈ ప్రక్రియ మొత్తాన్ని స్వతంత్ర వ్యవస్థతో నిర్వహించాలి. అందుకోసం రాజ్యాంగంలో కొన్ని ఏర్పాట్లు ఉన్నాయి. ఎన్నికలు, నియోజకవర్గాలు విభజన: భారత రాజ్యాంగం 15వ భాగం ప్రకరణ 324 నుంచి 329 వరకు ఎన్నికలు, ఎన్నికల సంఘం అధికారాలు, విధులను ప్రస్తావించారు. స్థానిక సంస్థల ఎన్నికలు మినహా అన్ని ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. ప్రకరణ 326 ప్రకారం లోక్‌సభకు, రాష్ట్ర విధానసభకు ప్రాదేశిక నియోజకవర్గాల ప్రాతిపదికన సార్వజనీన వయోజన ఓటు హక్కు ద్వారా ప్రత్యక్షంగా ఎన్నికలు నిర్వహిస్తారు. రాజ్య సభకు, రాష్ట్ర విధానపరిషత్‌కు పరోక్షంగా నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలో ఎన్నికలు జరుగుతాయి. వీటికి నియోజకవర్గాలు ఉండవు. రాజ్యసభ సభ్యులు ఆయా రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తే, విధానపరిషత్ సభ్యులు ప్రత్యేక ఓటర్ల ద్వారా ఎన్నికవుతారు. పునర్విభజన - ప్రత్యేక కమిషన్: లోక్‌సభ, రాష్ట్ర విధానసభకు ప్రత్యక్షంగా ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి అందుకనుగుణంగా ఆ రాష్ట్ర జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల సంఖ్యను నిర్ణయిస్తారు. దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా ఒకే ప్రాతిపదికను తీసుకుంటారు. రాష్ట్రానికి, రాష్ట్రానికి మధ్య గానీ, ఒక రాష్ట్రంలో నియోజకవర్గాల మధ్యగానీ ఎటువంటి తేడా ఉండదు. పదేళ్లకోసారి జరిగే జనాభా గణాంకాల సేకరణ తర్వాత మారిన జనాభాకనుగుణంగా లోక్‌సభ, విధానసభ నియోజకవర్గాల సరిహద్దులను సవరించాలి. ఇందుకు సంబంధించి 82, 170ప్రకరణలను రాజ్యాంగంలో ప్రస్తావించారు. ఈ పునర్విభజన ప్రక్రియ పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పాటైన పునర్విభజన కమిషన్ ద్వారా జరుగుతుంది. ఇంతవరకూ 1952, 1962, 1972, 2002లో నాలుగు పర్యాయాలు పునర్విభజన కమిషన్లు ఏర్పాటయ్యాయి. వాటి సూచన మేరకే పునర్విభజన జరిగింది. సాగిందిలా: మొదటి లోక్‌సభలో (1952) మొత్తం సభ్యుల సంఖ్య 489. అయితే 1973లో 31వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ సంఖ్యను 545కు పెంచారు. దీనికి 1971 జనాభాను ప్రాతిపదికగా తీసుకున్నారు. 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా (1976) నియోజకవర్గాల పునర్విభజన సంఖ్యను 2001 సంవత్సరం వరకు స్తంభింపజేశారు. దీని ముఖ్యోద్దేశం.. దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలు లోక్‌సభలో తమకున్న సీట్లు కోల్పోకుండా కాపాడటం. ఈ రాష్ట్రాలలో కుటుంబ నియంత్రణ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయడంతో చెప్పుకోదగ్గ స్థాయిలో జనాభా తగ్గింది. దీంతో ఆయా రాష్ట్రాలలో లోక్‌సభ స్థానాలు తగ్గి, ఉత్తరాది రాష్ట్రాల్లో లోక్‌సభ సీట్లు పెరిగాయి. ఈ వ్యత్యాసాన్ని తగ్గించడానికి పునర్విభజన ప్రక్రియను 2001 వరకు స్తంభింపజేశారు. దీన్ని 84 రాజ్యాంగ సవరణ చట్టం 2001 ద్వారా 2026 వరకు పొడిగించారు. అంటే ప్రస్తుతం ఉన్న లోక్‌సభ స్థానాల సంఖ్య 2026 వరకు మారదు. నాలుగో పునర్విభజన కమిషన్ 2002: సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కుల్దీప్సింగ్ అధ్యక్షతన నాలుగో పునర్విభజన కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో అప్పటి భారత ఎన్నికల కమిషనర్ బి.బి. టాండన్‌తోపాటు సంబంధిత రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సభ్యులుగా వ్యవహరించారు. ఈ ముగ్గురు పూర్తి కాల సభ్యులు. వీరుకాకుండా ఐదుగురు లోక్‌సభ్యులు, సంబంధిత రాష్ట్రానికి చెందిన ఐదుగురు విధాన సభ సభ్యులు సహ సభ్యులుగా వ్యవహరిస్తారు. అయితే వీరికి ఎటువంటి ఓటుహక్కు ఉండదు. కమిషన్ కీలక నిర్ణయాలను ముగ్గురు పూర్తికాల సభ్యులు వూత్రమే తీసుకుంటారు. 84 రాజ్యాంగ సవరణ (2001), 87 రాజ్యాంగ సవరణ (2003) చట్టాల ప్రకారం 2026 తర్వాత సేకరించే జనాభా గణాంకాల వరకు లోక్‌సభలో వివిధ రాష్ట్రాలకు కేటాయించిన సీట్ల సంఖ్య, అలాగే రాష్ట్ర శాసనసభలో సైతం సీట్ల సంఖ్యలో ఎలాంటి మార్పు ఉండదు. షెడ్యూల్ కులాలు, తెగలకు రిజర్వ చేసే సీట్లు మాత్రం 2001 జనాభా లెక్కల మేరకు నిర్ణయించారు. దాంతో వీరి ప్రాతినిధ్యం పెరిగింది. న్యాయసమీక్ష పరిధిలోకి రావు: రాజ్యాంగ ప్రకరణ 329 మేరకు పునర్విభజన కమిషన్ నిర్ణయాలను న్యాయస్థానంలో ప్రశ్నించడానికి వీల్లేదు. 1967లో మేఘరాజ్ వర్సెస్ పునర్విభజన కమిషన్ వివాదంలో సుప్రీంకోర్టు ఈ విషయాన్ని ధ్రువీకరించింది. పునర్విభజన విషయంలో కమిషన్‌దే తుది నిర్ణయమని తీర్పునిచ్చింది. ప్రజాభిప్రాయసేకరణ, సూచనలతో, విస్తృత స్థాయిలో ప్రక్రియలో పునర్విభజన ప్రక్రియును కమిషన్ చేపట్టడమే ఇందుకు కారణం. పునర్విభజన, సీట్ల సంఖ్య: సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రాల సమతౌల్యత దెబ్బతింటుందనే భయంతో లోక్‌సభ స్థానాలు స్తంభింపజేయడంలో ఔచి త్యం ఉంది. కానీ రాష్ట్ర శాసనసభ స్థానాలను 2001 జనాభా మేరకు సవరించక తప్పలేదు. పెరిగిన జనాభాకు అనుగుణంగా శాసనసభలో ప్రజావాణిని వినిపించడానికి అదనపు ఎమ్మెల్యేలు అవసరం. ప్రస్తుతం కొనసాగుతున్న విధానం వల్ల ఉత్తరప్రదేశ్‌లో ఒక లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో 5 అసెంబ్లీ స్థానాలుంటే, బీహార్- మహారాష్ట్రలలో 6, ఆంధ్రప్రదేశ్-పశ్చిమ బెంగాల్లో 7 అసెంబ్లీ స్థానాలున్నాయి. ప్రతినిధుల సంఖ్య పెరగడం వల్ల జవాబుదారీతనం పెరుగుతుంది. ఓటర్లకు, ప్రజా ప్రతినిధుల మధ్య సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. వేగవంతమవుతున్న పట్టణీకరణ నేపథ్యంలో పారిశ్రామిక కేంద్రాల్లో విపరీతంగా జనాభా పెరిగింది. ఢిల్లీ, గుర్గావ్, నోయిడా, ఫరీదాబాద్ వంటి పట్టణాల్లో 15 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. ఈ పరిస్థితులల్లో వీరికి సరైన ప్రాతినిధ్యం లభించడం లేదు. దీంతో శాసనసభ స్థానాలను పెంచాల్సిన అవసరం ఉంది. ప్రజా సమస్యలు ప్రధానం: పునర్విభజన కమిషన్ పనితీరు, దాని సిఫార్సుల వల్ల సంభవించిన మార్పులపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. చట్టబద్ధంగా ఏర్పాటైన వ్యవస్థ కావడంతో కమిషన్ సిఫార్సులను న్యాయస్థానంలో సవాలు చేయడానికి వీలుల్లేకుండా ప్రకరణ 329 అడ్డు రావడం, దాన్ని సుప్రీంకోర్టు సమర్థించడం వివాదాస్పదమైంది. ఆదివాసి ప్రాంతాల్లో సీట్లు తగ్గడం, మైదాన ప్రాంతాల్లో పెరగడం ఆదివాసీలకు ఇబ్బంది కలిగించే పరిణామమే. 2001 జనాభా ప్రాతిపదికగా పునర్విభజన జరిగినప్పటికీ.. రాష్ట్రాలకు కేటాయించిన సీట్ల సంఖ్యలో మార్పులేదు. దీంతో దక్షిణాది రాష్ట్రాలు లబ్ధి పొందాయి. ఉత్తరాది రాష్ట్రాలు నష్టపోయాయి. ప్రజాప్రతినిధుల పనితీరు, సమర్థత, నిబద్ధత, జవాబుదారీతనం, ప్రజాసమస్యల పట్ల అవగాహన, స్పందన ఆశించిన స్థాయిలో లేదనేది కఠోర వాస్తవం. జనాభా మేరకు ప్రాతినిధ్యాన్ని పెంచితే చేకూరే అదనపు ప్రయోజనం ఏంటి? అనేది ప్రధాన సంశయం. ప్రజాధనం అదనంగా వృథాకావడం తప్ప అనేది జనసామాన్య, మేధావుల అభిప్రాయం. అసెంబ్లీ స్థానాల పెంపు అవసరమా? పార్లమెంట్ స్థానాలను పెంచాలన్నా, పునర్విభజన చేయాలన్న రాజ్యాంగ ప్రకరణ 82 ప్రకారం, పార్లమెంట్ ఒక చట్టం ద్వారా మాత్రమే.. పునర్విభజన కమిషన్, కేంద్ర ఎన్నికల సంఘం సిఫార్సుల మేరకు చేయాల్సి ఉంటుంది. కానీ రాష్ట్ర అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంచడం, పునర్విభజనకు అలాంటి ప్రక్రియ అవసరం లేదు. కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించి ఆ మేరకు అసెంబ్లీ స్థానాల సంఖ్యను పునర్వ్యవస్థీకరించవచ్చు (రాష్ర్టల విభజన సమయంలో). ఉదాహరణకు-ఉత్తరాఖండ్ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. 2001లో ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆ రాష్ట్రంలో కేవలం 22 అసెంబ్లీ స్థానాలు మాత్రమే ఉండేవి. వాటిని పునర్విభజన ద్వారా 70 స్థానాలకు పెంచారు. ఇదే ప్రాతిపదికన.. ప్రతిపాదించిన తెలంగాణ రాష్ట్రంలో కూడా స్థానాలను పెంచవచ్చు. ఈ విషయుంలో నిర్ణయుం వెలువడాల్సి ఉంది. పరిమిత సీట్లు-రాజకీయ అస్థిరత: ప్రస్తుతం దేశవ్యాప్తంగా 100 స్థానాలకు మించని అసెంబ్లీ స్థానాలు ఉన్నా రాష్ట్రాల సంఖ్య 12. ఆయా రాష్ట్రాలను పరిశీలిస్తే.. సిక్కింలో అతి తక్కువగా 32 స్థానాలు ఉంటే, గోవా, మిజోరం రాష్ట్రాలలో 40 చొప్పున, మణిపూర్, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాలలో 60 చొప్పున స్థానాలు ఉన్నాయి. ఉత్తరాఖండ్‌లో అసెంబ్లీ స్థానాల సంఖ్య -70. ఛత్తీస్‌గఢ్‌లో 90, హర్యానాలో 90, హిమాచల్‌ప్రదేశ్‌లో 68, జార్ఖండ్‌లో 81 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ ప్రస్తావించిన అధిక శాతం రాష్ట్రాలలో రాజకీయ అస్థిరత రాజ్యమేలుతోంది. ప్రభుత్వాలు నిర్దేశిత కాలం కొనసాగిన సందర్భాలు చాలా తక్కువగా ఉంటున్నారుు. ఈ నేపథ్యంలో రాజకీయు అస్థిరత అభివృద్ధికి ఆటంకంగా వూరుతుందనే వివుర్శ నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ స్థానాలను పెంచడం ద్వారా రాజకీయు అస్థిరతను అధిగమించవచ్చనే ఒక అభిప్రాయం వ్యక్తమవుతుంది. సీట్ల సంఖ్యను పెంచడం ద్వారా రాజకీయు స్థిరత్వాన్ని సాధించవచ్చు అనే విషయుంలో కూడా భిన్న అభిప్రాయూలు ఉన్నాయి. ఎందుకంటే ఎక్కువ అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రాల పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా లేదనే విషయూన్ని గత అనుభవాల ద్వారా గవునించవచ్చు. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్‌ను తీసుకుంటే..గతంలో ఎన్నోసార్లు రాజకీయంగా అస్థిర పరిస్థితులు ఏర్పడ్డాయి. స్వల్ప వ్యవధిలోనే ప్రభుత్వాలు మారాయి. నిబద్ధత, విలువలు, వ్యక్తిగత నైతిక, సేవాభావం ఉన్నప్పుడు సంఖ్యా పరమైన పరిమితులు ఉండవు అనేది జగమెరిగిన సత్యం. నాలుగో పునర్విభజన కమిషన్ ముఖ్యాంశాలు లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాలను 2001 జనాభా ప్రాతిపదికగా పునర్విభజన చేయాలి. పునర్విభజించిన నియోజకవర్గాలు సాధ్యమైనంతవరకు జనాభాపరంగా రాష్ట్ర మంతటా ఒకే పరిమాణంలో ఉంటాయి. పునర్విభజన ప్రక్రియ వల్ల ఆయా రాష్ట్రాలకు కేటాయించిన పార్లమెంటరీ, అసెంబ్లీ స్థానాల సంఖ్యలో మార్పు ఉండదు. వీలైనంతవరకు అన్ని నియోజకవర్గాల్లో జనాభా సమానంగా ఉంటుంది. నియోజకవర్గాల ఏర్పాటులో భౌగోళికాంశాలు, పౌరులకు అనుకూలత మొదలైన అంశాలను పరిగణనలోకి తీసుకొంటారు. నియోజకవర్గాలను ఏర్పాటు చేసేటప్పుడు వీలైనంతవరకు జిల్లాలో ఉప విభాగాలైన మండలం, గ్రామం విభజనకు గురికాకుండా చూస్తారు. అసెంబ్లీ నియోజక వర్గం ఏదో ఒక పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోనే ఉంటుంది. నియోజకవర్గం మొత్తం జనాభా శాతంలో షెడ్యూల్డ్ తెగల జనాభా శాతం పెద్దదిగా ఉంటే అది వారికి రిజర్వ చేస్తారు. అలాగే ఒక నియోజకవర్గంలో మిగిలిన వర్గాల జనాభా శాతం కంటే షెడ్యూల్ కులాల జనాభా శాతం ఎక్కువ ఉంటే ఆ నియోజకవర్గాన్ని వారికి కేటాయిస్తారు.


